Dosa King Real Story: జై భీమ్‌ దర్శకుడి కొత్త సినిమా, భర్తను చంపిన మూర్ఖుడిపై భార్య పోరాటమే కథగా..

25 Jul, 2022 13:58 IST|Sakshi

కొన్ని కథలు సినిమా కంటెంట్‌గా మారుతుంటాయి. కొన్నిసార్లు ఆడియొన్స్‌ను మెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు బోల్తా పడుతుంటాయి.  కానీ, వ్యథలు, పోరాటాలతో కూడిన వాస్తవ గాథలు మాత్రం తెరపై భావోద్వేగాలను పండించి ఆడియొన్స్‌ను మెప్పించిన సందర్భాలే ఎక్కువ!. సూర్య ‘జై భీమ్‌’ ద్వారా అలాంటి ప్రయత్నం చేసి సక్సెస్‌ అయిన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌.. ఇప్పుడు ‘దోశ కింగ్‌’ అంటూ మరో వాస్తవ ఘటనను సిల్వర్‌ స్క్రీన్‌పైకి తేబోతున్నాడు. 

దోశ కింగ్‌.. వ్యవస్థలో పెద్ద మనిషిగా చెలామణి అయిన ఓ వ్యక్తికి ఎదురు తిరిగి ఓ ఒంటరి అబల చేసిన పోరాటం. జాతకాల పిచ్చితో తన జీవితాన్ని నాశనం చేసిన ఓ మూర్ఖుడిపై సాధించిన విజయం. 

పీ రాజగోపాల్‌.. శరవణ భవన్‌ చెయిన్‌ రెస్టారెంట్‌ల వ్యవస్థాపకుడు. తమిళనాడు ట్యూటికొరిన్‌ జిల్లాలో ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్‌ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. రాజగోపాల్‌ తండ్రి ఉల్లిపాయల వ్యాపారి.. తల్లి గృహిణి.  వ్యవసాయంలో కూడబెట్టిన తల్లిదండ్రుల డబ్బు తీసుకుని మద్రాస్‌ రైలెక్కాడు. కేకే నగర్‌లో పచారీ కొట్టుతో మొదలుపెట్టి.. చిరు వ్యాపారిగా ఎదిగాడు. శరవణ భవన్‌ పేరిట ఓ రెస్టారెంట్‌ మొదలుపెట్టి..  22 దేశాల్లో 111 రెస్టారెంట్లున్న ఫ్రాంచైజీగా దానిని విస్తరించాడు.

హోటల్‌ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన రాజగోపాల్‌ అంటే అందరికీ గౌరవమే అయినా.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదం.. విమర్శల మయమే!. జాతకాల పిచ్చితో ఓ జ్యోతిష్యుడు చెప్పాడని.. మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. అదీ తన దగ్గర అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న రామసామి చిన్న కూతురిని పెళ్లాడాలని ప్రయత్నించాడు. అయితే అప్పటికే జీవజ్యోతికి పెళ్లి అయ్యింది. అందుకే రాజగోపాల్‌ ప్రతిపాదనను ఆమె ఛీ కొట్టింది. దీంతో పగ పెంచుకున్న రాజగోపాల్‌.. బెదిరింపులు, దాడులు, చేతబడి లాంటి పిచ్చి ప్రయత్నాలెన్నో చేశాడు. అయినా జీవజ్యోతి లొంగలేదు. దీంతో.. ఆ భర్త అడ్డు తొలగించుకుని వివాహం చేసుకోవాలనుకున్నాడు. 

2001 అక్టోబర్‌ 26న బలవంతంగా కిడ్నాప్‌ చేయించి మరీ జీవజ్యోతి భర్త ప్రిన్స్‌ శాంతకుమార్‌ను హత్య చేయించాడు. జీవజ్యోతిని లైంగిక వేధించడం, హత్యా నేరారోపణలపై దోశ కింగ్‌గా పేరున్న రాజగోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ నేరారోపణలతో శరవణ భవన్‌ పేరు ప్రతిష్టలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. మద్రాస్‌ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే అనారోగ్యంతో బెయిల్‌ మీద కొన్నాళ్లూ బయట తిరిగాడు. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో.. తిరిగి 2019లో పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. పోలీసులకు లొంగిపోయిన నాలుగు రోజులకే గుండెపోటు.. ఆపై మరో ఐదు రోజులకే చికిత్స పొందుతూ కన్నుమూశాడు దోశ కింగ్‌ రాజగోపాల్‌. 

అతను (రాజగోపాల్) తన ఉద్యోగులతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ కారణంతో నా పోరాటాన్ని చాలామంది తప్పుబట్టారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. అందుకే సినిమా తెర మీదకు రావాల్సిన అవసరం ఉందని జీవజ్యోతి చెబుతోంది. ప్రస్తుతం ఆమె తంజావూర్‌లో ఓ టైలరింగ్‌ యూనిట్‌ నడిపిస్తూ.. తల్లి నడిపిస్తున్న హోటల్‌ వ్యవహరాలను చూసుకుంటోంది. ఆమె పోరాటమే ఇప్పుడు సినిమాగా రాబోతోంది.

మరిన్ని వార్తలు