హార్ట్‌ ఎటాక్‌, కార్డియాక్‌ అరెస్టుల కాలం ఇది! ఆగిపోయే గుండె మీది కాకూడదంటే..

24 Feb, 2023 19:39 IST|Sakshi

గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్‌.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్‌ అరెస్ట్‌ సమస్యలతో..  వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. మీడియా.. సోషల్‌ మీడియా వల్ల ప్రతీ ఒక్కరికీ అలాంటి ఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇవేవీ లేకుండా ఆగిపోయే గుండె మీది కాకూదదనుకుంటే.. దానికి బలం అవసరం. మరి ఆ బలం ఎలా అందించాలో వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ కథనం. 

హార్ట్‌ స్ట్రోక్‌, కార్డియాక్‌ అరెస్ట్‌.. ఈ రెండూ వేర్వేరు. గుండె పోటు.. ఉబకాయం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇతర అనారోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. గుండె రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోడం, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల గుండె పోటు వస్తుంది. ఇక సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఎదురయ్యే స్థితి. దీనికి వయసుతో సంబంధం ఉండదు. పైగా దీనిని అంచనా వేయడమూ కష్టం.  అందుకే.. ఈ పరిస్థితులను ఎదుర్కొగలిగే గుండె ఉంటే.. సమస్యనేది ఉత్పన్నం కాదు కదా!. 

కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉంటే.. ప్రాణాల మీదకు రాదు. ఆ ఆరోగ్యం కోసం గుండెకూ ఎక్సర్‌సైజులు అవసరం!. అయితే మనిషి జీవితం ఇప్పుడు యాంత్రికమైపోయింది. దానికి తగ్గట్లే శారీరక శ్రమకు దూరమైపోతున్నాం. కాబట్టి.. రోజులో కాసేపైనా అలసిపోవడం అవసరం అంటున్నారు వైద్యులు.  ముఖ్యంగా.. వాహనాలు, లిఫ్ట్‌లు వచ్చిన తరువాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అందుకే వీలుచిక్కినప్పుడల్లా నడవడం, మెట్లు ఎక్కడం లాంటి వాటి ద్వారా గుండెను పదిలంగా చూసుకోవచ్చు. ఇక.. అధిక బరువు అనే ప్రధాన సమస్య, గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల గుండె కొట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి. 

అనారోగ్యమే కాదు.. అలసట, ఒత్తిడిల వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతింటోంది. కాబట్టి, మనసుకు విశ్రాంతి అవసరం. అది ప్రశాంతతతోనే లభిస్తుంది కూడా. ఈరోజుల్లో ఒత్తిడి.. దాని నుంచి ఏర్పడే ఆందోళన, ఉద్వేగం లాంటివి ప్రతీ ఒక్కరికీ సాధారణం అయ్యాయి. ప్రశాంతత అనేది మనసుకు రిలీఫ్‌ ఇస్తుంది. అందుకోసం రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే.. ఉపశమనం కలగొచ్చు. నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే కంటెంట్‌వైపు మళ్లండి. ఇక కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు. 

► నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ నిద్ర.. అదీ 7-8 గంటలు హాయిగా నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 
► ఫలానా వాటికి ఫలానాది ఓ గుండెకాయ.. అని అనేక సందర్భాల్లో వర్ణిస్తాం. మరి అంతటి ముఖ్యమైన అవయవానికి సరైన ఆహారం అందాల్సిందే కదా!. గుండెకు మంచి ఆహారం అవసరం. అదీ వైద్యనిపుణులను, నిపుణులైన డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం ఇంకా ఉత్తమం. 

► గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలనేది వైద్యులు మొదటి మాట. రెండో మాటగా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటారు. అలాగే.. ఈరోజుల్లో మూడో మాటగా మాంసాహారం ఎక్కువగా తీసుకునేవాళ్లు.. దానిని తగ్గించి తీసుకోవడం మంచిదని చెప్తున్నారు.

► మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌లు ఉంటాయి. అవి‌‌ గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్‌ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

► అవిసె గింజలు, ఆలీవ్‌ ఆయిల్‌, అవకాడో,చియా గింజలు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్‌నట్స్‌, బ్రొకోలి, కొత్తిమీర, పిస్తా వంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. బ్రెడ్ తదితర మైదా ఉత్పత్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలంటారు.

► తక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువ ఉండే వాటితో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు. అతిగా వేపుళ్లు, మసాలాలు-కారం దట్టించిన ఫుడ్‌ కూడా అస్సలు మంచిది కాదు.

► మితంగా తింటే ఏదైనా ఆరోగ్యమే. ఇష్టమొచ్చింది తింటే అధిక చెడు కొలెస్ట్రాల్, అధిక బరువుకు దారితీస్తుంది. గుండెకే కాదు.. ఇతర అవయవాలనూ ప్రభావితం చేసి ఇతరత్ర జబ్బులు పలకరించే ప్రమాదం ఉంటుంది. 

► ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే తీరు ప్రభావితమవుతుంది. అంటే గతితప్పుతుంది. కార్డియో మయోపతి అంటే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం. ఆల్కహాల్ తీసుకున్న సమయంలో ట్ల్యాబ్లెట్లు వేసుకోకూడదు.  

► స్మోకింగ్‌ చేసేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 70% ఎక్కువ. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్మోకింగ్‌కు దూరంగా ఉండటం మంచిది.

► అట్రియల్ ఫిబ్రిల్లేషన్ (గుండె అతి వేగంగా కొట్టుకోవడం) రిస్క్ ను పెంచుతుంది. దీనికి నిద్ర తగ్గితే మరింత ముప్పు ఎదురవుతుంది. నిద్ర తగ్గి, గుండె అతి వేగంగా కొట్టుకుంటే అతి హార్ట్ ఫెయిల్యూర్ లేదా స్ట్రోక్ కు దారితీయవచ్చు.

► మంచి గాఢ నిద్ర, సరిపడా ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పునరుజ్జీవం అవుతుంది. అలాగే, గుండె ఆరోగ్యం కూడా పటిష్టమవుతుంది.  అర్ధరాత్రి తర్వాత కూడా మేల్కొని ఉంటే అది అనారోగ్య సమస్యలకు దగ్గరి దారి అవుతుంది. ఇది ఇప్పటి యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. సెల్‌ఫోన్లు, ఇతర అలవాట్లతో చేజేతులారా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. 

► గుండె సమస్యల్ని గుర్తించడం చాలా కష్టం. రెగ్యులర్‌ చెకప్‌ల ద్వారానే సమస్యలను నిర్ధారించుకోవచ్చు. అయితే కొన్ని సంకేతాలు మాత్రం రాబోయే ముప్పును అంచనా వేయొచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. కడుపులో తీవ్రమైన నొప్పి. పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం. కడుపులో గ్యాస్ పెరిగినట్లు అసిడిటీగా అనిపించడం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, పుల్లటి తేన్పులు.. ఛాతీలో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యులు దగ్గరికి వెళ్లాలి. ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. కార్డియాక్‌ అరెస్ట్‌ను అంచనా వేయడం వీలుకాని పని. అందుకే.. గుండెను బలంగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. ఇంటి వైద్యం-సొంత వైద్యం కాదు.. గుండెను కాపాడుకోవాలంటే ఆస్పత్రులకు, వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే!.

మరిన్ని వార్తలు