ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?

26 Nov, 2022 16:16 IST|Sakshi

మానవాళి హాయిగా సుఖంగా ఉండాలి. మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి. కొందరి దగ్గరే సంపద అంతా పోగు పడిపోతే.. మెజారిటీ ప్రజలు డొక్కలు మాడ్చుకుంటూ ఆకలి కేకలే వేస్తోంటే ఆ సమాజం ఎలా మనుగడ సాగించగలుగుతుంది? ఎలా ఆనందంగా ఉండగలుగుతుంది. అన్నింటికన్నా ప్రమాదకరమైనవి అసమానతలు, వివక్షలు. వాటిని  రూపు మాపుకుంటూ మానవ సంబంధాలు పెంపొందించుకుంటూ ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేసేలా  దేశాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలి. అప్పుడే మానవాళి మనుగడ సాగించగలుగుతుందని మేథావులు సూచిస్తున్నారు.

ప్రపంచ జనాభా 800 కోట్లు అయిపోయిందని చాలా మంది కంగారు పడిపోతున్నారు. అది పెద్ద సమస్య కాదు. సమస్యల్లా పెరిగిన జనాభా చక్కటి మానవ సంబంధాలతో లోటు లేకుండా మనుగడ సాగించడమే. మన వ్యవస్థల్లోని సవాలక్ష అసమానతలు.. లింగ వివక్షలు పెను సవాళ్లను విసురుతున్నాయి. 300కోట్ల మంది పౌష్ఠికాహారం తినే స్థోమత లేక కడుపులు మాడ్చుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి కారణం ఏంటో మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. జనాభాలో కేవలం 10 శాతం మంది వద్దే 80 శాతం సంపద పోగుపడ్డమే సమస్య. పేదలకు  ఆ సంపద పంపిణీ కాకపోవడం వల్లనే అసమానతలు పెరుగుతున్నాయి. అవే ఆకలి కేకలు పెంచుతున్నాయి. అవే జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.అందుకే ప్రపంచమంతా మనిషి మనిషిగా బతికే వీలు కల్పించడంపైనే  దృష్టి సారించాల్సి ఉందంటున్నారు మేథావులు.

నిన్న కాక మొన్ననే. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది బాబోయ్ అంటూ తెలిసో తెలీకో చాలా మంది గగ్గోలు పెట్టేశారు.జనాభా ఇలా పెరుగుతూ పోతే అందరికీ ఆహారం ఎలాగ? అని  చాలా సీరియస్‌గా ఆందోళన వ్యక్తం చేసేశారు కూడా. జనాభాని నియంత్రిస్తే ఎలాంటి సమస్యా ఉండదని కొందరైతే చాలా అమాయకంగా సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకొందరైతే ఆహార ఉత్పత్తులు పెంచడంపై ప్రపంచం దృష్టి సారించాలని  తోచిన సలహా ఇచ్చారు. ఉన్న ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అదే పది వేలని  కొందరు మేథావులు సూత్రీకరించేశారు. అసలు సమస్య ఎక్కడుంది? సమస్య ఏంటి? అన్నదానిపై ఎవరూ దృష్టి సారించడం లేదు.

జనాభా  పెరుగుతోంది. ఓకే. అది పెరుగుతుంది. అందులో ఆశ్చర్య పడాల్సింది కానీ ఆందోళన చెందాల్సింది కానీ ఏమీ లేదు కదా. ఒకప్పుడు సగటు జీవితకాలంతో పోలిస్తే ఇపుడు ప్రజల ఆయుష్షు బాగా పెరిగింది. దశాబ్ధాల క్రితం చాలా వ్యాధులకు, రుగ్మతలకు మందులే ఉండేవి కావు.  ఏదన్నా సుస్తీ చేస్తేనే రోగనిరోధక శక్తి లేక చనిపోయే పరిస్థితులు ఉండేవి. ఇపుడు ప్రాణాధార ఔషథాలు  అందుబాటులోకి వచ్చేశాయి.

ఒకప్పుడు పేరు చెప్పడానికే భయపడే క్యాన్సర్ వ్యాధి ఇపుడు ఎవరినీ కంగారు పెట్టడం లేదు. క్యాన్సరా? సరేలే..ఆసుపత్రికెళ్తే తగ్గిపోతుందిలే అనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వైద్య రంగంలో ఊహించని విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి కాబట్టి. అందు చేత జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఇక పెరిగిన జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచినంత మాత్రాన ఆకలి కేకలు మాయం అయిపోతాయా? ఛస్తే కావు. ఎందుకంటే ఆహార ఉత్పత్తులు పెంచినంత మాత్రాన అవి పేదల చేతుల్లోకి రావు. పేదలు వాటిని వినియోగించు కోగలగాలంటే వాటిని కొనుగోలు చేసే శక్తి వారికి ఉండాలి. అది జరగాలంటే ప్రభుత్వాలు  పథకాలు రూపొందించాలి. చాలా దేశాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. దేశాలు చాలా సంపన్న దేశాలుగా పేరు గడిస్తున్నాయి. కానీ ఆ దేశాల్లో మెజారిటీ ప్రజలు మాత్రం  గర్భ దారిద్య్రంలో  ఉన్నారు.

ఎక్కడో ఎందుకు మన దేశాన్నే తీసుకుంటే.. మన దేశంలోని 80 శాతం సంపద కేవలం పది శాతం మంది కుబేరుల వద్దే ఉంది. మిగతా 90శాతం మందిలో 80 శాతం మంది నిరుపేదలే. వీరిలో మెజారిటీ ప్రజలు పౌష్ఠికాహారం కొనుగోలు చేయగల స్థోమత ఉన్నవారు కారు. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్  ఆర్గనైజేషన్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరని తేలింది.సహజంగానే ఇందులో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల్లోనే ఉంటారు. మన దేశంలో అయితే 97 కోట్ల మంది పౌష్ఠికాహారం కొనగల స్థితిలో లేరు. ఎందుకంటే ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం జీవన ప్రమాణాలు పడిపోవడంతో మండే కడుపుకు కాలే బూడిదలా ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడమే  గగనమైపోతోంది. ఇక పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలంటే ఎక్కడి నుంచి కుదురుతుంది?

ప్రతీ మనిషీ రోజూ కనీసం 400 గ్రాములు కూరగాయలు, పళ్లు తినాలట. ఇంటి మొత్తానికి అరకిలో కూరగాయలతో కాలక్షేపం చేసే దేశంలో ఒక్క మనిషిపై ఇంత పెట్టుబడి పెట్టగల స్థితిలో ప్రజలుంటారా? ఏటా ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే.. ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్థలన్నీ కుప్పకూలడంతో  జీవన ప్రమాణాలు మరీ అధ్వాన్నంగా దిగజారాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?  (ఇంకా వుంది)

-సీఎన్‌ఎస్‌  యాజులు, కన్సల్టింగ్‌ ఎడిటర్‌, సాక్షి టీవీ

మరిన్ని వార్తలు