-

జోష్‌!

28 Nov, 2023 00:32 IST|Sakshi
సభకు హాజరైన ప్రజలు
కమలదళంలో

కరీంనగర్‌ను సిల్వర్‌సిటీగా మారుస్తా

కేంద్ర పథకాలు, నిధులను కేసీఆర్‌ అడ్డుకున్నారన్న ప్రధాని

కబ్జాదారులా... మీకోసం కొట్లాడే సంజయ్‌ కావాలా?

కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ కాషాయ దళంలో జోష్‌ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎస్సారార్‌ కళాశాల మైదానంలో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయసంకల్ప సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకావడం పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు కార్యకర్తలు, ప్రజలు సుమారు 30 వేల మంది పాల్గొన్నారు. మోదీ మట్లాడుతున్నంత సేపు జయధ్వానాలు పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొత్తం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కోసం మోదీ సర్కార్‌ నిధులు ఇచ్చినా.. కేసీఆర్‌ సర్కార్‌ అడ్డుకుందని, కేసీఆర్‌ కరీంనగర్‌ను లండన్‌ చేస్తానని తప్పుడు వాగ్దానం చేశారని పేర్కొన్నారు. బీజేపీతోనే కరీంనగర్‌ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ‘కేసీఆర్‌ సాగునీటి పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం అవినీతి గురించి తెలంగాణనే కాదు.. యావత్‌ దేశానికి తెలుసు. అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌కు తగిన శిక్ష పడాలా.. వద్దా..?’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ సర్కార్‌ చిన్న, సన్నకారు రైతుల ఉసురుపోసుకుంది.. మోదీ సర్కార్‌ పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి సాయం చేసింది. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసింది. ఫిలిగ్రీ కళకు కరీంనగర్‌ ప్రసిద్ధి చెందింది. మన్‌ కీ బాత్‌ లో కూడా ప్రస్తావించాను. స్వర్ణకారులు, కళాకారుల కోసం పీఎం విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఇక్కడి ఫిలిగ్రీ కళాకారులకు ఆధునిక ట్రైనింగ్‌, లక్షల రూపాయల రుణం లభిస్తుంది. కరీంనగర్‌ను సిల్వర్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు బీజేపీ కృషి చేస్తుంది..’ అన్నారు. తను వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది.. కరీంనగర్‌ బాగు కోసమేనని స్పష్టం చేశారు.

ఎవరు కావాలో తేల్చుకోండి: బండి సంజయ్‌

‘పేదల కోసం కష్టపడి పనిచేసిన నాలాంటోళ్లను గెలిపించకపోతే.. పేదల కోసం ఎందుకు కొట్లాడాలని నా కార్యకర్తలు ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలే..? నా భార్యాపిల్లలను చంపుతామన్న భయపడకుండా ధర్మం కోసం, ప్రజల కోసం ఇన్నాళ్లు పోరాడిన. నాకు ఓట్లేసి గెలిపించకుంటే నా భార్యాపిల్లలు ప్రశ్నిస్తే ఏమని చెప్పాలి. కరీంనగర్‌ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలోని అన్ని వర్గాలు మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నయ్‌. ఒక్క చాన్స్‌ ఇస్తే ఐదేళ్లు మీకు సేవ చేసుకుంటా. కరీంనగర్‌కు రక్షణ కవచంగా నిలుస్తా’.. అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ కోరారు. ‘నమ్మిన సిద్ధాంతం కోసం, కమల వికాసం కోసం ఇదే కరీంనగర్‌లో బీజేపీ కార్యక్రమాల పోస్టర్లను గోడలకు అంటించిన. జాతీయ, రాష్ట్ర నాయకులొస్తే స్వాగతం పలకడానికి, కార్యక్రమాలు నిర్వహించేందుకు కరీంనగర్‌లో పార్టీ జెండాలు కట్టిన సామాన్య కార్యకర్తను. మీరు పెంచి పోషించిన కార్యకర్త. ఆ రోజు అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా గెలిపిస్తే, ఈనాడు మీ అందరి ఓట్లతో ఎంపీగా గెలిచిన వ్యక్తిని. నేను ఏనాడూ మా నాన్న పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం, సమాజాన్ని సంఘటితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి మీ ముందు నిలబడ్డా. చాలా మంది అంటుంటారు.. బండి సంజయ్‌ ఏం చేశారని. వాళ్లకు చెప్పండి.. 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. మీ అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నారు కదా.. ఎవరిచ్చారు? బియ్యం ఎవరిచ్చారు..? కరీంనగర్‌ అభివృద్ధికి రూ.9 వేల కోట్లు ఇచ్చిందెవరు? స్మార్ట్‌సిటీ నిధులు, గ్రామీణ సడక్‌ యోజన నిధులు, జాతీయ రహదారులిచ్చిందెవరు? ఈ దేశ అభివృద్ధికి నిధులిచ్చిందెవరు.. అలాంటి మహనీయుడికి నిలబడి చప్పట్లతో స్వాగతం పలకండి’ అని సంజయ్‌ కోరడంతో అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. తాను ఏనాడూ సంపాదన, కుటుంబం గురించి ఆలోచించలేదన్నారు. ‘డబ్బు ఆశ ఉంటే నేను మీకోసం కొట్లాడి జైలుకు పోకపోయేవాడిని కాదు. నామీద ఆరోపణలు చేసిన నేతల్లారా.. నేను అవినీతికి పాల్పడ్డట్లు రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం కరీంనగర్‌ అసెంబ్లీ ప్రజలకు రాసిస్తా.. ప్రమాణం చేసి చెబుతున్నా.. దమ్ముంటే డాక్యుమెంట్లు తీసుకురండి. డబ్బు సంపాదన ఉంటే బండి సంజయ్‌ రెండుసార్లు జైలుకు వెళ్లడు.. ఏ రోజు నా కు కష్టమొచ్చినా, ఇబ్బంది వచ్చినా నా వెనుక మో దీ ఆశీర్వాదం ఉంది. నా భుజం తట్టి ప్రోత్సహించారు. మీకోసం కొట్లాడితే 74 కేసులు పెట్టారు. మీకోసం ప్రాణత్యాగానికి వెనుకాడను. దయచేసి కరీంనగర్‌లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను బేరీజు వేయండి. ఎవరు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఎవరి కష్టార్జితంతో కరీంనగర్‌లో ఇట్లాంటి వాతావరణం చేశారో ఆలోచించండి..’

