హెల్త్‌ సూపర్‌వైజర్‌ హఠాన్మరణం

2 Dec, 2023 01:48 IST|Sakshi
ఎయిడ్స్‌ ర్యాలీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి

పొదిలిః వైద్యారోగ్య శాఖలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నారు శ్రీనివాసరెడ్డి (54) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా స్థానిక పెద్ద బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ తర్వాత పది నిముషాల వ్యవధిలోనే ఒంట్లో నలతగా ఉందని పక్కనే ఉన్న సామాజిక వైద్యశాలకు వెళ్లారు. అక్కడి వైద్యులు ఈసీజీ తీశారు. వెంటనే ఒంగోలు వెళ్లాలని సూచించారు. అప్పటికే తీవ్ర గుండెపోటు రావడంతో శ్రీనివాసరెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామం మార్కాపురం మండలం గజ్జలకొండకు తరలించారు.

హెల్త్‌ శీనుగా తాలూకాలో పరిచయం...

శ్రీనివాసరెడ్డి అనే కంటే హెల్త్‌ శీను అంటే పొదిలి తాలూకాలోని మూడు మండలాల్లో చాలా మందికి పరిచయం. అందరినీ అప్యాయంగా పలకరించడం, వృత్తిపరంగా తనకు చేతనైనంత మేర రోగులకు ఆసరాగా ఉండటంతో శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వచ్చింది. పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి పీహెచ్‌సీలలో పనిచేస్తుండటం, పొదిలి పట్టణంలో నివాసం ఉండటంతో తాలూకాతో పాటు పట్టణంలో చాలా మందికి శ్రీనివాసరెడ్డితో పరిచయం ఉంది. పొదిలి తాలూకా ఎన్‌జీఓ సంఘం అధ్యక్షునిగా సుమారు 20 సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు. ప్రస్తుతం కూడా అధ్యక్షునిగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీలో పాల్గొన్న పది నిముషాలకే గుండెపోటు

మరిన్ని వార్తలు