అందుకు చంద్రబాబు ఒప్పుకున్నారా?.. ఆయన నమ్మగలరా?

3 Feb, 2023 13:42 IST|Sakshi

తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ నెల్లూరు నుంచే వైస్సార్‌సీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఇది వినడానికి టీడీపీ వారికి  బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా.. అదే సూత్రం ఆ పార్టీకి వర్తింపచేస్తే టీడీపీ ఇప్పటికే పతనమైపోయిందని వారే ఒప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయితే పతనం అయిపోతే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మూడేళ్ల క్రితమే బయటకు వచ్చేశారు కదా!. మరి ఇప్పటికే పార్టీ పతనం అయిందని అంగీకరిస్తారా?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పటికీ వైఎస్సార్‌సీపీ, పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెక్కుచెదరలేదు. అదరలేదు.. బెదరలేదు. అలాంటిది ఇలాంటి ఉడత ఊపులకు ఉలిక్కిపడతారా!.

నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు అసమ్మతిగళం విప్పడం పార్టీకి కొద్దిగా చికాకే కావచ్చు. కానీ, పార్టీ అదినాయకత్వం వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకుంది. శ్రీధర్ రెడ్డి బదులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డిని, రామనారాయణరెడ్డి స్థానంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియోజకవర్గాల బాధ్యుయులుగా ప్రకటించింది. ఆదాల ప్రభాకర రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఉండేవారు. మంత్రి కూడా అయ్యారు. కానీ, అప్పట్లో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సరిపడక కాంగ్రెస్‌లోకి వచ్చారు. తదుపరి సోమిరెడ్డిని శాసనసభ ఎన్నికలలో ఓడించారు. విభజన సమయంలో కొంతకాలం టీడీపీలో ఉన్నా 2019లో వైఎస్సార్‌సీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. ఆయన మందీ మార్బలం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. నెల్లూరు రూరల్‌లో ఆయన రంగంలోకి దిగడం వల్ల వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అత్యంత విధేయుడనని తనకు తానే ప్రకటించుకునేవారు. తాను చనిపోతే సీఎం జగన్ వచ్చి పార్టీ జెండా కప్పాలన్నదే తన కోరిక అన్నంతవరకు కూడా వెళ్లేవారు. ఇలాంటి మాటలను బహిరంగసభలలో పెద్ద స్వరంతో చెప్పేవారు. తాను మధ్య తరగతి కుటుంబీకుడిని అయినా సీఎం జగన్ చేరదీసి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని, ఆ విశ్వాసాన్ని ఎన్నటికీ మరువబోనని చెప్పేవారు. అలాంటి కోటంరెడ్డి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవిపై ఆశ పుట్టింది. అందులో తప్పు లేదు. కానీ, వివిధ కారణాల రీత్యా ఆయనకు పదవి లభించలేదు. అంతమాత్రాన ఆయన ఇలా అవిధేయుడుగా మారతారని ఎవరూ ఊహించలేదు. నిజానికి శ్రీధర్ రెడ్డి అప్పడప్పుడు సంకేతాలు ఇవ్వకపోలేదు. 

అమరావతి రైతుల పేరుతో కొందరు చేసిన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం, పార్టీ కార్యక్రమాలుగా  కాకుండా సొంతంగా తన పేరుతోనే నియోజకవర్గంలో ప్రోగ్రాంలు పెట్టుకోవడం వంటివి చేశారు. అప్పుడప్పుడు అధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ నేతలు గతంలో కోటంరెడ్డిపై దౌర్జ్యన్యకారుడని, బెట్టింగ్ రాయుడని పలు ఆరోపణలు చేయడం, వాటిన ఆయన ఖండించడం జరిగేవి. ఒక మహిళా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించిన అభియోగంపై కేసు నమోదు అయింది. ఇవన్ని ఎలా ఉన్నా ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేయకుండా ఉండటం కూడా గమనించాల్సిన అంశమే. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఆనం రామనారాయణరెడ్డిని మెచ్చుకోవడం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని తమ ట్రాప్‌లోకి తెచ్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత, అమరావతి భూ స్కామ్‌లో  ఆరోపణలు ఎదుర్కుంటున్న నారాయణతో ఆపరేషన్ నిర్వహించారన్న సమాచారం బయటకు వస్తోంది. ఆయన వీరిద్దరిని తమ ట్రాప్‌లోకి తెచ్చుకోగలిగారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌తో పాటు ఆర్థికవనరులు సమకూర్చే బాధ్యత ఆయన తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా వైఎస్సార్‌సీపీ నాయకులు కోటంరెడ్డి విషయంలో పెద్దగా అనుమానించలేదని అనుకోవాలి. అలా భావించి ఉంటే ఇటీవలే ముఖ్యమంత్రి జగన్.. ఆయనను పిలిచి మందలించేవారు కారు. అప్పుడే కొత్త ఇన్‌ఛార్జీని నియమించేవారు.

