జీతం కాదు.. మానసిక ప్రశాంతతే ముఖ్యం.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

20 Mar, 2023 08:21 IST|Sakshi

మానవ సమాజానికి కరోనా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నేర్పినన పాఠాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు మూడేళ్ల క్రితం ప్రాణాంతక కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో తీవ్రంగా ప్రభావితమైన తీరు తెలిసిందే. మళ్లీ కరోనా కేసుల పెరుగుదల, దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు, వివిధ రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల వ్యాప్తి నేపథ్యంలో ఒత్తిళ్లకు దూరంగా జీవనం, మానసిక ప్రశాంతత వంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

జీతం కంటే మానసిక ప్రశాంతతకే ఓటు వేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో అధిక శాతం ఉద్యోగులు పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా కీలకమని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ సహా పది దేశాల్లోని ఉద్యోగులపై చేసిన ఓ తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

అన్నిట్లోనూ మార్పు దిశగా అడుగులు 
మనుషులకు సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి పెడతారు. జీవితం దుర్లభంగా మారుతోందనగానే దానిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకునేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తా­ము మార్చుకోవడం, జీవిత ప్రాధామ్యాల్లోనూ మార్పులు, చే­ర్పు­లు చేసుకోవడం జరు­గుతుంది. ఏది చేస్తే మనసుకు, శరీరానికి స్వాంతన దొరుకుతుందనే దా­నికి అనుగుణంగా కా­ర్యా­చరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ట్రెండ్‌ ఎప్పటికీ ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్లే చాలామంది ఆరోగ్యం మీద ఫోకస్‌ పెడుతున్నారు. పని పద్ధతులు, పని సమ­యాలు, తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు.. ఇలా అన్నిటిలోనూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మనుషులపై కరోనా పరిస్థితులు తెచ్చిన ప్రభావం మాత్రం రాబోయే 4, 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
– సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌ 

భారత్‌లో ఇలా.. 
►పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణే ప్రధానమన్న అధిక శాతం ఉద్యోగులు 
► ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతతతో జీవించేందుకు.. అధిక జీతాలొచ్చే ఉద్యోగాలు సైతం వదు­లుకునేందుకు సిద్ధమని 88% మంది చెప్పారు. 
►71 శాతం మంది పని భారం వల్ల తలెత్తే ఒత్తిళ్లు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.  
►వ్యక్తిగత సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నాయన్న 62% మంది. 
►కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు, సంతోషకరమైన జీవితమే ముఖ్యమన్న 46% మంది. 
►పని ఒత్తిళ్లతో సాయంత్రాని కల్లా నిస్త్రాణంగా మారుతున్నామని 26% మంది చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా చూస్తే... 
► ఇతర దేశాల ఉద్యోగులు సైతం మన దేశంలో మాదిరి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. 
►అధిక జీతమొచ్చే ఉద్యోగం కంటే మంచి మానసిక ఆరోగ్యానికి అనువైన ఉద్యోగానికే 81% మంది మొగ్గు చూపారు. 
►తమ పనితీరుపై మానసిక ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 78% మంది చెప్పారు. 
►తాము చేస్తున్న ఉద్యోగం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని 60% మంది పేర్కొన్నారు. 

మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది
ప్రస్తుతం ఉద్యోగులతో పాటు అందరూ మానసిక ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన జీవితాల్లో కరోనా పరిస్థితులు తెచ్చిన అనిశ్చితి అంతా ఇంతా కాదు. మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పటి తీవ్రమైన భయం ఇప్పటికీ కొనసాగుతోంది.

దాదాపు అన్నివర్గాల వారు డబ్బు ఆదా చేయడం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమనే భావనకు వచ్చారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలనే శ్రద్ధ పెరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి అంతగా ఉండేది కాదు. కానీ కరోనాతో చాలా మార్పు వచి్చంది. ప్రతిఒక్కరూ మానసిక ప్రశాంతత కోరుకోవడం ఎక్కువైంది. 
– డాక్టర్‌ బి.అపర్ణా రెడ్డి, హెచ్‌ఆర్‌ నిపుణురాలు  

మరిన్ని వార్తలు