భార్యలు రాజేసిన చిచ్చు.. పక్కనున్న పలకరింపుల్లేవ్‌!! ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?

22 Aug, 2022 12:22 IST|Sakshi

రాజకుటుంబంలో మునుపెన్నడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించలేనంతగా కుటుంబంలో మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. దివంగత ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ డయానాకు పుట్టిన బిడ్డలిద్దరూ.. తిరిగి మునుపటిలా అనోన్యంగా పలకరించుకునే పరిస్థితులు కనిపించడం లేవు. అందుకు కారణం భార్యాలు రాజేసిన చిచ్చే కారణమనే చర్చ నడుస్తోంది అక్కడ. 

తల్లి ప్రిన్సెస్‌ డయానా(బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య) చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నాయి. ఆమె సంతానం ప్రిన్స్‌ విలియమ్(40)‌, హ్యారీ(37)ల మధ్య మనస్పర్థలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా సమసిపోవడం లేదు. మెగ్జిట్‌(రాయల్‌ డ్యూటీస్‌ నుంచి ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించడం) తర్వాత ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది లేదు. విలియం.. రాయల్ స్థాపనను స్వీకరించి.. మరిన్ని బాధ్యతలను చేపట్టి హుందాగా ముందుకెళ్తున్నాడు. ఇక హ్యారీ ఏమో కాలిఫోర్నియాలో జీవితం కోసం రాజ సంప్రదాయాలను తిరస్కరించి, భార్యతో కలిసి రాజప్రసాద వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశాడు.

అన్నదమ్ముల వైరం చాలా దూరం వెళ్లిందని, వాళ్లు తిరిగి కలుసుకోవడం అనుమానమేనని రాజ కుటుంబ వ్యవహారాలపై తరచూ స్పందించే రిచర్డ్‌ ఫిట్జ్‌విలియమ్స్‌ పేర్కొన్నాడు. పరిస్థితులనేవి ఎలా మారిపోయాయో ఆయన పాత సంగతుల్ని గుర్తు చేస్తూ మరీ చెప్తున్నారాయన. 

1997 ఆగష్టు 31వ తేదీన 36 ఏళ్ల వయసులో డయానా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి విలియమ్‌ వయసు 15, హ్యారీ వయసు 12. 

► ఇద్దరూ ఎటోన్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకున్నారు. విలియమ్‌ పైచదువులకు యూనివర్సిటీ వెళ్లగా.. హ్యారీ మాత్రం మిలిటరీ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. 

► తన ప్రియురాలు కేట్‌ మిడెల్‌టన్‌తో 2011లో విలియమ్‌ వివాహం జరిగే నాటికి.. ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బలంగా ఉండిపోయింది. 

ఈ అన్నదమ్ముల వల్లే రాజకుటుంబం బలోపేతం అయ్యిందంటూ చర్చ కూడా నడిచింది. కానీ.. 

► హ్యారీ 2018లో మేఘన్‌ను వివాహం చేసుకోవడం, భార్య కోసం రాజరికాన్ని వదులుకోవడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. 

► రాజకుటుంబంలో చెలరేగిన అలజడి.. అంతర్గతంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి ఓ స్పష్టత లేకుండా పోయింది. కానీ, అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. 

► ఏడాది తర్వాత ఓ ఇంటర్వ్యూలో ‘మా అన్నదమ్ముల దారులు వేరంటూ’ హ్యారీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. 

► ఆపై హ్యారీ, మేఘన్‌లు రాజరికాన్ని వదిలేసుకుంటూ.. అమెరికాకు వెళ్లిపోవడంతో ఇంటి పోరు రచ్చకెక్కింది. 

► ఓఫ్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో.. మేఘన్‌, కేట్‌ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విస్తృత స్థాయిలో చర్చ కూడా నడిచింది. 

► తన తల్లి డయానాను వెంటాడిన పరిస్థితులే తన భార్యకూ ఎదురుకావడం ఇష్టం లేదంటూ హ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకుటుంబంలో కలహాల తీవ్రతను బయటపెట్టాయి. 

► ఓఫ్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో భార్యాభర్తలిద్దరూ చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్‌ విలియమ్‌ స్పందించాడు. తమదేం రేసిస్ట్‌ ఫ్యామిలీ కాదంటూ ఆరోపణల్ని ఖండించాడు.

► చాలాకాలం ఎడమొహం పెడమొహం తర్వాత.. 2021 జులైలో కెన్‌సింగ్టన్‌ ప్యాలెస్‌ బయట డయానా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ ఇద్దరు అన్నదమ్ములు హాజరయ్యారు. దీంతో ‘ఒక్కటయ్యారంటూ’ కథనాలు వచ్చాయి. 

► అయితే.. ఓఫ్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో సోదరుడు, అతని భార్య చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్‌ విలియమ్‌ తీవ్రంగానే నొచ్చుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఆ తర్వాత సోదరుడిని కలుసుకున్నప్పటికీ ముఖం చాటేస్తూ వచ్చాడు. 

► ఆ ప్రభావం జూన్‌ 2022 క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. 

► ఏ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోలేదు. 

► హ్యారీ, మేఘన్‌లు ఈ సెప్టెంబర్‌లో యూకే వెళ్లనున్నారు. రాణి విండ్‌సోర్‌ ఎస్టేట్‌లో బస చేయనున్నారు. ఇది ప్రిన్స్‌ విలియమ్‌ కొత్త ఇంటికి దగ్గర్లోనే ఉండడం గమనార్హం. 

► ఇక ప్రిన్స్‌ విలియమ్‌ కూడా ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ సమ్మిట్‌ కోసం సెప్టెంబర్‌లోనే కాస్త వ్యవధితో న్యూయార్క్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో హ్యారీని కలిసే అవకాశాలు కనిపించడం లేదు.

► అయితే ఈ పర్యటనలోనూ విలియమ్‌-హ్యారీ కలిసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఎంత మనస్పర్థలు నెలకొన్నప్పటికీ ఈ ఇద్దరూ కలుస్తారనే ఆశాభావంలో ఉన్నారు రాజకుటుంబ బాగోగులు కోరుకునేవాళ్లు.

మరిన్ని వార్తలు