2030 నాటికి పేదరిక నిర్మూలన సాధ్యమేనా?

12 May, 2023 15:12 IST|Sakshi

 వనరుల నిలయమైన తూర్పు ప్రాంతం ప్రగతి కీలకం!

 సాక్షి,  హైదరాబాద్‌ : భారతదేశంలో పేదరికం గత 32 ఏళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. 1991 వేసవిలో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశంలో సంపద సృష్టికి మాత్రమేగాక దారిద్య్ర నిర్మూలనకు దారితీశాయి. ఇండియాలో 2005-2006 సంవత్సరం 2019-2021 ఏడాది మధ్య దాదాపు 41 కోట్ల 50 లక్షల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంకా ఈ కాలంలో దారిద్య్రం 55శాతం నుంచి కేవలం 16 శాతానికి తగ్గిపోయిందని కూడా గ్లోబల్‌ బహువిధ దారిద్య్ర సూచిక-2022 (ఎంపీఐ) గత అక్టోబర్‌లో వెల్లడించింది.

పేదరికాన్ని ఇలా తగ్గించగలిగినా ప్రపంచంలో అత్యధిక పేద ప్రజలు 2020లో (22 కోట్ల 89 లక్షలు) ఇండియాలోనే ఉన్నారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ), ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్‌ దారిద్య్రం, మానవాభివృద్ధి ఇనిషియేటివ్‌ (ఓఫీ) విడుదల చేపిన ఈ ఎంపీఐ నివేదిక తెలిపింది. పై గణాంక వివరాల్లో కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం ఎంత ఉందో చెప్పకపోయినప్పటికీ మొత్తంమీద కొవిడ్‌ రాక ముందున్న 15 ఏళ్లలో ఇండియాలో పేదరికం గణనీయంగా తగ్గిపోవడం ఓ వాస్తవం. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేదల సంఖ్యను సగానికి తగ్గించాలని 2010లో సమావేశమైన యూఎన్డీపీ, ఓఫీ ప్రతినిధులు నిర్ణయించారు. పదిహేనేళ్లలో దాదాపు 42 కోట్ల మంది దారిద్య్రం నుంచి విముక్తి పొందినా...ఇంకా ఇండియాలో ఇంకా దాదాపు 30 కోట్ల మంది పేదలు ఉంటారని అంచనా. వారిలో 90శాతం (20.5 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రోజుకు సగటున 1.9 డాలర్ల ఆదాయంతో ఆరోగ్యంగా జీవించే వ్యక్తిని దారిద్య్రం నుంచి బయటపడిన మనిషిగా పరిగణిస్తారు. కేవలం ఆర్థిక పరిస్థితి మాత్రమేగాక చదువు, ఆరోగ్యం వంటి అంశాలను కూడా కలిపి ప్రజలు పేదలా, కాదా అని నిర్ధారించే పద్ధతి ఇప్పుడు అమలులోకి వచ్చింది.

తూర్పు రాష్ట్రాల్లో పేదరికం నిర్మూలించడమే ప్రధాన లక్ష్యం కావాలట 
దేశంలోని తూర్పు ప్రాంతం వైరుధ్యాల పుట్ట. అత్యంత సంపన్న ప్రకృతి వనరులున్న ఈ తూర్పు రాష్ట్రాల్లో ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన లోహాలు, ఖనిజాలు అందించే గనులు ఇతర వనరులున్న ఈ ప్రాంతం ప్రగతిపథంలో నడవాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం చొరవ, ప్రోత్సాహకాలు సరిపోవు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు లేదా దారిద్య్రం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించడానికి రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇక్కడ తూర్పు ప్రాంతం అంటే..బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌ గఢ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు. అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు, గనులు ఉన్న ఈ రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసపోతున్నారు. సహజ వనురులున్న సొంత రాష్ట్రాల్లో పనులు లేక ఇతర రాష్ట్రాలకు పోయి ప్రమాదకర ఉద్యోగాలు సైతం వారు చేస్తున్నారు. నీతి ఆయోగ్‌ బహువిధ పేదరిక సూచిక (ఎంపీఐ) ప్రకారం బిహార్‌ లో 51.91శాతం, ఝార్ఖండ్‌ లో 42.16శాతం  ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారు.

ఈ ఐదు తూర్పు రాష్ట్రాల్లోని సహజ వనరుల ఆధారంగా అక్కడ పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయంలో గణనీయ స్థాయిలో దిగుబడులు సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అత్యంత విలువైన గనులున్న ఝార్ఖండ్, అటవీ ప్రాంతాలున్న ఛత్తీస్‌ గఢ్, గతంలో పారిశ్రామికంగా ఓ వెలుగు వెలిగిన పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో పేదరికం పూర్తిగా నిర్మూలించి అభివృద్ధి మార్గంలో నడిపించడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధిక దారిద్య్రాన్ని తొలగించే చర్యలు, ఆర్థిక అభివృద్ధికి రూపొందించే పథకాలు ఏకకాలంలో అమలు చేస్తే తూర్పు ప్రాంతం దేశ ప్రగతికి కీలకపాత్ర దోహదం చేస్తుంది.

-విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ

మరిన్ని వార్తలు