Sameer Wankhede: ఒకప్పుడు ఈయన ‘సింహస్వప్నం’.. ఇప్పుడేమో ఇలా..

31 May, 2022 08:56 IST|Sakshi

ఒకప్పుడు.. ఆయనంటే నిజాయితీకి మారుపేరు. రంగంలోకి దిగితే ఎంతటి వాళ్లనైనా వదిలేవాడు కాదు అని ఆయన పని చేసే సంస్థలే ఆకాశానికి ఎత్తేవి. కానీ, ఇప్పుడు విమర్శలు, రాజకీయాలతో వివాదాలలో చిక్కుకున్నాడు. చివరకు బదిలీల మధ్య నలిగిపోతోంది ఆయన ప్రయాణం. యాంటీ నార్కోటిక్స్‌ మాజీ అధికారి సమీర్‌​ వాంఖేడేపై మరో బదిలీ వేటు పడింది. తాజాగా ఆయన్ని చెన్నైలోని పన్నుల శాఖ విభాగానికి డైరెక్టోరేట్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ముంబై: షారూక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసును దర్యాప్తు చేసింది తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సందర్భంగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్‌ అండ్‌ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడేమో నాన్‌-సెన్సిటివ్‌ పోస్టింగ్‌ మీద చెన్నైకు బదిలీ చేశారు. షారూక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు డ్రగ్స్‌ కేసులో క్లీన్‌ చిట్‌ లభించిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

ముంబై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో చీఫ్‌గా ఉన్న టైంలో క్రూయిజ్‌ డ్రగ్స్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాడాయన. దీంతో ఆయన్ని అంతా హీరోగా చూశారు. అయితే దర్యాప్తులో ఆయన పక్కాగా వ్యవహరించలేదని, కీలక విషయాల్ని పొందుపర్చలేదని, పైగా ఆర్యన్‌ ఖాన్‌ను ఇరికించే ప్రయత్నం చేశాడంటూ విమర్శలు వచ్చాయి. దీంతో గుర్రుగా ఉన్న కేంద్రం.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఇక ఉద్యోగంలో చేరే సమయంలో ఫేక్‌ కాస్ట్‌ సర్టిఫికెట్‌ సమర్పించారని ఆయనపై మరో  ఆరోపణ ఉండగా.. దానిపైనా విచారణ జరుగుతోంది.  

ముంబైలో పుట్టి, పెరిగిన సమీర్‌ వాంఖడే.. ఆయన తల్లిదండ్రులది మతాంతర వివాహం కావడంతో చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు. 2008 ఇండియన్‌ రెవెన్యూ బ్యాచ్‌ కు చెందిన సమీర్ వాంఖడే.. అత్యున్నత దర్యాప్తు సంస్థలలో పనిచేయడంతో పాటు దాదాపు ప్రతి చోటా మెడల్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

► 2008లో ఎయిర్ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో ఫస్ట్‌ పోస్టింగ్‌ తీసుకున్న సమీర్‌.. ముంబై ఎయిర్‌ పోర్ట్‌ లో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కస్టమ్స్‌ డ్యూటీ ఎగ్గొట్టే సెలబ్రెటీల పాలిట సింహస్వప్నంగా మారాడు.

► 2010లో మహారాష్ట్ర టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సమీర్. ఆ ఏడాది 2,500 మంది టాక్స్‌ ఎగవేత దారులపై కేసులు నమోదు చేశారు.. ఇందులో 200 మందికి పైగా సెలబ్రెటీలే ఉన్నారు.. ఆ ఏడాది ముంబైలో అదనంగా 87 కోట్ల పన్నులు వసూలు అయ్యింది.

► తను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వర్తించే సమయంలో జరిగిన 2011 క్రికెట్‌ వరల్డ్ కప్‌ ట్రోఫీకి సైతం కస్టమ్‌ డ్యూటీ వేశారు సమీర్‌.. బాలీవుడ్ సెలబ్రెటీల ఇళ్లల్లో అనేక రైడ్లు చేశారు.. ఇందులో అనురాగ్‌ కశ్యప్‌, వివేక్‌ ఒబేరాయ్, రామ్‌ గోపాల్ వర్మ కూడా ఉన్నారు.

► బ్యాంకాక్‌ నుంచి తిరిగి వచ్చిన సింగర్‌ మికా సింగ్‌.. దగ్గర నిబంధనలకు మించి కరెన్సీ, మద్యం దొరకడంతో అదుపులోకి తీసుకున్నాడు సమీర్‌. ఆపై నాలుగు గంటల తర్వాత లక్ష రూపాయల జరిమానాతో మికాను విడుదల చేశాడు.

► 2014-16 మధ్య డిప్యూటేషన్‌పై ఎన్‌ఐఏలో పనిచేసిన సమీర్‌.. ఆ సమయంలో ఎన్నో హై ప్రొఫైల్‌ టెర్రరిస్ట్‌ కేసులను హ్యాండిల్ చేసి ఎక్సలెన్స్‌ ఇన్‌ సర్వీస్‌ మెడల్ కూడా అందుకున్నారు..

► ఆ తర్వాత 2017-20 మధ్య డీఆర్‌ఐ జాయింట్‌ డైరెక్టరేట్‌గా బదిలీ అయ్యారు.. ఆ సమయంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 180 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ గుర్తించి.. సమీర్‌ ఓ రికార్డ్‌నే సృష్టించారు.

► బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ సూసైడ్ కేసులో కూడా సమీర్‌ వాంఖడేను ఏరికొరి మరి పిలిపించుకోని దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది ఎన్సీబీ.. అప్పటి నుంచే ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. ఈ కేసు టేకప్ చేశాక 33 మందిని అరెస్ట్‌ చేశారాయన.

► ఎన్‌సీబీలో తన పదవీ కాలం ముగుస్తుందనగా క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్ రాకెట్‌ ను బయట పెట్టారు సమీర్‌… దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది ఎన్సీబీ.

► అయితే ఎన్నో కేసుల్లో నిందితులతో ముందుగానే వాంగ్మూలాలను ఇప్పించేవారని.. దీనికి తన సోదరి క్రిమినల్‌ లాయర్‌ యాస్మిన్‌కు కూడా లింక్‌ ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై సమీర్‌ కూడా కౌంటర్‌ ఇస్తూనే ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు.. నిజాయితీపరుడు, హీరో అనే ప్రశంసలు అందుకున్న ఓ అధికారి అవమానకరరీతిలో ఇలా బదిలీలు ఎదుర్కొవాల్సి వస్తోంది. 

సంబంధిత వార్త:  నేను దళితుడినే.. సమీర్‌ వాంఖెడే

మరిన్ని వార్తలు