చైనా సర్కార్‌కు సవాల్‌ విసురుతున్న దెయ్యాల నగరాలు

22 Sep, 2022 16:18 IST|Sakshi

ఒక్క రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో కూరుకుపోతే దేశ ఆర్ధిక వ్యవస్థే  తల్లకిందులైపోతుందా ఏంటి? అని చాలా మంది బుగ్గలు నొక్కుకోవచ్చుకానీ.. చైనా విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్లూ నిజమే అంటున్నారు ఆర్ధిక వేత్తలు. ఎందుకంటే చైనా స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 29 శాతం.

దీనికి కారణాలు లేకపోలేదు. చైనాలో కోటికి పైగా జనాభా ఉండే నగరాలు పదికి పైనే ఉన్నాయి.  1970ల తర్వాత చైనాలో పట్టణీకరణ వేగం అందుకుంది. మామూలు వేగం కాదు. రాకెట్ వేగంతో పట్టణాలు,నగరాలు విస్తరించారు. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రజలు ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకుంటూ నగరాలకు వలసలు రావడం మొదలు పెట్టింది అప్పుడే.

ఇదీ చదవండి: China: రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా)

50ఏళ్ల వ్యవధిలో ఈ వలసలు ఎంత వేగంగా పెరిగాయంటే ప్రస్తుతం చైనాలో  పట్టణ జనాభా 64 శాతం మేరకు పెరిగిపోయింది. అంటే గ్రామీణ చైనాలో కేవలం 36 శాతం మంది ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. అందరూ పట్టణాలవైపు మొగ్గు చూపడంతో  అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారపు జోరు కారణంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి చేరుతోంది.

ఆదాయంలో సింహభాగం రియల్ ఎస్టేట్ పైనే ఆధార పడుతోంది చైనా. రియల్ బూమ్ యాభై ఏళ్లల్లో  ఏటేటా పెరిగిపోతూ చైనా ఆర్ధిక వ్యవస్థను ఓ పెద్ద బుడగలా పెంచేసింది. ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క సారిగా కుదుపునకు లోను కావడంతో చైనా భవిష్యత్ ఏంటా అని ఆర్ధిక రంగ నిపుణులు సైతం కంగారు పడుతున్నారు. నిజానికి ఇటువంటి సంక్షోభం ఏ ఇతర దేశంలో చోటు చేసుకున్నా అది  ఆ దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీయడం ఖాయం. (చైనా డొల్లతనం..దాచేస్తే దాచని సత్యం!)

ఇదీ చదవండి: చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది?

పైకి అంతెత్తున కనిపిస్తున్న చైనాలో పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని చాలా మందే హెచ్చరిస్తున్నారు. గంభీరంగా కనిపించే డ్రాగన్ పాలకులు లోలోన తీవ్ర కలవరానికి గురవుతున్నారని చెబుతున్నారు.  అయితే పాలకులు ఈ సంక్షోభాన్ని కూడా అధిగమించగల సత్తా ఉన్నారని ఆ దేశ ఆర్ధిక వేత్తలు బీరాలు పలుకుతున్నారు. ఎవర్ గ్రాండే, ఫాంటాసియాలు  చేసిన హెచ్చరికల నేపథ్యంలో  ఎవర్ గ్రాండే ఆస్తులపై ప్రభుత్వం ఓ కన్నేసింది.

దెయ్యాల నగరాలు.. ఔను చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాల నగరాలే. అంటే నిజంగా దయ్యాలు ఉంటాయని కాదు కానీ.. ఆ నగరాల్లో ఎవరూ ఉండరని అర్థం. చైనాలోని ఈ దెయ్యాల నగరాలే ఇపుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. చైనాలో చాలా నగరాల్లో  లక్షలాది సంఖ్యలో ఇళ్లు నిర్మించి ఉన్నాయి. చిత్రం ఏంటంటే చాలా నగరాల్లో నిర్మించిన ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఈ నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసే వారు కేవలం పెట్టుబడుల కోసమే వాటిని కొంటున్నారు.

అంతే కానీ ఇల్లు కొని  గృహప్రవేశాలు చేసి అందులో కాపురం ఉండడానికి ఎంత మాత్రం కాదు. ఇలా అందరూ పెట్టుబడులకోసం కొని పెట్టుకున్న ఇళ్లతో నగరాలు వెల వెల బోతూ కనిపిస్తాయి చైనాలో. ఇలాంటి నగరాలనే ఘోస్ట్ సిటీస్ అంటారు. అవే దెయ్యాల నగరాలన్నమాట. చైనాలోని దెయ్యాల నగరాల్లో నిర్మించిన ఆకాశహర్మ్యాల్లో కనీసం 20 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయి.

ఈ ఇళ్లను పంచిపెడితే 9 కోట్ల మందికి ఇళ్లు అందించవచ్చన్నమాట.జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాల్లోని మొత్తం జనాభాకు సరిపడ ఇళ్లు చైనాలో ఖాళీగా అఘోరిస్తున్నాయి. 2021 లో చైనాలో ఇళ్ల నిర్మాణాల్లో 14 శాతం తగ్గుదలనమోదయ్యింది. లక్షలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. వరుస సంక్షోభాల కారణంగానే ఎవ్వరి దగ్గరా డబ్బులు లేవు. అందుకే కోట్లాది ఇళ్లు  ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.  వేలాది బిలియన్ల డాలర్లమేరకు పెట్టుబడి పెట్టిన వెంచర్లు మధ్యలోనే ఆగిపోవడం..రియల్ వ్యాపారులనే కాదు చైనా ప్రభుత్వాన్నీ కంగారు పెడుతోంది. యావత్ ప్రపంచాన్ని శాసించేయాలని సామ్రాజ్య వాద విస్తరణ కాంక్షతో  రగిలిపోతోన్న చైనాలో అసలు పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు