బాల్య వివాహాలు జరగకుండా గట్టి నిఘా

3 Dec, 2023 01:08 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న డీఆర్‌డీఏ పీడీ రవికుమార్‌

ఒంగోలు టౌన్‌: గ్రామాల్లో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా సమాఖ్య సభ్యులు గట్టి నిఘా ఉంచాలని డీఆర్‌డీఏ పీడీ తేళ్ల రవికుమార్‌ సూచించారు. జిల్లా సమాఖ్య కార్యాలయంలో శనివారం సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యల బలోపేతానికి సభ్యులు బాధ్యతగా పనిచేయాలని కోరారు. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిని ఏర్పాటు చేసుకొని శుభ్రమైన మంచినీరు లభించేలా కమిటీలు కృషి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎస్‌ఎం ఆలీ అన్నారు. తొలుత జిల్లా సమాఖ్య సభ్యులతో చీఫ్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్‌ గోవిందమ్మ, డీపీఎం ఐబీ కృపారావు, ఏపీఎం ఐబీ గంటా శ్రీనివాసరావు, ఏపీఎం హెచ్‌డీ శేషు పాల్గొన్నారు.

5న హర్షిణి డిగ్రీ కాలేజీలో జాబ్‌మేళా

ఒంగోలు టౌన్‌: ఈనెల 5వ తేదీ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి.భరధ్వాజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భగీరథ కెమికల్‌ కంపెనీలోని ప్రొడక్షన్‌, క్వాలిటీ కంట్రోల్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో వివిధ రకాల ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్‌, బీఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ, ఎంఎస్సీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటుగా ఆధార్‌ కార్డు జిరాక్స్‌లు తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే జిల్లా ఉపాధి కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం సెప్టెంబర్‌ 2022 నుంచి ఏప్రిల్‌ 2023 వరకు దరఖాస్తు చేసుకొని ఎలాంటి రసీదు తీసుకోని అభ్యర్థులు ఉపాధి కార్యాలయంలో ఈనెల 30లోపు సంప్రదించాలన్నారు.

మరిన్ని వార్తలు