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్‌: బండి

‘రాష్ట్రాన్ని కేసీఆర్‌ నాశనం చేసిండు. డబుల్‌బెడ్రూం, ఉద్యోగాల పేరుతో అందరినీ మోసం చేశాడు. 6 లక్షల కోట్ల అప్పుల పాల్జేశారు. ఏ విధంగా మళ్లీ వాటిని పూడుస్తారు. కాంగ్రెస్‌ ఎట్లా అభివృద్ధి చేస్తుంది? ఎట్లా జీతాలు ఇస్తుంది? అందుకే బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అప్పులు తీరి సుస్థిర పాలనతో అభివృద్ధి చేయడం సాధ్యం. ఎమ్మార్సీఎస్‌ చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణ. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మోదీ వారి కల నెరవేర్చారు. కరీంనగర్‌లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులు (కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌) టోపీ పెట్టకుని నమాజ్‌ చేసుకుంటారు. ఎన్నికల తరువాత మసీదు జాగాలను కబ్జా చేస్తారు. ఎన్నికల ముందు గుడికిపోయి దండం పెడతారు. ఎన్నికలయ్యాక గుడి స్థలాలను మింగేస్తరు.. పేదల ఇండ్లను కూల్చివేస్తారు. కరీంనగర్‌ ప్రజలంతా ఏకం కండి.. రెండుసార్లు ఓడిపోయా.. ఒక్కసారి గెలిపించండి. 5 రోజులు కష్టపడితే.. 5 ఏండ్లు మీకు సేవ చేసుకుంటా. కరీంనగర్‌కు రక్షణ కవచంగా నిలుస్తా.. మోదీ దేవుడెట్లా అవుతాడంటున్నడు కేటీఆర్‌.. మరి నీ అయ్య దేవుడా? ఆర్టీసీ కార్మికులు చనిపోతే బయటకు రాని మూర్ఖుడు మీ అయ్య. విద్యార్థులు, నిరుద్యోగులు చనిపోతే బయటకు రాలే.. రైతులు వడ్లకుప్పలపై పడి చనిపోతే బయటకు రాలే.. ఉద్యోగులు గుండెపగిలి చనిపోతే మీ అయ్య బయటకు రాలే.. మహిళలపై అత్యాచారాలు జరిగితే బయటకు రాలే.. పేదల బాధలు తెలిసి ఎప్పటికప్పుడు స్పందిస్తున్న ప్రధాని మోదీ నిజంగా దేవుడే. ఆయన మనలను ఆశీర్వదించడానికి మన గడ్డ పైకి వచ్చారు’ అని బండి అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు బొడిగె శోభ, ఆరెపల్లి మోహన్‌, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, చెన్నమనేని వికాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు