టార్గెట్ దేవరకొండ నియోజకవర్గం: కమ్యూనిస్టులకు ఎందుకు కోపం?

15 Dec, 2022 18:12 IST|Sakshi

కమ్యూనిస్టు పార్టీ ఆ ఎమ్మెల్యేపై పగ పట్టిందా? నల్గొండ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేపై తెలంగాణ సీపీఐ పగ సాధిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎలాగైనా ఆ సీటు తన ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించుకుంది. సీపీఐ ప్రతిపాదనతో అక్కడి గులాబీ ఎమ్మెల్యేకు నిద్ర కరువైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? సీపీఐ పగ పట్టడానికి కారణం ఏంటి? 

గెలవలేరు కానీ ఓడించగలరు.!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నో కొన్ని ఓట్లున్నాయి. ఆ ఓట్లే ఒక పార్టీని ఓడించడానికైనా.. మరో పార్టీని గెలిపించడానికైనా పనికొస్తాయి కాని... లెఫ్ట్ పార్టీలను ఒంటరిగా గెలిపించడానికి సరిపోవు. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల ఓట్లే గులాబీ పార్టీని గట్టెక్కించాయి. మునుగోడు ఫలితం తర్వాత వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలతో గులాబీ పార్టీ పొత్తు కొనసాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఈ పొత్తు గులాబీ పార్టీకి ఎంతో అవసరమని కూడా కేసీఆర్ గుర్తించినట్లు ప్రచారం సాగుతోంది. ఒక పక్క కాంగ్రెస్..మరో పక్క కమలం పార్టీని ఢీకొట్టాలంటే కమ్యూనిస్టుల సహకారం తప్పనిసరిగా గులాబీ పార్టీ బాస్ గుర్తించారు. ఇప్పుడు ఈ పరిణామమే జిల్లాలోని దేవరకొండ ఎమ్మెల్యేకు చమటలు పట్టిస్తున్నాయి. ఇంకో ఇకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా టెన్షన్ పడుతున్నారని టాక్. ప్రస్తుతం జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీలోనే ఉన్నారు.

పొత్తులతో లెక్కల తక్కెడ
కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే సీటు పోతుందని టెన్షన్ పడుతున్నవారిలో.. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో చెరో సీటు కేటాయించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కచ్చితంగా కేసీఆర్ను కోరుతాయి. సీపీఐ కోరే సీటులో మునుగోడు లేదా దేవరకొండ మాత్రమే ఉంటాయి. మునుగోడు ఇటీవలే కష్టపడి గెలుచుకున్నందున వెంటనే దాన్ని వదులుకోవడానికి గులాబీ నేతలు ఒప్పుకోకపోవచ్చు. ఇక దేవరకొండ కూడా ఒకప్పుడు సీపీఐదే గనుక ఆ పార్టీ కచ్చితంగా దేవరకొండ తీసుకుంటుందని అక్కడి ఎమ్మెల్యే టెన్షన్ పడుతున్నారు. సిటింగులందరికీ సీట్లు ఖాయమని కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా సీపీఐ కారణంగా అక్కడి ఎమ్మెల్యేకు టెన్షన్ తప్పడంలేదు.

టార్గెట్ దేవరకొండ
మునుగోడు కంటే దేవరకొండ మీదే సీపీఐ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. దీనికి కూడా గట్టి కారణమే ఉంది. ఎందుకంటే..ప్రస్తుత గులాబీ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్...2014 ఎన్నికల్లో సీపీఐ గుర్తు మీదే గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. సుదీర్ఘ కాలం ఎర్ర పార్టీతో ఉండి...పార్టీ గెలిపించిన ఎమ్మెల్యే సీటును గులాబీ పార్టీకి అప్పగిస్తావా అనే ఆగ్రహం సీపీఐ నేతల్లో ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో దేవరకొండ తీసుకుని రవీంద్రకుమార్‌కు బుద్ధి చెప్పాలని సీపీఐ నేతలు గట్టిగా నిర్ణయించుకున్నారని టాక్. రవీంద్రకుమార్ నిర్వాకంతో ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అసెంబ్లీలో సీపీఐకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అందుకే కారు పార్టీతో పొత్తు కుదిరితే ముందుగా దేవరకొండపైనే గురి పెట్టాలని నిర్ణయించుకుంది.

ఆ విధంగా ముందుకెళ్తారా?
ఇప్పటికీ దేవరకొండలో సీపీఐకి బలమైన కేడర్ ఉందంటారు. మరోవైపు పార్టీ నుంచి గెలిచి కండువా మార్చిన రవీంద్ర కుమార్కు బుద్ధి చెప్పాలంటే అక్కడ పోటీ చేయాలని లోకల్ కేడర్ కూడా నాయకత్వంపై ఒత్తిడి తెస్తోందట. ఈ నేపథ్యంలో దేవరకొండ స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తే తన పరిస్థితి ఏంటా అని రవీంద్ర కుమార్ తీవ్రంగా మదన పడుతున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. సీటును త్యాగం చేసి పోటీకి దూరంగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశముందని ఆయన ఆందోళన పడుతున్నారట. అయితే రవీంద్ర కుమార్ రెండు సార్లు విజయం సాధించడంతో ఎలాగూ ఓటర్ల నుంచి కొంత వ్యతిరేకత ఉందని గులాబీ పార్టీ భావిస్తోందట. ఈ నేపథ్యంలో సీపీఐకి దేవరకొండను కేటాయిస్తే పోలా.... ఎర్ర పార్టీకి అడిగిన సీటూ ఇచ్చినట్లూ ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఏ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి కారెక్కారో...ఇప్పుడు ఆ పార్టీ వల్లే తన రాజకీయ భవిష్యత్కు గండి పడుతోందని రవీంద్రకుమార్ బాధపడుతున్నారట. పెంచి పెద్ద చేసిన పార్టీకి ఏమిచ్చామో..అదే తిరిగి వస్తుందని తనకు తానే చెప్పుకుంటున్నారట పాపం. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు