ఐదేళ్లుగా దూరం..బిడ్డ పెళ్లిలో ఒక్కటయ్యారు

30 May, 2023 11:08 IST|Sakshi

ఇల్లంతకుంట(మానకొండూర్‌):ట్టుకున్న భార్య... కన్న కొడుకే కసాయివాళ్లుగా మారారు. భూమి అమ్మిన డబ్బులు ఇవ్వడం లేదని భర్తను భార్య, కొడుకు కలిసి కత్తితో పొడిచి.. గొంతి నులిమి హత్య చేశారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన దర్పల్లి శంకర్‌(55) వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. భార్య చంద్రకళ, ఇద్దరు కూతుళ్లు మౌనిక, మమత, కుమారుడు వంశీకృష్ణతో కలిసి ఐదేళ్లకు పైగా భర్తకు దూరంగా సిద్దిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.

ఈనెల 5వ తేదీన పెద్ద కూతురు మౌనిక వివాహం చేసేందుకు స్వగ్రామం వచ్చి భర్త శంకత్‌తో కలిసి ఉంటున్నారు. పెద్ద కూతురు వివాహం జరిపించారు. కొన్ని నెలల క్రితమే చిన్నకూతురు మౌనిక ప్రేమవివాహం చేసుకుంది. శంకర్‌ రెండెకరాల వ్యవసాయ భూమిని విక్రయిస్తే రూ.46 లక్షలు వచ్చాయని.. కూతురు పెళ్లి చేయగా మిగిలిన డబ్బులు కావాలని భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

ఈక్రమంలో ఆదివారం రాత్రి తండ్రీకొడుకులు శంకర్‌, వంశీకృష్ణ మధ్య డబ్బుల విషయం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య చంద్రకళ, కుమారుడు వంశీకృష్ణ కలిసి శంకర్‌పై కత్తితో పొట్ట భాగంలో దాడి చేశారు. అంతటితో ఆగకుడా వంశీకృష్ణ గొంతు నులుమడంతో శంకర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం శంకర్‌ హత్య విషయం బయటకు రావడంతో ఎస్సై రాజేశ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. మృతుడి సోదరి సుగుణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల రూరల్‌ సీఐ ఉపేందర్‌, ఎస్సై రాజేశ్‌ తెలిపారు.

బిడ్డ పెళ్లికి ఒక్కటై... డబ్బుల కోసం హత్య ?
ఐదేళ్లుగా దూరంగా ఉంటున్న చంద్రకళ–శంకర్‌ దంపతులు పెద్ద కూతురు మౌనిక వివాహం కోసమే ఒక్కటయ్యారు. బిడ్డ పెళ్లి చేయగా మిగిలిన డబ్బులు తమకు ఇవ్వాలని భార్య, కుమారుడు పట్టుబట్టడం.. శంకర్‌ ససేమిరా అనడంతోనే ముగ్గురి మధ్య గొడవ ముదిరి హత్యకు దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఆ ఐదు ఫుల్‌ బాటిళ్లు ఎక్కడివి ?
శంకర్‌కు మద్యం తాగే అలవాటు ఉందని, ఆదివారం ఐదు ఫుల్‌ బాటిళ్లు తెచ్చుకొని.. ఫుల్లుగా తాగి తమతో గొడవపడ్డాడని, తనను చంపేందుకు కత్తి దగ్గర పెట్టుకున్నాడని మృతుడి భార్య పోలీసుల ముందు చెప్పినట్లు తెలిసింది. గ్రామస్తుల వాదన ఇలా ఉంది శంకర్‌ ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదని, వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడంటున్నారు. అసలు ఆ ఐదు మద్యం బాటిళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం అతడికి ఏముందని, పథకం ప్రకారమే అందరిని నమ్మించేందుకే భార్య, కొడుకు మద్యం బాటిళ్లను ఇంట్లో పెట్టి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

పోలీసుల అదుపులో నిందితులు
శంకర్‌ భార్య చంద్రకళ, కుమారుడు వంశీకృష్ణను పోలీసులు ఉదయాన్నే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నేడో, రేపో అరెస్టు చూపే అవకాశం ఉంది.

మృతదేహాన్ని పరిశీలించిన సీఐ
శంకర్‌ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రి మార్చురీలో సిరిసిల్ల రూరల్‌ సీఐ ఉపేందర్‌ పరిశీలించారు. సీఐ ఉపేందర్‌ మాట్లాడుతూ శంకర్‌ను హత్య చేసిన భార్య, కుమారుడిని పట్టుకుని హత్యకు గల కారణాలను తెలుసుకుని, త్వరలోనే అరెస్టు చూపనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు