2022 రౌండప్‌: ఈ ఏడాది మిగిల్చిన కన్నీటి గాయాలివే..

26 Dec, 2022 21:29 IST|Sakshi

మరో ఏడాది ముగింపునకు చేరుకుంది. ప్రతీ యేడులాగే.. ఆనవాయితీ ప్రకారం చివర్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకోవాలి కదా. అయితే ఈ ఏడాదిలో మునుపెన్నడూ లేనంత సంక్షోభాలన్ని, ప్రతికూల పరిస్థితుల్ని కొన్ని దేశాలు ఎదుర్కున్నాయి.  


ఉక్రెయిన్​ దురాక్రమణ
ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఇరుదేశాల సంక్షోభం.. యుద్ధంతో కీలక మలుపు తీసుకుంది. తమ దేశ ఔన్నత్యం కోసం ఉక్రెయిన్​, ఉక్రెయిన్​ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఉక్రెయిన్​ వ్యవహారాల్లో పాశ్చాత్య దేశాల జోక్యాన్ని ఖండిస్తున్న రష్యా.. రష్యా వేర్పాటువాదులకు మద్దతుగా  ఉక్రెయిన్​ గడ్డపై దురాక్రమణకు తెగబడింది. నాటో సభ్యత్వ ప్రయత్నాలు.. ఈ యుద్ధానికి అగ్నిలో ఆజ్యం పోశాయి. ఫిబ్రవరి 2022లో మొదలైన ఈ యుద్ధం.. యావత్​ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఆహార, ఇంధన, చమురు సంక్షోభాలు తలెత్తాయి. ఇరువైపులా సైన్య బలగాలతో పాటు అమాయకుల ప్రాణాలు పోయాయి. ఒకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్​.. మరోవైపు వ్లాదిమిర్​ జెలెన్​స్కీలు ఎవరూ వెనక్కి తగ్గలేదు. కీవ్​‌​మాస్కోలు దౌత్యం ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలన్న ప్రయత్నాలు బెడిసి కొడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం ద్వారా తమ పైచేయి ప్రదర్శించాలని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ భావిస్తున్నారు. ఇక దాదాపు 300 రోజుల పాటు సాగిన ఈ యుద్ధానికి ముగింపు పలకాలని, అదీ అర్థవంతంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ భావిస్తున్నారు.

శ్రీలంక ప్రజాగ్రహ జ్వాలలు
2022 మొదటి భాగం మొత్తం.. ప్రజాగ్రహ జ్వాలల్లో ద్వీప దేశం రగిలిపోయింది. ఆర్థిక సంక్షోభం కరోనా ప్రభావంతో ఆకాశానికి చేరింది. విదేశీ అప్పులు ముట్టకపోగా.. వ్యవసాయ సంబంధిత నిర్ణయాలు బెడిసి కొట్టాయి. ఆహార కొరతతో పాటు టూరిజంపై భారీగా ప్రతికూల ప్రభావం పడింది. నిత్యావరసరాల మొదలు ప్రతీ దాని ధరలు చుక్కలను తాకాయి. ఇంధన కొరతతో వాహనాలు నిలిచిపోవడంతో పాటు దేశంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. అవినీతిమయ కుటుంబ పాలన, ప్రభుత్వ అనాలోచిత.. అసమర్థ నిర్ణయాలను జీర్ణించుకోలేని ప్రజలు.. నిరసనాందోళనలకు దిగారు. ప్రధానినే గద్దె దిగిపోవాలంటూ రోడ్డెక్కారు. ఆ హోరుకు తాళలేక ప్రధాని మహీంద రాజపక్స.. దేశం విడిచి పారిపోయారు. చివరికి.. తీవ్ర ఒత్తిళ్ల నడుమ పదవికి రాజీనామా చేశారు. ఆపై సంక్షోభ తీవ్రత తగ్గినా.. ప్రజల నిరసనలు మాత్రం అక్కడక్కడా కొనసాగుతున్నాయి.
 

ఇంగ్లండ్ రాజకీయ​ సంక్షోభం
గత ఆరేళ్లలో నలుగురు ప్రధానులు!.  ఇంగ్లండ్​ మునుపెన్నడూ లేనంతగా ఈ ఏడాది కాలంలోనే తీవ్ర రాజకీయ సంక్షోభం ఎదుర్కొంది. అధికార పార్టీ నుంచి ఏకంగా ముగ్గురు ప్రధాని బాధ్యతలు చేపట్టారు ఈ ఏడాదిలో. పార్టీ గేట్​ కుంభకోణం వల్ల కన్జర్వేటివ్​ పార్టీ అభ్యర్థి బోరిస్​ జాన్సన్​ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆపై బోరిస్​ తర్వాతి ప్రధానిని ఎన్నకునేందుకు 59 రోజుల టైం పట్టింది. చివరకు.. బోరిస్​కు అత్యంత సన్నిహితురాలైన లిజ్​ ట్రస్​ను ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ, ద్రవ్యోల్బణం, మినీ బడ్జెట్​ బెడిసి కొట్టడం, తదితర కారణాలతో కేవలం 45 రోజులపాటే ఆమె ఆ పదవిలో కొనసాగారు. ఆపై మెజార్టీ టోరిస్​ల మద్దతు ద్వారా ప్రధాని పీఠంపై ఎక్కారు భారత సంతతికి చెందిన రిషి సునాక్​.
   


పాకిస్తాన్​ వరదలు
పొరుగు దేశాన్ని ప్రకృతి ఈ ఏడు పగబట్టింది. మునుపెన్నడూ లేనంతగా భారీ వర్షాలు, వరదలతో పాక్​ అతలాకుతలం అయ్యింది. జూన్​ అక్టోబర్​ల మధ్య వరదలతో 1,739 మంది మృత్యువాత పడ్డారు. మూగజీవాల మరణంతో పాటు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.  పాక్​ ఆర్థిక వ్యవస్థకు.. సుమారు 3.2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. సాధారణం కంటే అధికంగా వర్షాలు, వేడి గాలులతో హిమానీనదాలు కరిగిపోయి.. వరదలు పోటెత్తాయి. సుమారు 75 శాతం భూభాగం నీట మునిగిందంటే.. వరదల తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 

బ్రిటన్​ రాణి క్వీన్​ ఎలిజబెత్​2 మరణం

బ్రిటన్​ రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాలించిన మహారాణి.. క్వీన్​ ఎలిజబెత్​ 2 కన్నుమూశారు. దీంతో రాజకుటుంబంలో విషాదం అలుముకుంది. 70 ఏళ్లపాటు రాణిగా కొనసాగారామె. తద్వారా బ్రిటన్​ సింహాసనంపై చెరగని ముద్ర వేశారు. ఆమె హయాంలో ఎన్నో కీలక ఘట్టాలు జరిగాయి. ఎన్నో దేశాల అధినేతలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. 96 ఏళ్ల వయసులో వయోరిత్య సమస్యలతో ఆమె బాల్మోరల్​ కోటలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. 

ఇరాన్​ నిరసనలు
మోరల్​ పోలీసింగ్​ ఒక నిండు ప్రాణం తీసింది.  మహ్​సా అమినీ అనే యువతిని టెహ్రాన్​ పోలీసులు హిజాబ్​ ధరించలేదని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్​ 16వ తేదీన ఆమె పోలీస్​ కస్టడీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో ఇరాన్​ భగ్గుమంది. మతఛాందసవాదుల రాజ్యంగా ఇరాన్​ మారిందని, స్వేచ్ఛ లేకుండా పోయిందని ఉద్యమించారు. వేల మంది అరెస్ట్​ చేశారు. అల్లర్లో ఐదు వందల మందిదాకా మృతి చెందారు.

బ్రెజిల్​ పాలన మార్పు
కరోనా టైంలో ప్రపంచం మొత్తం బాగా వినిపించిన పేరు జైర్​ బోల్సోనారో. అధ్యక్షుడి హోదాలో ఉండి వైరస్‌ను తేలికగా తీసుకున్న ఆయన వ్యవహారం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసింది. వైరస్‌ పట్ల నిర్లక్ష్యం వహించి.. ప్రపంచంలోనే ఆ టైంలో ఎక్కువ మరణాలకు బ్రెజిల్‌ను నిలయంగా చేశాడన్న విమర్శ ఆయన మీద ఉంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డాడు. అన్ని రకాలుగా విసిగిపోయిన ప్రజలు.. ఆయన్ని గద్దె దింపారు. ఆ ప్లేస్‌లో లూయిస్‌ ఇన్‌సియోలూలా సిల్వా చేతిలో స్వల్ప మెజార్టీతో  బోల్సోనారో ఓటమిపాలయ్యారు.

ఎలన్​ మస్క్​ ట్విటర్​
ప్రపంచంలోనే అథ్యధిక ధనికుడైన ఎలన్‌ మస్క్‌.. ట్విటర్‌ను చేజిక్కించుకున్నాడు. 44 బిలియన్ల డాలర్ల చెల్లింపుతో ఈ ఒప్పందం కుదిరింది. తొలుత ఈ ఒప్పందం ఉల్లంఘించినట్లు ట్విటర్‌, ఎలన్‌ మస్క్‌పై ఆరోపణలు చేసింది. కోర్టుకు ఈడ్చాలని చూసింది. అయితే.. సర్‌ప్రైజ్‌ చేస్తూ ట్విటర్‌ కార్యాలయంలో అడుగుపెట్టాడు. ట్విటర్‌ డీల్‌ ముగిసినప్పటికీ.. సంపద విషయంలో అపర కుబేరుల జాబితాలో  అగ్రస్థానంలో ఎలన్‌ మస్క్‌ కొనసాగుతుండడం గమనార్హం.  

ఎనిమిది బిలియన్లు దాటిన ప్రపంచ జనాభా
ప్రపంచ జనాభా ఈ ఏడాదిలోనే మ్యాజిక్​ ఫిగర్​ను దాటింది 8 బిలియన్ల అంటే.. 800 కోట్ల మార్క్​ను దాటేసింది అధికారికంగా!. UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 ఈ ఘనతను అధికారికంగా ప్రకటించింది.

చైనాలో కరోనా కల్లోలం
పార్టీ సమావేశం ద్వారా మూడో దఫా చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జి జిన్‌పింగ్.. అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం.. కరోనా కట్టడిలో ఘోరంగా విఫలం కావడం. కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా.. కరోనా వైరస్‌తో వణికిపోతోంది. జీరో కోవిడ్‌ పాలసీ పేరుతో గత మూడేళ్లుగా అక్కడి జనాలను నరకం చూపిస్తోంది కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం. కేసులు, మరణాల లెక్కలు దాస్తూ.. ఆంక్షల పేరుతో ఇబ్బందులు పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియెంట్లు విరుచుకుపడుతుండడంతో.. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 స్ట్రెయిన్‌ ధాటికి  లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు సంభవిస్తుంటే, తప్పుడు లెక్కలతో ప్రపంచాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో.. వైరస్‌తో కలిసి జీవించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది అక్కడి ప్రజలకు.

మరిన్ని వార్తలు