మిచాంగ్‌ టెన్షన్‌

3 Dec, 2023 01:08 IST|Sakshi
దర్శి, అద్దంకి రోడ్‌లో ముండ్లమూరు మండలంలో కోతకు వచ్చిన వరి

ఒంగోలు అర్బన్‌:

మిచాంగ్‌ తుపాను హెచ్చరికలతో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి జాగ్రత్త చర్యలకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రాణనష్టం జరగకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పంటలు నష్టపోకుండా ఉండేలా రైతులను అప్రమత్తం చేస్తూ ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 2500 హెక్టార్లలో వరిపంట కోత దశకు రావడంతో నష్ట నివారణపై రైతులకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ పంట నష్టం వాటిల్లితే తక్షణమే అంచనా వేసి బాధితులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. పశునష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో జిల్లాలోని అన్నీ పాఠశాలలకు కలెక్టర్‌ సెలవులు ప్రకటించడంతో పాటు అధికారులు, ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసేది లేదని స్పష్టం చేశారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 105 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రవాణా, విద్యుత్‌ సరఫరా వ్యవస్థకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను కలెక్టర్‌ ఆదేశించారు. పొక్లెయినర్లు ఇతర అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకునే చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో దురదృష్టవశాత్తు ఎవరైనా నీటిలో ఉండిపోతే రక్షించేలా పడవలు, ఇతర సామగ్రి సిద్ధంగా ఉంచారు. 4వ తేదీ అర్ధరాత్రి నుంచి 5వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేలా ప్రజలకు తెలియజేస్తున్నారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో 1077 నంబర్‌తో 24 గంటలూ అందుబాటులో ఉండేలా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మిచాంగ్‌ తుపానును అన్నీ విధాలుగా ఎదుర్కొనేలా ప్రాణ, పశు నష్టం వాటిల్లకుండా ఉండేలా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పక్కా ప్రణాళికలతో అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేశారు. నిరంతరం పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేసేలా జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశాలు నిర్వహిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఆదివారం కొత్తపట్నం తీర ప్రాంతంలో కలెక్టర్‌ పర్యటించనున్నారు.

జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా మత్స్యశాఖతో శుక్రవారం రాత్రి నుంచే హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేశారు. మత్స్యకార గ్రామాల్లో స్థానిక పెద్దల సహకారంతో తుపాను తీవ్రతపై జాలర్లకు విస్తృతమైన అవగాహన కల్పించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. తుపాను తీరానికి సమీపంలోకి వచ్చే సమయంలో సముద్ర నీటి మట్టం సుమారు ఒకటిన్నర మీటరు పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు. తీరప్రాంత మండలాల్లో ఉన్న 27 తుపాను షెల్టర్లను వినియోగించుకునేలా చర్యలు ప్రారంభమయ్యాయి. తీరప్రాంత మండలాలతో పాటు సమీప మండలాల ప్రజలకు డిసెంబర్‌ నెలకు సంబంధించిన రేషన్‌ సరుకులు వెంటనే అందజేసేలా చర్యలు తీసుకున్నారు. తుపాను ఖర్చుల కోసం టీఆర్‌–27 కింద వినియోగించుకునేందుకు జిల్లాకు రూ.1 కోటి ప్రభుత్వం కేటాయించింది.

● తుపాను వల్ల విద్యుత్‌ అంతరాయం కలగకుండా కలిగినా వెంటనే పునరుద్ధరించేలా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ వీజీ సత్యనారాయణ జిల్లా విద్యుత్‌శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉద్యోగులకు సెలవులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రజలకు పలు జాగ్రత్త సూచనలు చేశారు. వర్షం, గాలులు ఉన్న సమయంలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు తాకకూడదన్నారు. రైతులు విద్యుత్‌ మోటర్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరెంటు తీగల కింద, స్తంభాల వద్ద నిలబడకూడదని సూచించారు. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగినా ఇతర సమస్యలు తలెత్తినా 1912 నంబర్‌ కాని సంబంధిత లైన్‌మెన్‌, సబ్‌స్టేషన్‌కు తెలపాలని సూచించారు.

వ్యవసాయ శాఖ:

తుపాను హెచ్చరిక నేపథ్యంలో వరి రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. పంటలపై జాగ్రత్తలు తీసుకోవాలని, కోతకు వస్తే తక్షణమే యంత్రాల్లో కోసి సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని చెప్పారు. టార్బలిన్‌ పట్టలను అందుబాటులో పెట్టుకోవాలని కోరారు. పత్తి, మిరప, ఇతర పంటల్లో నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులకు రైతులకు తగిన సూచనలు చేయాలని కోరారు.

మత్స్యకారులూ జాగ్రత్త

జిల్లాలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోనికి వెళ్లవద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలో 900 కి.మీల దూరంలో కేంద్రీకృమైందని, మూడు నుంచి 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సమాచారం అధికారికంగా అందిందని చెప్పారు. వేటకు వెళ్లిన వారు సముద్రంలో ఉంటే తక్షణమే బయటకు రావాలని కోరారు. బోట్స్‌, నెట్స్‌ను ఒడ్డుకు దూరంగా ఉంచుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు