ఎయిడ్స్‌ బాధితులకు అండగా ఉంటాం

2 Dec, 2023 01:48 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు అర్బన్‌: ఎయిడ్స్‌ బారిన పడిన వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన హాలులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అవగాహనతో ఎయిడ్స్‌ను నిర్మూలిద్దామన్నారు. ఎయిడ్స్‌ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో వివరించారు. ఎయిడ్స్‌ నిర్ధారణ అయిన వారు మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం, మందులు క్రమం తప్పకుండా తీసుకుంటే జీవితకాలాన్ని పెంచుకోవచ్చన్నారు. అందుకు అవసరమైన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏఆర్‌టీ మందులు వాడుతున్న 2,168 మందికి ప్రభుత్వం పెన్షన్‌లు ఇస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను అందిస్తున్నట్లు వివరించారు. బాధితుల వివరాలను స్వచ్ఛంద సంస్థలు తన దృష్టికి తీసుకొస్తే వారికి అవసరమైన సహాయం వ్యక్తిగతంగా కూడా చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమయ్యే శిక్షణ కూడా బాధితులకు ఇప్పిస్తామన్నారు. బాధితుల పట్ల ఎవరూ వివక్ష చూపకూడదన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.శ్యాంబాబు మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చట్టాలున్నాయన్నారు. ఈ చట్టాల ప్రకారం బాధితులపై అవమానకరంగా ప్రవర్తించడం, హక్కుల పట్ల నిర్లక్ష్యం వహించడం నేరమని తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సహకారంతో 300 మంది బాధితులకు అవసరమైన దుస్తులు, దుప్పట్లు, పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిత్యావసరాలు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. లయన్స్‌ క్లబ్‌ సహకారంతో సైకిల్‌, కుట్టుమిషన్‌ అందించారు. ఎయిడ్స్‌ సంబంధిత అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన 20 మందికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం బాధితులతో కలిసి కలెక్టర్‌ భోజనం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి, టీబీ, ఎయిడ్స్‌ నివారణ అధికారి సురేష్‌కుమార్‌, డీఐఓ పద్మజ, జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ, డీపీఎం వాణిశ్రీ, టీబీ డీపీసీ రత్నకుమారి, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు