తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

2 Dec, 2023 01:48 IST|Sakshi

ఒంగోలు అర్బన్‌: మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం జిల్లాపై ఉంటుందనే ప్రాథమిక అంచనా మేరకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు తుఫాన్‌ గురించి రైతులకు తెలియచేసి పంటలను జాగ్రత్త చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తీర ప్రాంత గ్రామాల్లోని తుఫాన్‌ షెల్టర్లను నిర్వహణలోకి తీసుకొచ్చేలా శనివారం నుంచి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ, మండల స్థాయిలోని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యుత్‌, రవాణా వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం లేకుండా నెట్‌వర్క్‌ ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయాలన్నారు. ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో 1077 కాల్‌ సెంటర్‌ను నేటి నుంచి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తుఫాన్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ శ్రీనివాసులు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

మరిన్ని వార్తలు