ఊరంతా కళాకారులే.. పౌరాణిక పాత్రలకు కేరాఫ్‌ శ్రీరంగపట్నం

19 Dec, 2022 20:28 IST|Sakshi

నాలుగు రాష్ట్రాల్లో వేలాదిగా ప్రదర్శనలు

తల్లిదండ్రుల స్ఫూర్తితో వృత్తిలోకి పిల్లలు

తరతరాల సంప్రదాయానికి చెరగని చిరునామా  

సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, బాలనాగమ్మ, చింతామణి.. నాటకం ఏదైనా వారి నటనాచాతుర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాళికా మాత, దుర్గమ్మ, శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయుడు, వెంకన్నబాబు, రాక్షసుడు, అఘోరాలు.. ఇలా వేషమేదైనా పరకాయ ప్రవేశం చేయడమే వారి ప్రత్యేకత. తాతల కాలం నుంచి సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుని మరీ వారు రంగస్థలంపై, జాతర్లలో సత్తా చాటుతున్నారు. నటనపై మక్కువతోనే జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణకు వ్యవసాయం చేసినా ప్రదర్శనలను మాత్రం విస్మరించరు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం పౌరాణిక నాటకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా విరాజిల్లుతోంది.  


ఊరంతా కళాకారులే 

తూర్పు గోదావరి జిల్లా కళాకారులకు పెట్టింది పేరు. తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం ఖ్యాతి గడించింది. కేవలం నగరం ఒక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కళాకారులు వేల సంఖ్యలో ఉన్నారు. శ్రీరంగపట్నంలో అయితే ఊరంతా కళాకారులే దర్శనమిస్తారు. మేజర్‌ పంచాయతీ అయిన ఈ గ్రామ జనాభా 12,500. కుటుంబాలు 3,165 ఉన్నాయి. వీరిలో 400 మంది పౌరాణిక నాటకాలు వేసే కళాకారుల కుటుంబాలకు చెందిన వారే ఉన్నారంటే నాటకాలపై వారికున్న మక్కువ ఏమిటో అర్థమవుతోంది. వ్యవసాయ పనులతో జీవనం సాగించే కళామతల్లి ముద్దుబిడ్డలు వివిధ పండగలు, జాతర సమయాల్లో కళాకారులుగా రూపుదాలుస్తారు. ప్రజలను అలరించే ప్రదర్శనలు ఇస్తారు. వీరి నట విశ్వరూపానికి దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది.

శ్రీరంగపట్నం కళాకారులంటే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రజలు అమితంగా ఇష్టపడుతూంటారు. రాష్ట్రవ్యాప్తంగా బెంగళూరు, చిత్తూరు, విజయవాడ తదితర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకూ వేలాది ప్రదర్శనలు వారి సొంతం. ఫలితంగా ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, గ్రామ దేవతల జాతరల సమయంలో కళా ప్రదర్శనలతో సందడి వాతావరణం తీసుకువస్తారు. వివిధ వేషధారణలతో అలరిస్తారు.  


రూ.500తో మొదలై.. 

1988లో ఒక్కో బృందంలో సభ్యుడికి కళాప్రదర్శనకు రూ.500 అందేది. ఇవి ఖర్చులకు కూడా సరిపోకపోయినా కళామతల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది ఉన్న బృందంలో ఒక్కో కళా ప్రదర్శనకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. 


ఏ పాత్ర కావాలన్నా.. 

గ్రామంలో 20 నాటక బృందాలున్నాయి. ఒక్కో బృందంలో 20 మంది చొప్పున 400 మంది కళాకారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరాణిక కళాబృందాలున్నా.. పాత్రకు అనువైన కళాశారులు దొరకడం కష్టం. కానీ శ్రీరంగపట్నం మాత్రం అందుకు భిన్నం. ఏ పాత్రయినా.. ఏ నాటకమైనా అందుకు తగిన కళాకారులను సమకూర్చడం ఈ ఊరి ప్రత్యేకత. పౌరాణిక పాత్రల్లో అత్యంత ప్రాధాన్యమైన అన్నమయ్య, రాముడు, లక్ష్మణుడు వంటి విభిన్న పాత్రల్లో నటించే వారు కేవలం ఇక్కడే ఉండటం విశేషం. వీటితో పాటు కాళికాదేవి, నెమలి కోబ్రా డ్యాన్స్, నక్షత్రకుడు, హరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, తాండ్ర పాపారాయుడు వంటి వేషధారణలకు కేరాఫ్‌గా ఈ గ్రామం ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ లేని కళాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. నాటక ఘట్టం సందర్భంగా వీరు వేసే పాత్రలు, నృత్య ప్రదర్శనలు వీక్షకులను కట్టి పడేస్తుంటాయి. తమ తాతలను, తండ్రులను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం వారి సంతానం నాటక రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రదర్శనలపై ఉన్న మక్కువతో ఈ రంగంలోనే స్థిరపడిపోతూ కళకు జీవం పోస్తున్నారు. 


34 ఏళ్లుగా.. 

1988 నుంచి ప్రదర్శనలు ఇస్తున్నా. నాటక రంగంపై ఉన్న ప్రేమతో నేటికీ కళామతల్లి బిడ్డగా కొనసాగుతున్నా. రామాంజనేయ యుద్ధంలో నా నటనకు ప్రశంసా పత్రాలు, అవార్డులు దక్కాయి. నాడు ఒక్కో ప్రదర్శనకు రూ.500 గౌరవ వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.2 వేలు పైగా అందుతోంది. డ బ్బులు ఎంత వచ్చాయన్నది కాకుండా.. కళను బతికించాలన్న తాపత్రయంతోనే కొనసాగుతున్నాం. 
– బాసెట్టి జగ్గారావు, కళాకారుడు 


రాక్షసుడే వచ్చినట్టు.. 

బాలగౌరి కళాకారుల సంఘ సభ్యుడైన తనకాల నాని మిమిక్రీ ఆర్టిస్ట్‌. నాటక రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. నల్లకాళికాదేవి, వేపాలమ్మ పాత్రలకు జీవం పోస్తున్నాడు. తన నటనకు గుర్తింపుగా ఇటీవల పుష్ప–2 సినిమాలో అవకాశం దక్కింది. 


ఆవేశం.. ఈ వేషం.. 

నాన్న కీబోర్డ్‌ ప్లేయర్‌. బాబాయ్‌ సింగర్‌. వారిని స్ఫూర్తిగా తీసుకున్న కళాకారులు సతీష్‌ లేడీ ఓరియంటెడ్‌ గెటప్‌లో అలాగే ఒదిగిపోతాడు. బుల్లితెరపై స్టాండప్‌ కామెడీ రోల్‌ చేస్తున్నా.. నాటక ప్రదర్శన ఉందంటే చాలు వాలిపోతాడు. 


వేషమేదైనా.. కళాత్మకమే.. 

అఘోరా నృత్యం చేయడం అంత సులభం కాదు. కానీ ఆ పాత్రకు జీవం పోస్తాడు ఎం.సంపత్‌. అతను నాట్యం చేస్తూంటే అఘోరాలే ఔరా! అంటూ ఆశ్చర్య పోవాల్సిందే. పార్వతీ దేవి పాత్రకు సైతం న్యాయం చేస్తాడు. 


అబ్బాయే.. అమ్మాయిలా.. 

మరో కళాకారుడు రాంబాబు అమ్మవారు, లేడీ గెటప్, రుక్మిణీదేవి వేషధారణల్లో అలరిస్తుంటారు. ఇలా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో పాత్రకు న్యాయం చేయడంతో కీలక భూమిక పోషిస్తారు. (క్లిక్ చేయండి: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు)

మరిన్ని వార్తలు