‘సీఎం జగన్‌ మాటిచ్చారు.. నెరవేర్చారు’

8 Jan, 2023 08:31 IST|Sakshi

చిన్నారి హనీ వెన్నంటే నిలిచారు

సాక్షి అమలాపురం: ‘మాట తప్పరు.. మడమ తిప్పరు’ అనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన చిన్నారి కొప్పాడి హనీ కాలేయానికి గాకర్స్‌ వ్యాధి సోకి బాధపడుతోంది. అరుదైన ఈ వ్యాధికి రూ.కోటి ఖరీదైన వైద్యం అందించేందుకు సీఎం హామీ ఇచ్చారు. దానిని అమలు చేసి చూపించారు. అక్కడితో ఆగలేదు.. ఆ పాప ఆలనాపాలనా కోసం నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. 

అక్టోబర్‌లో తొలి ఇంజెక్షన్‌ 
హానీకి ప్రతి 15 రోజులకు ఒకసారి రూ.74 వేలు విలువ చేసే సెరిజైమ్‌ ఇంజెక్షన్‌ చేయాల్సి ఉంది. తొలి విడతగా రూ.10 లక్షలతో 13 ఇంజెక్షన్లు తెప్పించారు. మరో రూ.40 లక్షలతో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్‌ 2వ తేదీన జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, అమలాపురం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి స్థానిక ఏరియా ఆస్పత్రిలో తొలి ఇంజెక్షన్‌ అందజేశారు.

 

ప్లకార్డు చూసి... స్పందించిన సీఎం 
గత ఏడాది జూలై 26న గోదా­వరి వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోనసీమలో పర్యటించారు. బాధితులను పరామర్శించి గంటిపెదపూడిలోని హెలీప్యాడ్‌ వద్దకు తిరిగి వెళుతున్న సీఎం జగన్‌కు ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అని ప్లకార్డు పట్టుకుని హనీ తల్లిదండ్రులు కనిపించారు. వారిని తన వద్దకు పిలిపించుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ హనీకి వచి్చన కష్టం వివరాలు తెలుసుకుని పాప వైద్యానికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 

నెలవారీ రూ.పది వేల పింఛన్‌ 
రూ.కోటి విలువైన వైద్యా­నికి అంగీకరించడమే కాదు... హనీ ఆలనాపాలనా చూసేందుకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్‌ అందేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జనవరి నెల నుంచి ఆ బాలికకు పింఛన్‌ అందిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కలెక్టర్‌ శుక్లా తొలి పింఛన్‌ను హనీ కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం జగన్‌ ఆదేశాలతో హనీకి అమలాపురం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉచితంగా విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 

మరిన్ని వార్తలు