చిరుత సంచారం.. ఎయిర్‌పోర్ట్‌లో కలకలం

18 Jan, 2021 10:54 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి‌: తెలంగాణలో పులి సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. పులుల సంఖ్య పెరగడంతో ఆ వన్యమృగాలు జనసంద్రంలోకి వస్తున్నాయి. గతంలో రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ పరిసరాల్లో అలజడి రేపిన చిరుత మళ్లీ ఆదివారం రాత్రి సంచరించిందనే వార్త ఉలిక్కిపడేలా చేసింది. శంషాబాద్‌ బహదూర్‌గూడలో చిరుత సంచరించినట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో అర్ధరాత్రి పులి పది నిమిషాల పాటు సంచరించిందని గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి గొల్లపల్లి రోడ్డులో ఎయిర్‌పోర్ట్‌ గోడ దూకి చిరుత వెళ్లింది.

పులి సంచరించిందనే వార్తతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. గతంలో శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ పరిసరాల్లో పులి కలకలం రేపిన విషయం తెలిసిందే. రహదారిపై దర్జాగా కూర్చుని అనంతరం జనాల రద్దీతో భయాందోళన చెంది వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. అప్పుడప్పుడు కనిపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలో కనిపించడం అధికారులు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు