హత్య చేసి..ఆత్మహత్యగా చిత్రీకరణకు యత్నం

4 Dec, 2023 12:46 IST|Sakshi
నిందితురాలు లక్ష్మమ్మ

కురిచేడు: వివాహేతర సంబంధం కొనసాగిన వ్యక్తితో ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ పడి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన మండలంలోని బోయపాలెంలో వెలుగు చూసింది. ఎస్సై యం దేవకుమార్‌ తెలిపిన వివరాల మేరకు..స్థానిక బోయపాలెం గ్రామానికి చెందిన రేకుల పెద్ద అంకయ్య(40)కు అదే ప్రాంతానికి చెందిన బొనిగల లక్ష్మమ్మతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అంకయ్య, లక్ష్మమ్మకు మధ్య నగదు ఇచ్చిపుచ్చుకునే క్రమంలో శనివారం రాత్రి గొడవ జరిగింది.

అంకయ్య లక్ష్మమ్మపై చేయి చేసుకోవడంతో ఆమె ఆగ్రహానికి గురై అంకయ్య మర్మాంగాలపై దాడి చేసింది. దీంతో అంకయ్య కిందపడి తలకు గాయాలయ్యాయి. దీంతో ఇంట్లోనే ఉన్న కుమారుడు ఏడుకొండలుతో కలిసి రోకలిబండతో తలపై కొట్టడంతో అంకయ్య మృతి చెందాడు. వెంటనే ఇద్దరూ కలిసి అంకయ్యకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే తెల్లారడంతో ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. అయితే పెద్ద అంకయ్య శనివారం రాత్రి లక్ష్మమ్మ ఇంటికి వెళ్లడాన్ని గమనించిన తమ్ముడు..తెల్లారినా ఇంటికి రాకపోవడంతో లక్ష్మమ్మ ఇంటికి వెళ్లగా అంకయ్య మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

అనంతరం బస్టాండ్‌లో ఉన్న లక్ష్మమ్మను అదుపులోనికి తీసుకొని సంఘటనా స్థలానికి తీసుకురాగా..ఆమె కుమారుడు పరారయ్యాడు. ఈ సమయంలో మృతుని కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. అనంతరం ఎస్సై ఎం దేవకుమార్‌ లక్ష్మమ్మను విచారించి స్టేషన్‌కు తరలించారు. ఎస్సై ఎం దేవకుమార్‌ కేసు నమోదు చేయగా సీఐ పాపారావు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగింఛారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు