Time, Date On Moon: భూమి మీద సరే.. చంద్రుడిపై టైం, తేదీలను ఎలా లెక్కిస్తారు?

23 May, 2023 08:20 IST|Sakshi

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే దాకా అంతా టైమ్‌ ప్రకారం జరగాల్సిందే. వాచీలోనో, ఫోన్‌లోనో టైమ్‌ చూసుకుంటూ జీవితాన్ని పరుగెత్తించాల్సిందే. మనం అనుకున్నదేదైనా జరగకుంటే ‘టైం’ బాగోలేదని వాపోవడమే. ఇది సరేగానీ.. భూమిపై ఒక్కో దేశానికి ఒక్కో టైమ్‌ జోన్‌ ఉంటుంది. ఇండియాకు పగలు అయితే.. అమెరికాకు రాత్రి అవుతుంది. మరి అంతరిక్షంలో ఏ టైమ్, తేదీ పాటించాలి? చంద్రుడిపై సమయం, తేదీలను లెక్కించేదెలా? ఇలాంటి సందేహాలు ఎప్పుడైనా వచ్చాయా.. వీటికి సమాధానాలేమిటో తెలుసుకుందామా..

అప్పట్లో చుక్కలను చూస్తూ..
మానవ నాగరికత అభివృద్ధి మొదలైన తొలి నాళ్లలో అంతరిక్షంలోని నక్షత్రాలు, సూర్య, చంద్రుల స్థితి ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. తర్వాతి కాలంలో గడియారాలతో సమ యాన్ని లెక్కించడం మొదలైంది. పగలు, రాత్రి సమయాల్లో తేడాకు అనుగుణంగా.. భూమిని వివిధ టైమ్‌ జోన్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు సమయాలను వినియోగిస్తున్నారు. మనుషులు భూమికే పరిమితమైనంత కాలం ఇది బాగానే ఉంది. కానీ అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్‌లోకి మను షులు వెళ్లిరావడం, భవిష్య త్తులో  చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లేందుకు ప్రయోగాలు వంటి వాటితో.. ఏ ‘టైమ్‌’ను అనుసరించాలనే తిప్పలు మొదలయ్యాయి.\

ఇప్పుడు స్పేస్‌లో వాడుతున్నది ఏ ‘టైమ్‌’?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ ఎస్‌) భూమి చుట్టూ రోజుకు 16 సార్లు తిరుగుతుంది. ఈ సమయంలో పదహారు సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతాయి. ఒక్కో సమయంలో ఒక్కో దేశంపై ఉంటుంది. మరి టైమ్‌ ఎలా!?.. దీని కోసం ‘యూనివర్సల్‌ టైమ్‌ (యూటీ)’ను పాటిస్తున్నారు.

- భూమ్మీద టైమ్‌ జోన్లను ఏర్పాటు చేసు కున్నప్పుడు బ్రిటన్‌లోని గ్రీన్‌ విచ్‌ ప్రాంతాన్ని మూలంగా తీసుకున్నారు. అక్కడ మొదలయ్యే మొదటి టైమ్‌ జోన్‌ను ‘గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌ (జీఎంటీ)’గా వ్యవహరిస్తారు. ప్రస్తుతానికి దీనినే ‘యూనివర్సల్‌ టైమ్‌’గా పాటిస్తున్నారు.

- అయితే ఈ ‘యూటీ’ కేవలం భూమి చుట్టూ ఉన్న స్పేస్‌ వరకే.. చంద్రుడిపై, అంగారకుడిపై టైమ్‌ను లెక్కించేందుకు ప్రపంచ దేశాల మధ్య ప్రస్తుతం ఎలాంటి ఒప్పందాలూ లేవు.

స్పేస్‌ ప్రయోగాలకు.. ‘ఎంఈటీ’..
అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి వాటిని లాంచ్‌ చేసిన క్షణం నుంచి.. ఎంతెంత సమయం గడిచిన కొద్దీ ఏమేం జరిగిందనేది కీలకమైన అంశం. ఈ క్రమంలోనే స్పేస్‌ ప్రయోగాల్లో ప్రత్యేకంగా ‘మిషన్‌ ఎలాప్స్‌డ్‌ టైమ్‌ (ఎంఈటీ)’ని వాడుతారు. అంటే ఒక రాకెట్‌ లాంచ్‌ అయినప్పటి నుంచీ టైమ్‌ లెక్కించడం మొదలుపెడతారు. దీనినే ‘టీ ప్లస్‌ టైమ్‌’గా చూపిస్తారు.

- ఉదాహరణకు ఒక చంద్రుడి వద్దకు కృత్రిమ ఉపగ్రహాన్ని పంపి, 2రోజుల 5 గంటల పది నిమి షాలు అయితే.. ఆ శాటిలైట్‌కు సంబంధించిన టైమ్‌ను ‘టీ+ 2డేస్‌ 5 హవర్స్‌ 10 మినట్స్‌’గా లెక్కిస్తారు. ఈ విధానాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగాలు చేపట్టినప్పటి నుంచీ వాడుతు­న్నారు. అప్పట్లో దీనిని ‘గ్రౌండ్‌ ఎలాప్స్‌డ్‌ టైమ్‌ (జీఈటీ)’గా పిలిచారు. తర్వాత ఎంఈటీగా మార్చారు.

చంద్రుడిపై ఇలా లెక్కిస్తే సరి అంటూ..
- స్పేస్‌ ప్రయోగాల వరకు సరేగానీ.. చంద్రుడిపై నివాసం ఏర్పర్చు కున్నాక అక్కడ ‘టైమ్‌’ ఎలాగనే సందేహాలు మొదలయ్యాయి. భూమ్మీదిలా పగలు, రాత్రి కలిపి ఒక రోజుగా లెక్కిద్దామంటే కష్టం.

- సాధారణంగా సూర్యోదయం నుంచి అస్తమయం వరకు పగలు.. అప్పటి నుంచి మళ్లీ సూర్యోదయం వరకు రాత్రి. ఈ లెక్కన చంద్రుడిపై సుమారు 15 రోజులు పగలు, మరో 15 రోజులు రాత్రి ఉంటాయి (భూమ్మీది సమయం ప్రకారం). అంటే చంద్రుడిపై ఒక రోజు (మూన్‌ డే) అంటే.. మనకు నెల రోజులు అన్నమాట.

- ఈ సమస్యను అధిగమించడా­నికి, భూమ్మీది సమయానికి సులువుగా అనుసంధానం చేయగలగడానికి ఒక ప్రతిపాదన ఉంది. చంద్రుడిపై సెకన్లు, నిమిషాలు, గంటలను యథాతథంగా లెక్కిస్తూనే.. రోజు (24 గంటల సమయం)ను మాత్రం ఒక సైకిల్‌గా పిలవాలని, 30 సైకిల్స్‌ కలిస్తే ఒక పూర్తి మూన్‌డేగా పరిగణించాలని ఆలోచన. అంటే మనకు ఒక నెల ఒక మూన్‌డే.. మనకు ఒక రోజు ఒక మూన్‌ సైకిల్‌గా లెక్కించొచ్చు. దీన్ని ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.
-సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు