డాలర్‌ కన్నా తోపు కరెన్సీలెన్నో.. అక్కడ మారకం అంత తక్కువా?

20 Oct, 2022 08:36 IST|Sakshi

కొద్దిరోజులుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోతూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తే సరికి.. ‘రూపాయి తగ్గడం కాదు. డాలర్‌ పెరుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. 

సాధారణంగా ఏ దేశ కరెన్సీని అయినా అమెరికన్‌ డాలర్‌తోనే పోల్చుతుంటారు. అందువల్ల డాలర్‌ అంటే బాగా విలువైన కరెన్సీ అనే భావన ఉండిపోయింది. నిజానికి అమెరికన్‌ డాలర్‌ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాలు దాన్ని ఆమోదిస్తాయి. డాలర్లలోనే ప్రపంచ వాణిజ్యం జరుగుతుంటుంది కూడా. అందుకు ప్రతి కరెన్సీని, వాణిజ్యాన్ని డాలర్లతో పోల్చుతూ, లెక్కవేస్తూ ఉంటారు. 

అయితే, డాలర్‌ కన్నా విలువైన కరెన్సీలు కూడా ఉన్నాయి. దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, జీడీపీ, అభివృద్ధి రేటు వంటి అంశాల ఆధారంగా వాటి కరెన్సీ విలువ ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిదేశాల కరెన్సీ విలువ డాలర్‌ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక్క కువైట్‌ దినార్‌కు 3.26 అమెరికన్‌ డాలర్లు వస్తాయి. అంటే రూ.270 అన్నమాట. ఈ జాబితాలో టాప్‌లో ఉన్న దేశాలన్నీ చమురు ఉత్పత్తితో సంపన్నంగా మారినవి, పారిశ్రామిక విప్లవంతో అభివృద్ధి చెందినవే కావడం గమనార్హం. 

కువైట్‌ దినార్‌ కంటే కూడా విలువైన కరెన్సీ ఒకటి ఉంది. ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఉండే గుర్తింపులేని ఓ చిన్నదేశం (మైక్రోనేషన్‌) ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ సెబోర్గా’కు చెందిన సెబోర్గన్‌ ల్యూగినో కరెన్సీ అది. ఈ కరెన్సీని స్థానికంగా లావాదేవీలకు, బ్యాంకుల్లో వినియోగిస్తారు. బయట ఎక్కడా చెల్లదు. ఇక్కడి బ్యాంకుల్లో కరెన్సీ మార్పిడి విలువ ప్రకారం.. ఒక్కో సెబోర్గన్‌ ల్యూగినోకు ఆరు డాలర్లు ఇస్తారు. అంటే మన కరెన్సీలో రూ.498 అన్నమాట.  

ఒక డాలర్‌కు 42,350 ఇరాన్‌ రియాల్‌లు  
ప్రపంచంలో అత్యంత తక్కువ విలువైన కరెన్సీ ఇరాన్‌ రియాల్‌. ఒక డాలర్‌కు ఏకంగా 42,350 ఇరాన్‌ రియాల్స్‌ వస్తాయి. మన కరెన్సీతో పోల్చితే.. ఒక్క రూపాయికి 510 ఇరాన్‌ రియాల్స్‌ వస్తాయి. నిజానికి భారీగా చమురు ఉత్పత్తి చేసే ఇరాన్‌.. ఇతర దేశాల్లా సంపన్నంగా మారి ఉండేది. కానీ ఆ దేశంలో రాజకీయ అనిశి్చతి, అణు ప్రయోగాల వల్ల ఆర్థిక ఆంక్షల వల్ల పరిస్థితి దారుణంగా మారింది.  

మరిన్ని వార్తలు