చెప్పాడంటే చేస్తాడంతే.. సీఎం జగన్‌ సక్సెస్‌ మంత్రా ఇదే..

14 Feb, 2023 20:33 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వపరంగానే కాదు.. పార్టీ పరంగా కూడా వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. వాటిని అమలు చేస్తున్నారు. పార్టీ పరంగా గృహ సారధులు పేరుతో కొత్తగా కార్యకర్తలను తయారు చేస్తున్న విధానం భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీని క్షేత్ర స్థాయిలో ఎలా నడిపించవచ్చో ఆయన చేసి చూపిస్తున్నారు. సీఎం జగన్ చేస్తున్న ప్రయోగం సఫలం అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి భారీ గెలుపు ఖాయం.  

ఇంటింటికి సంక్షేమ ఫలాలు..
ఇందుకోసం పార్టీలో పెద్ద కసరత్తే చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకు రావడం ప్రభుత్వపరంగా ఒక సంచలనం. దానికి వలంటీర్ల వ్యవస్థను అనుసంధానం చేయడం ఎవరూ ఊహించని విషయం. తద్వారా ప్రజలకు ప్రభుత్వం లేదా పరిపాలన తమ ఇళ్ల వద్దే అందుబాటులో ఉందన్న నమ్మకాన్ని కలిగించారు. ఇది ప్రభుత్వపరంగా జరిగిన ఒక సఫల ప్రక్రియ. దీనిని పార్టీకి అనుసంధానం చేసుకోవడానికి సీఎం జగన్ సచివాలయ స్థాయిలో కన్వీనర్లు, వారి పరిధిలో గృహ సారధులను నియమిస్తున్నారు. ఇప్పటికే ఐదు లక్షల మంది పార్టీ సైన్యాన్ని సిద్దం చేశారట. ప్రభుత్వపరంగా వలంటీర్ల వ్యవస్థ ఉంటే, వారితో సమాంతరంగా ప్రతి 50 ఇళ్లకు  పార్టీ పరంగా ఈ గృహ సారధులు పనిచేస్తారని అనుకోవచ్చు. 

సూక్ష్మ స్థాయికి కార్యకర్తల వ్యవస్థ..
గతంలో బీజేపీ బూత్ కమిటీ కాన్సెప్ట్ తెచ్చినప్పుడు అది సాధ్యమేనా అన్న అనుమానం వచ్చేది. కానీ, ఆయా రాష్ట్రాలలో బీజేపీ ఆ మోడల్ అనుసరించి విజయవంతం అయింది. దాంతో ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు బూత్ లెవెల్‌లో కమిటీలు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు ముందుకు వేసి మరింత సూక్ష్మస్థాయికి కార్యకర్తల వ్యవస్థను తీసుకువెళుతున్నారన్నమాట. ఇది అంత తేలికైన విషయం కాదు. ఒక రకంగా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో నేతలతో పాటు వీరు కూడా కీలకం కాబోతున్నారు. ఏ చిన్న నేత అయినా వీరిపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. వీరు కాకుండా సాధారణ కార్యకర్తలు ఎటూ ఉంటారు. వలంటీర్లను వైఎస్సార్‌సీపీ తన ప్రచారానికి వాడుకుంటుందని ఇప్పటికే ప్రతిపక్షాలు అనుమానిస్తూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఆ గొడవ లేకుండా గృహ సారధుల పార్టీ వ్యవస్థను తెస్తున్నారు. 

40 ఇయర్స్ కాపీ పేస్ట్‌
గతంలో ఏ ముఖ్యమంత్రి లేదా ఏ పార్టీ అధినేత ఇంత క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించలేదనే చెప్పాలి. గత 30 ఏళ్లుగా టీడీపీ ప్రాంతీయ పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు సైతం సీఎం జగన్ వ్యూహాలను ఎదుర్కోవడానికి సతమతమవుతున్నారు. చంద్రబాబు ఒక ఎత్తు వేసేలోపు ముఖ్యమంత్రి జగన్ పది ఎత్తులు వేయగలుగుతున్నారు. చంద్రబాబు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ఏర్పాటు ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లవచ్చన్న ఆలోచన ఏనాడు చేయలేదు. సీఎం జగన్ ఆ వ్యవస్థల గురించి ప్రకటించగానే చంద్రబాబు విమర్శలు చేశారు. వలంటీర్లను ఎద్దేవా చేశారు. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థలు ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్లడంతో చంద్రబాబు నిస్సహాయ స్థితిలో పడ్డారు. తాము కూడా ఆ వ్యవస్థలను కొనసాగిస్తామని చెప్పక తప్పలేదు. అవి అలా ఉండగానే ముఖ్యమంత్రి జగన్ పార్టీ పరంగా కూడా దాదాపు అలాంటి వ్యవస్థలనే ప్రవేశ పెట్టారు. ఇప్పుడు దీనిని ఎలా ఎదుర్కోవాలన్నది చంద్రబాబుకు, ఆయన పార్టీ నేతలకు పెద్ద సవాలు కావచ్చు. అంతేకాదు.. సీఎం జగన్ వీరందరిని మార్చి 18-26 వరకు ప్రతీ ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. వీరు ప్రభుత్వపరంగా జరుగుతున్న కార్యక్రమాలు వివరించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వీరు చెబుతారు. దీనికి జగనన్నతోనే మన భవిష్యత్తు అని పేరు కూడా పెట్టారు. ఇలాంటి పేరు పెట్టడానికి ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. 

ఎల్లోస్.. ఫ్యాక్ట్స్ ప్లీజ్.. 
గత నాలుగేళ్లలో ప్రభుత్వపరంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన నేతగా సీఎం జగన్‌ ఆ నమ్మకం పొందారని అనుకోవచ్చు. అయినా, ఆ మార్పులను ప్రజలు మర్చిపోయేలా ఏమార్చడానికి టీడీపీ, ఆ పార్టీ అనుబంధంగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా సంస్థలు ఉన్నవి.. లేనివి కల్పించి అభూత కల్పనలను ప్రచారం చేస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి గృహ సారధుల వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందని సీఎం జగన్ అంచనా వేస్తుండవచ్చు. అదే సమయంలో చంద్రబాబు పేరుతో టీడీపీ నేతలు ఒక ప్రచారం ఆరంభిస్తున్నారు. మళ్లీ మీరే రావాలి అన్న నినాదాన్ని ఇస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న నినాదంతో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. నినాదం ఫలించింది కానీ.. ప్రజలకు ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదన్న భావన అప్పట్లో నెలకొంది. 2019లో జగన్ అంతకు మించిన నినాదాలు ఇచ్చారు. కావాలి జగన్, రావాలి జగన్, నేను విన్నాను.. నేను ఉన్నాను.. అన్న నినాదాలు ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోను సింపుల్‌గా ప్రజలకు అర్ధం అయ్యేలా తయారు చేసి తన కార్యక్రమాలను పాజిటివ్‌గా తీసుకు వెళ్లారు. 

అదే చంద్రబాబు నాయుడు వందల కొద్ది హామీలను మేనిఫెస్టోలో పెట్టి, చివరికి వెబ్‌సైట్‌ నుంచి దానిని తొలగించారు. సీఎం జగన్ మాత్రం ఇప్పుడు కూడా తన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ 98 శాతం అమలు చేశానని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అందులోనూ ప్రత్యేకించి పేద ప్రజల కోసం ఆయన తీసుకు వచ్చిన స్కీములు విపక్షాల మైండ్‌ను బ్లాంక్ చేశాయంటే ఆశ్చర్యం కాదు. కొంతకాలం వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన టీడీపీ, జనసేనలు, తదుపరి వాటిని తాము కూడా అమలు చేస్తామని, ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పవలసి వచ్చింది. అందులోనే జగన్ సక్సెస్ ఉంది. ఈ నేపధ్యంలో జగనన్నతోనే మన భవిష్యత్తు అన్న నినాదాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి, ఎన్నికల నిర్వహణలో కీలకంగా బాధ్యతలు నిర్వహించడానికి గృహ సారధుల వ్యవస్థ పార్టీకి ఎంతగానో ప్రయోజనం కలిగించవచ్చు.

- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. 

మరిన్ని వార్తలు