డేంజర్‌: పొద్దస్తమానం.. ఫోన్‌లోనే!.. జరుగుతోంది తప్పే

4 Jan, 2023 08:38 IST|Sakshi

మాటలు లేవు..
మాట్లాడుకోవడాలు లేవు.. 
బంధుమిత్రులు ఇంటికొస్తే 
పలకరింపులూ లేవు.. 
తలోక దిక్కున సెల్‌ఫోన్‌తో 
ఎవరి పనిలో వారు బిజీ.. 
ఆ ఫోన్లతో సోషల్‌ మీడియా
సముద్రంలో ఈదుతుంటాం..
ఏ ఇంటికెళ్లినా 
ఈ కాలంలో కనిపించే దృశ్యం దాదాపు ఇదే! 
ఏదో కాలక్షేపానికి కొద్దిసేపు సోషల్‌ మీడియాను వాడితే తప్పులేదు కానీ..
గంటలు కరిగిపోయే స్థాయిలో 
దానికి కట్టుబానిసలైతే మాత్రం
డేంజర్‌.. డేంజర్‌.. డేంజర్‌!!!  

టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తి అంటారు... ఇదీ చాలా పాతకాలపు సామెతే కానీ, సోషల్‌ మీడియా ఈ తరానికి ముఖ్యంగా యువతరానికి చేస్తున్న చేటును దృష్టిలో పెట్టుకుంటే దానిని తరచూ గుర్తుచేసుకోవడంలో తప్పే­మీ లేదు. ఇందుకు తగ్గట్టుగానే ట్విట్టర్, టిక్‌టాక్, వాట్సాప్, ఇన్‌స్టా్రగామ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల లాభనష్టాల గురించి వివరించే అధ్యయనాలు తరచూ జరుగుతూనే ఉన్నా­యి. తాజాగా లివింగ్‌ సర్కిల్స్‌ అనే సంస్థ దేశంలోని 287 జిల్లాల్లో 9–13 ఏళ్ల వయసున్న పిల్లలు గల తల్లిదండ్రులతో, అలాగే 13–17 సంవత్సరాల వయసున్న బాలబాలికలతో ఒక అధ్యయ­నం నిర్వహించింది. సామాజిక మాధ్యమాల వాడకాన్ని అనుమతించడంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే సోషల్‌ మీడియా ఖాతా­లను కలిగి ఉండటం దాని వాడకం తీరుతెన్నులపై టీనేజర్లను అడిగి తెలుసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 65 వేల మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.   

జరుగుతోంది తప్పే..
అధ్యయనంలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 40 శాతం మంది పిల్లలు వీడియో గేమ్‌లకు, సామాజిక మాధ్యమాలకు బానిసలైనట్లు ఈ సర్వేలో వెల్లడైన భయంకరమైన సత్యం, కాగా, ఇది సరి కాదని వారు కూడా అంగీకరించడం కొసమెరుపు. హైసూ్కల్లో చేరే వయసు కూడా లేని పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు నిత్యం అందుబాటులో ఉన్నాయని 55 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. టీనేజర్ల తల్లిదండ్రుల దగ్గరకు వచ్చే సరికి ఈ సంఖ్య 71 శాతం ఉంది. అయితే, కోవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు సక్రమంగా పని చేయకపోవడం వల్లనే తాము పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు కొనివ్వాల్సి వచి్చందని మెజారిటీ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే పిల్లలు సామాజిక మాధ్యమాలకు పరిచయమయ్యారని, అది కాస్తా వ్యసనంగా మారుతోందన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరిచేందుకు కనీస వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే కావడం. దీనిని కనీసం 15 సంవత్సరాలకు పెంచితే సమస్య కొంతవరకైనా తగ్గుతుందని 68 శాతం మంది తల్లిదండ్రులు తమ ఆవేదన చెప్పుకున్నారు.  

తమని తాము తక్కువ చేసుకుంటారు..
పిల్లలంటేనే వారికి ఎల్లల్లేని ఆత్మవిశ్వాసం. ప్రపంచంలో దేనినైనా అవలీలగా సాధించగలమన్న న­మ్మ­కం కలిగి ఉంటారు. అయితే, సామాజిక మాధ్య­మాల మితిమీరిన వాడకం కారణంగా వీరిలో ఈ లక్షణం క్రమేపీ సన్నగిల్లుతోందని, వారు తమని తాము తక్కువ చేసుకుని చూసుకుంటున్నారని లోకల్‌ సర్కిల్స్‌ అధ్యయనం తేలి్చంది. ఆ సర్వే మాత్రమే కాదు ఇప్పటికే జరిగిన పలు శాస్త్రీయ పరిశోధనలు కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. ప్రతి చిన్న విషయానికీ సోషల్‌ మీడియాపై ఆధారపడటం వల్ల పిల్లలతోపాటు పెద్దవారిలోనూ కొన్ని శారీరక, మానసిక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాకులత, ప్రతిదానికీ చికాకుపపడటం వంటివి వీటిల్లో కొన్ని. పైగా పిల్లలు ఏ అంశంపైనా సరైన దృష్టిని కేంద్రీకరించలేని పరిస్థితి ఉంటోంది. లోకల్‌ సర్కిల్స్‌ అధ్యయనం ప్రకారం 13–17 మధ్య వయసు్కలు రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్‌ మీడియాపై ఖర్చు చేస్తున్నారు. నగరాల్లోనైతే 9–13 మధ్య వయస్కులైన పిల్లలు కూడా ఇదే రకంగా ఉన్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. 

మానసిక సమస్య కాదు 
టీనేజీ లేదా అంతకంటే తక్కువ వయసులో సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిపోవడం మానసిక సమస్య కాదన్నది నిపుణుల అభిప్రాయం. కాకపోతే మార్చుకోదగ్గ బిహేవియరల్‌ డిజార్డర్‌ అని చెప్పకతప్పదని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్‌ ఎంఎస్‌ రెడ్డి చెప్పారు. టీనేజీ వారైనా, పెద్దలైనా రోజుకు కనీసం 150 సార్లు తమ ఫోన్లు చెక్‌ చేసుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. మరీ ఎక్కువగా ఆధారపడ్డ వారైతే నిత్యం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం గ్యారంటీ అంటున్నారు నిపుణులు. సామాజిక మాధ్యమాల వల్ల సమస్యలున్నాయని కోవిడ్‌కంటే ముందు కూడా చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. అతి వాడకం వల్ల ఇవి మరిన్ని వ్యవసనాలకు పాల్పడే అవకాశాలూ ఎక్కువని ఈ అధ్యయనాలు తెలిపాయి. పెద్దలకు మాత్రమే పరిమితం కావాల్సిన కంటెంట్‌ సులువుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటమూ టీనేజీ వారికి అంత మంచిది కాదన్నారు మానసిక నిపుణులు డాక్టర్‌ వీరేంద్ర. ఇటీవల కాలంలో తమ వద్దకు వచి్చన కేసుల్లో అధికం ఇలాంటివేనని మానసిక నిపుణులు అంటున్నారు. పైగా, సోషల్‌ మీడి­యాలో ఎవరు ఎవరన్నది ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగా ఆడ పిల్లలు ప్రమాదాల బారిన పడేందుకూ అవకాశాలు పెరిగాయంటూ ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ డిప్యూటీ కమిషనర్‌ జాయ్‌ ఎన్‌ టిర్కీ సైబర్‌ క్రైమ్‌ విభాగానికి సమరి్పంచినలో నివేదికలో వెల్లడించారు. 

జామా సైకియాట్రీ అధ్యయనం ప్రకారం.. రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌ వంటి మాధ్యమాల్లో గడపడం టీనేజర్లకు ఏ మాత్రం సరికాదు. అర గంట కంటే ఎక్కువ సమయం గడిపే వారికి అసలు వాడని వారితో పోలి్చనప్పుడు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. టీవీ, సోషల్‌ మీడియా, వీడియో స్ట్రీమింగ్, మ్యూజిక్‌ వంటి అన్ని రకాల వినోదాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమంది టీనేజర్లు రోజుకు తొమ్మిది గంటల వరకూ గడుపుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఇలా గుర్తించండి.. 

► సోషల్‌ మీడియాలో గడిపే సమయం క్రమంగా ఎక్కువవుతుంటే... లైకులు ఎన్ని వచ్చాయి? ఎలాంటి కామెంట్లు వచ్చాయో.. అని మామూలు సమయంలోనూ ఆలోచిస్తూంటే.. 

► ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు తగ్గిపోయినా.. ఇతర అలవాట్ల నుంచి దూరంగా తొలగుతున్నా.. స్మార్ట్‌ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ అందుబాటులో లేకపోతే తెగ ఆందోళన చెందుతున్నా..  చదువులు దెబ్బతింటున్నా.. బంధుమిత్రులు, తల్లిదండ్రులు తిడుతున్నా.. నచ్చచెబుతున్నా సోషల్‌ మీడియాను  వదలకుండా ఉంటే..  

పైన చెప్పుకున్న విషయాలన్నీ మీకు లేదా మీకు తెలిసిన టీనేజీ వారికి వర్తిస్తున్నాయా? అయితే సామాజిక మాధ్యమం ఉచ్చులో చిక్కినట్లే!!! 

:::కంచర్ల యాదగిరిరెడ్డి

మరిన్ని వార్తలు