కోటంరెడ్డి ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ ఆరోపణలు చేయడం సహజంగానే ప్రతిపక్షానికి ఒక అస్త్రం దొరికినట్లయింది. విశేషం ఏమిటంటే ఫోన్‌ ట్యాపింగ్‌లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడటం. ఆయన వద్ద ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన అధికారి అప్పట్లో ఇజ్రాయిల్  సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి విపక్షంపై నిఘా పెట్టాలని ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసులోనే ఆయన సస్పెండ్ కూడా అయి కేసును ఎదుర్కొంటున్నారు. కోటంరెడ్డి విషయంలో ప్రభుత్వ నిఘా విభాగం అధినేత అనవసరంగా తనకు వచ్చిన ఒక సమాచార రికార్డును  శ్రీధర్ రెడ్డికి పంపినట్లు అనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఆ అధికారి  చెప్పబోతే, పరిస్థితిని అర్ధం చేసుకున్న కోటంరెడ్డి అప్రమత్తమై అన్ని విషయాలు బహిర్గతం అయిపోతున్నాయని భావించి ఈ ఆరోపణ చేసినట్లుగా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని  మాట్లాడుతూ ఈయన నారా లోకేష్‌తో ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నట్లు టీడీపీ నేతలే వెల్లడించారని చెప్పారు. 

అలాగే, చంద్రబాబుతో కూడా అన్నీ మాట్లాడుకునే ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు. లేకుంటే టీడీపీ టిక్కెట్ వచ్చేస్తుందని ఎలా చెప్పగలుగుతారు?. ఇంతవరకు వైఎస్సార్‌సీపీని వీడలేదు.. టీడీపీలో చేరలేదు. అయినా, నియోజకవర్గంలో టీడీపీ పెత్తనం తనదే అయినట్లుగా అంటున్నారంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. పోనీ, ఆయన అనుకున్నట్లు వస్తే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినో, లేక ఏ ఇతర సీనియర్ నేతనో కాదని కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా?. దీనిని ఆయన నమ్మగలరా?.

అసలు సమస్య ఏమిటంటే ఈయన ప్రవర్తన తీరుతెన్నులు, ఇతర అంశాలపై పార్టీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తుంటాయి. వాటి ఆధారంగా 2024 ఎన్నికలలో టిక్కెట్ రాదన్న భావన ఈయనకు వచ్చి ఉండవచ్చు. గెలిచినా, ఓడినా రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదో పార్టీ నుంచి పోటీచేయాలని నేతలు అనుకుంటారు. అందువల్లే కోటంరెడ్డి  తన విధేయతను అవిధేయతగా మార్చుకుని ఉండవచ్చనిపిస్తుంది. అతిగా పొగిడే వారిని అంతగా నమ్మరాదనే లోకోక్తి కూడా ఉంది.  అతి వినయం ధూర్త లక్షణం అంటారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో సీఎం జగన్‌ను అంతగా పొగిడింది తన పదవిపైన ఆశతోనే అన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇలాంటి ఫిరాయింపుదారులు చరిత్రలో ఎంతో మంది కనిపిస్తారు. వారిలో అత్యధికులు రాజకీయంగా కనుమరుగైపోయిన ఘట్టాలే ఎక్కువ. 
- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. 

మరిన్ని వార్తలు