తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!

22 Feb, 2022 20:24 IST|Sakshi

పోటీకి రెడీ అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ

అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఆలోచన

కనీసం 40 సీట్లలో బరిలోకి దిగాలని కసరత్తు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారో మార్చి 10న వెల్లడవుతుంది. ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. పంజాబ్లో అధికార కాంగ్రెస్కు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ కూటమి, శిరోమణి అకాలీదళ్ ఏమేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఉత్తరాఖండ్ పోలింగ్ ముగియగా.. మణిపూర్లో ఎన్నికలు ఫిబ్రవరి 28, మార్చి 5న జరగనున్నాయి. ఇదిలావుండగా వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనుందన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితే తెలంగాణలోనూ ‘ఆప్’ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. 

తెలంగాణలో ‘ఆప్’సోపాలు
2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, జహీరాబాద్, నల్లగొండ, వరంగల్ నుంచి పోటీ చేసిన ‘ఆప్’ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. సికింద్రాబాద్(11,184) మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పదివేల లోపు ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉంది. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌లో ‘ఆప్’ అధికారంలోకి రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ పోటీకి ఆ పార్టీ సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది.  

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జోష్ నింపేనా?
గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి పంజాబీలు తమకే పట్టం కడతారని ‘ఆప్’ భావిస్తోంది. పంజాబ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి సానుకూల ఫలితాలు వస్తే రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అంతేకాదు 2024 లోక్సభ ఎన్నికల వరకు ఉత్సాహంగా పనిచేసేందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే  ‘ఆప్’ ఎటువంటి వ్యూహం అవలంభిస్తుందో చూడాలి.

నాయకత్వ సమస్య..
తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన నాయకత్వం, పెద్ద సంఖ్యలో కేడర్ లేకపోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికిలో కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నాయకత్వాన్ని తక్షణం తయారుచేసుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాలను ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి పర్యవేక్షిస్తున్నారు. ఇందిరా శోభన్, బుర్రా రాము గౌడ్ వంటి నాయకులు మాత్రమే చురుగ్గా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వాలంటే వీరి బలం సరిపోదు. ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ ఛరిష్మా వర్కవుట్ కావాలంటే స్థానికంగా బలమైన నాయకత్వం తయారు కావాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇటీవల బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)లో చేరడంతో ఆ పార్టీలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాంటి నాయకులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి ముద్ర లేని మాజీ ఉన్నతాధికారులు, చురుకైన యువతను చేర్చుకునేందుకు ప్రయ్నతిస్తున్నట్టు సమాచారం. (క్లిక్‌: ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు)

ఢిల్లీ మోడల్ వర్కవుట్ అవుతుందా?  
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చింది. తాజా ఎన్నికల్లోనూ ‘ఢిల్లీ మోడల్’ను కేజ్రీవాల్ ప్రచారం చేశారు. పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పదేపదే ఇదే అంశాన్ని పస్తావించారు. అంతేకాదు పంజాబ్లో పోలింగ్ జరుగుతుండగానే ఢిల్లీలో 12 వేల స్మార్ట్ తరగతులను సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. తెలంగాణలోనూ ఇదే వ్యూహంతో బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో సారూప్యత ఉందని ‘ఆప్’ నేతలు అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా డ్రగ్స్, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. వీటిపై దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని ‘ఆప్’ భావిస్తోంది. (క్లిక్‌: తెలంగాణ బీజేపీలో అసంతృప్తి సెగలు)

‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ పోటీ చేయాలని భావిస్తున్నాం. అన్నిచోట్ల కుదరకపోతే కనీసం 40 స్థానాల్లో పోటీకి దిగుతాం. యువత, మేధావి వర్గం మా వెంటే ఉంటారని గట్టిగా నమ్ముతున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం. ఢిల్లీలో చేస్తున్నట్టుగానే నాణ్యమైన వైద్యం, ఉచిత విద్య అందిస్తాం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం. పంజాబ్లో కచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుంది’
- ఇందిరా శోభన్
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్

మరిన్ని వార్తలు