AP: ఆర్టీసీలో ఇక అన్నీ ఈ-బస్సులే

19 Nov, 2022 07:32 IST|Sakshi

ఐదేళ్లలో డీజిల్‌ బస్సుల స్థానంలో అన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే

కార్యాచరణ సిద్ధం చేసి, సీఎంకి సమర్పించిన ఆర్టీసీ

ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి

డిస్కంలతో కలిసి ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు

సింహాచలంలో ప్రత్యేక డిపో.. స్థలాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ

ఇకపై ఆర్టీసీ గ్యారేజీల్లో ప్రైవేటు బస్సులకు కూడా సర్వీసింగ్‌ 

సాక్షి,అమరావతి/గోపాలపట్నం/సింహాచలం: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) పూర్తిగా ఈ – బాట పట్టనుంది. ఆర్టీసీలో డీజిల్‌ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు (ఈ–బస్సులు) రానున్నాయి. కాలుష్య నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ–బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ–బస్సుల కొనుగోలుపై చర్చించి కార్యాచరణను ఖరారు చేశారు. ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు సమర్పించారు. వాటిపై ముఖ్యమంత్రి సమీక్షించి, అనుమతినిచ్చారు. ఆర్టీసీ ఇప్పటికే తిరుమల–తిరుపతి మార్గంలో 100 ఈ–బస్సులను ప్రవేశపెట్టింది. వీటిపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఇప్పుడు రాష్ట్రమంతటా ఈ–బస్సులను ప్రవేశపెట్టనుంది. 

ఈ–బస్సును ఒకసారి చార్జింగ్‌ చేస్తే ఒక రూట్‌లో రానుపోనూ ప్రయాణించవచ్చని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. డిస్కంలతో కలిసి ఈ–బస్సులకు చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో,  రెండో దశలో జిల్లా కేంద్రాల్లోని బస్‌ స్టేషన్లలో చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. మూడో దశలో డివిజన్‌ కేంద్రాలు, రాష్ట్ర సరిహద్దు సమీపంలోని పట్టణాల్లోని బస్‌ స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. 

రెండు దశల్లో 4 వేల ఈ–బస్సులు 
ప్రస్తుతం ఆర్టీసీలో 11,214 డీజిల్‌ బస్సులున్నాయి. వాటి స్థానంలో దశల వారీగా ఈ–బస్సులను ప్రవేశపెడతారు. మొదటగా రెండు దశల్లో 4 వేల బస్సులు కొనాలని నిర్ణయించారు. 2023లో 2 వేల ఈ–బస్సులను ప్రవేశపెడతారు. ఇందుకోసం ఆర్టీసీ వచ్చే ఏడాది ప్రారంభంలో టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. 2024లో పరిస్థితిని సమీక్షించాక.. మరో 2 వేల బస్సులను ప్రవేశపెడతారు. అవసరమైతే ఆ సంఖ్యను పెంచుతారు. ముందుగా సిటీ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూర ప్రాంతాలకు నడపాలని భావిస్తున్నారు. ఐదేళ్లలో ఆర్టీసీలో డీజిల్‌ బస్సు అన్నదే లేకుండా పూర్తిగా ఈ–బస్సులనే నడపాలన్నది లక్ష్యం. వీటి కోసం విశాఖ నగరానికి సమీపంలోని సింహాచలం వద్ద సింహపురి లే అవుట్‌లో ఉన్న ఆర్టీసీ స్థలంలో ప్రత్యేక డిపో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం పరిశీలించారు. 

మరిన్ని వార్తలు