యాంటీ ఏజింగ్‌ ఫుడ్‌ : కనీసం పదేళ్లు తక్కువగా కనిపించడం ఖాయం!

27 Apr, 2022 13:56 IST|Sakshi

ఏమిటీ మీకు...40 ఏళ్లా... అస్సలు అలా కనిపించడం లేదు.. ఇంకా స్వీట్‌ 16లానే ఉన్నారు.. ఇలా అంటే పొంగిపోని వారు ఎవరైనా ఉంటారా. స్త్రీలైనా, పురుషులైనా అసలు వయసుకంటే తక్కువగా కనిపిస్తూ, ఎప్పటికీ టీనేజర్స్‌లా బ్యూటీతో మెరిసిపోవాలని ఆశపడతారు.  ఓ పదేళ్లు తక్కువ వయసుతో అందంగా కనిపిస్తే ఎంత బావుంటుంది అనుకుంటారు చాలామంది. ఈ కోరికతోనే ఆర్టిఫిషియల్ క్రీమ్స్, ట్రీట్‌మెంట్స్‌ అంటూ పరుగులు పెడతారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైన, సహజసిద్ధమైన పద్ధతులు ద్వారానే  బ్యూటిఫుల్‌ లుక్‌తో యంగ్‌ అండ్‌​ఎనర్జటిక్‌గా  మెరిసిపోవచ్చు.


ప్రతి రోజు మన ఆహారంలో తాజాగా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలను చేర్చుకుంటే  అందానికి అందం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలతో  మన చర్మం మెరిసిపోవడమేకాదు, అసలు వయసు కంటే పదేళ్లు తక్కువ వయసున్నవారిలా కనిపిస్తారు. ఆరోగ్యం, ఆనందాన్ని మించిన సంపద , బ్యూటీ ఏముంటుంది.  ఆరోగ్యంతో  పాటు యాంటీ యాజింగ్‌  ఏజెంట్స్‌లా పనిచేసే కొన్ని రకాల  ఆహారాలను ఒకసారి పరిశీలిద్దాం. 

అవకాడో: చర్మానికి కాంతినిస్తుంది.  విటమిన్‌, పొటాసియం, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ఎ,బి, ఇ వంటి విటమిన్లు అధిక మోతాదులో ఉన్న అవకాడోలో  ఫైబర్స్, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండుటవల్ల చర్మం తాజాగా కనపడుతుంది.  తక్కువ వయస్సు వారిగా కనపడేలా చేస్తుంది. అవెకాడో నూనెను అనేక సౌందర్యసాధనాలలో ఉపయోగిస్తారు. క్యాన్సర్, మధుమేహం నియంత్రణకు సహాయ పడుతుంది.  అవెకాడోలో మోనోశాచ్యురేటెడ్ కొవ్వు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. మృతకణాలను తొలగించి చర్మాన్ని తగినంత తేమను అందించి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.

కలబంద: కలబంద లేదా అలోవెరలో అద్భుతమైన ఔషధగుణాలున్నాయి. కలబందలో ఉండే ప్లేథోర అనే యాంటీఆక్సిడెంట్, బీటా కెరోటిన్, విటమిన్ సి, ఇ, విటమిన్లు వయసును సమస్యలను  చాలావరకు తగ్గిస్తాయి.  చర్మంను తేమగా ఉంచి చర్మం మృదువుగా  చేస్తుంది. అలాగే, సన్ బర్న్ నివారించడంలో ఇది గ్రేట్ అని చెప్పొచ్చు.  అలోవెర జెల్ డ్రై స్కిన్, పేల్ స్కిన్, కాస్మొటిక్ ఎలిమెంట్, హెయిర్, స్కాల్ఫ్ సమస్యలను నివారించడంలో సూపర్‌గా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. 

టమాటో: జ్యూసీ కూరగాయ టమాటాలను తరుచుగా తీసుకుంటే యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో పాటు విటమిన్‌సీ, ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా లబిస్తాయి. అంతేకాదు  యూవీ  కిరణాలనుంచి మన చర్మాన్ని  కాపాడుతుంది.  టమాటా లాంటి  ఎర్రటి కూరగాయలు, పండ్లలో లబించే  లైకోపీన్‌ అనే  కాంపౌండ్‌ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.  గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గిస్తుంది  కేన్సర్‌ నివారణలో  సమర్ధవంతంగా పని చేస్తుంది. 

గార్లిక్‌: వెల్లుల్లి నేచురల్‌ యాంటి ఏజింగ్‌ సూపర్‌ ఫుడ్‌ గా పేరొందని వెల్లుల్లి మన ఆరోగ్యానికిమాత్రమే కాదు. వయసు కనపించనీయకుండా  చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.వెల్లుల్లిని ప్రతీరోజూకూరల్లో వాడటంతోపాటు, రెండు లేదా మూడు  వెల్లుల్లి  గర్భాలను నేతిలో వేయించి తీసుకుంటే గుండె సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.


 
ఫిష్‌: యాంటి ఏజింగ్‌ ఫుడ్‌లో మరో కీలక మైన ఆహారం చేపలు. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్‌​ ఉన్న చేపలతో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా  ఆయిల్ ఫిష్‌లో ఒమేగా-3 పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వారంలో ఒకసారి ఆయిలీ ఫిష్‌ తింటే  చర్మం సమస్యలకు చెక్‌ చెప్పవచ్చు. అలాగే గుండె, మెదడు, కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, క్యాన్సర్, కంటి, ఎముకల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.  మానసిక ఒత్తిడినుంచి  దూరం చేసే శక్తి  కూడా ఈ చేపలకుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. 

డార్క్‌ చాక్‌లెట్‌: డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం,  జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లోని కోకోలో ఫ్లేవనాయిడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. యవ్వనంగా కనిపించడంలో డార్క్ చాక్లెట్ ద్వారా అద్భుతాలు చేయవచ్చు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, కోకో బీన్స్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్‌ని ఉన్నాయని నిర్ధరాణ అయింది. కోకో ముడుతలను తగ్గించడంలో సహాయ పడుతుంది. కోకో బీన్స్‌లో సహజంగా లభించే ఫైటోకెమికల్స్ అనేక వ్యాధుల నుండి కాపాడి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

పసుపు: సర్వరోగ నివారిణి పసుపు. యాంటీ బయోటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌.. యాంటీ కేన్సర్‌ లక్షణాలున్న పసుపు చర్మ సమస్యలకు చెక్‌ చెబుతుంది. పసుపు కలిపిన పాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు, చర్మం కాంతివంతంగా మారుతుంది.

వీటన్నింటితోపాటు, ప్రతి రోజు తగినంత నిద్ర చాలా అవసరం. అలాగే రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం, అరగంటకు తక్కువ కాకుండా ఏదో ఒక వ్యాయామం చేయడం లాంటి అలవాట్లు మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.  ఫలితంగా మనం అందంగా, యంగ్‌ అండ్‌ ఎనర్జటిక్‌గా కనిపిస్తాం అనడంలో సందేహమే లేదు. 

మరిన్ని వార్తలు