Who Is Bhagwant Mann: కమెడియన్‌ నుంచి సీఎం స్థాయికి..

10 Mar, 2022 14:13 IST|Sakshi

హాస్యం.. మనిషిని కవ్వించేది. అలాంటప్పుడు విరుద్ధమైన రాజకీయం ఆయన ఎందుకు ఎంచుకున్నాడనే అనుమానాలు రావొచ్చు. జనాల్ని నవ్వించడమే కాదు.. అవసరమైతే ప్రజల కన్నీళ్లూ తుడవాలని తండ్రి చెప్పిన మాటకు కట్టుబడే రాజకీయాల్లో అడుగుపెట్టాడు భగవంత్‌ మాన్‌. ప్రజాభిప్రాయంతోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా నిలిచాడు.  పంజాబ్‌ కోటలో పాగా వెయ్యాలని వ్యూహాలు పన్నిన ఆప్‌కు.. ఒక బూస్టర్‌ షాట్‌లా పనికొచ్చాడు. ఆప్‌ ఘన విజయంలో ముఖ్యభూమిక పోషించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు 48 ఏళ్ల భగవంత్‌ మాన్‌. 


‘ఒకప్పుడు జనం నన్ను చూసి తెగ నవ్వేవారు. కానీ ఇప్పుడు అందరూ రోదిస్తున్నారు. తమను కాపాడమని కోరుతున్నారు’ సీఎం అభ్యర్థిగా ఎంపికైన రోజు మాన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అదే రోజు నుంచి ఆయనలో నవ్వు మాయమై.. రాజకీయాలపై సీరియనెస్‌ మొదలైంది. 

భగవంత్‌ సింగ్‌ మాన్‌.. 1973, అక్టోబర్‌ 17న పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఓ జాట్‌ సిక్కు కుటుంబంలో జన్మించారు. సాధారణ రైతు కుటుంబం ఆయనది. కాలేజీ రోజుల్లోనే ఉండగానే కామెడీ షోలతో గుర్తింపు దక్కించుకున్నాడాయన. సునామ్‌లో ఎస్‌యూఎస్‌ ప్రభుత్వ∙కాలేజీ తరఫున రెండు గోల్డ్‌ మెడల్స్‌ గెలిచారు. కానీ యాక్టింగ్‌ వల్ల కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయనివ్వలేదు. ఆపై ఇందర్‌ప్రీత్‌ కౌర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. 2015లో తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పిల్లలిద్దరూ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. 

మొదట్లో.. నటుడు జగ్తర్‌ జగ్గీతో కలిసి కామెడీ ఆల్బమ్‌ చేశారు. జుగ్ను ఖెండా హై అనే టీవీ సీరియల్‌తో తన పాపులారిటీ పెంచుకున్నారు. రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. 2008లో గ్రేట్‌ ఇండియా లాఫ్టర్‌ చాలెంజ్‌ అనే రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత దేశవ్యాప్తంగా భగవంత్‌ మాన్‌ పేరు మారు మోగిపోయింది. జాతీయ అవార్డు లభించిన ‘‘మైనే మా పంజాబ్‌ దీ’’ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించారు.

► 2011లో  మన్‌ప్రీత్‌ బాదల్‌కు చెందిన పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌ తీర్థం పుచ్చుకొని రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో చేరి సంగ్రూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2 లక్షల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2014, 2019లలో సంగ్రూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆప్ ఎంపీగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖకు కూడా మాన్ చీఫ్ గా ఉన్నారు. 

► 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ బాదల్‌పై ఆప్‌ భగవంత్‌ మాన్‌ను నిలబెట్టింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2019 జనవరిలో ఆప్‌ పార్టీ పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ప్రచారంలో దిట్ట.. 
లోక్‌ లెహర్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థను విజయవంతంగా నడుపుతూ ప్రజల్లో వారికున్న హక్కులపై అవగాహన పెంచుతున్నారు. కలుషిత నీరు తాగి రోగాలపాలవుతున్న ప్రజలకి సాయపడుతున్నారు. టీవీ సెలబ్రిటీగా దక్కిన పేరుతో..  పంజాబ్‌లో ఆప్‌ పార్టీలో క్రౌడ్‌ పుల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు భగవంత్‌ మాన్‌. ఆప్‌ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం దేశంలో మరే పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్‌ పెడితే, అందులో ఏకంగా 93శాతం ఓట్లను కొల్లగొట్టారు. స్టాండప్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న భగవంత్‌ మాన్‌.. పంజాబ్‌ బహుముఖ పోటీలో ఆప్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  

► నయా పంజాబ్‌ పిలుపు.. నిరుద్యోగం పంజాబ్‌ను వేధిస్తు‍న్న ప్రధాన సమస్య. అందుకే అధికారంలోకి వస్తే ఆ సమస్యపైనే మొదటి ఫోకస్‌ ఉంటుందని చెప్పాడు భగవంత్‌. 

‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్. బఫూన్‌ వేశాలేసుకునేటోడు. అతన్నే గనుక గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడు.. ’ ఇదీ.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు భగవంత్ మాన్‌పై చేసిన ఆరోపణ. భగవంత్‌ మాన్‌ మద్యం సేవించి పార్లమెంటుకు వస్తారని ఆరోపణలున్నాయి. సహచర ఎంపీలు ఆయన నుంచి  వచ్చే మద్యం వాసన భరించలేక ఫిర్యాదులు కూడా చేశారు.

అయితే.. రెండేళ్ల క్రితం బర్నాలాలో జరిగిన ఒక ర్యాలీలో తాను ఇంక మద్యం జోలికి వెళ్లనంటూ ప్రజలందరి మధ్య ప్రతిజ్ఞ చేశారు. మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా కళ్లు నెత్తికెక్కించుకోకుండా.. బాధ్యతగా మసలుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ ప్రజలకు చెప్పారు. ఆ మాటలను నమ్మే భారీ మెజార్టీతో ఆయనకు, ఆప్‌కు పంజాబ్‌ ప్రజలు పట్టం కట్టారు.

::సాక్షి, వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు