హైదరాబాద్‌: వరుస ఐటీ దాడులు.. రియల్టీలో కల్లోలం!

7 Dec, 2022 07:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూడు వెంచర్లు.. ఆరు ప్రాజెక్టులతో జోరు మీద ఉన్న రియల్టీ రంగం కుదుపునకు లోనైంది. వరుసగా జరుగుతున్న ఆదాయపన్ను దాడులు స్థిరాస్తి వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రోజుకో సంస్థపై ఐటీ, ఈడీ సంస్థల దాడులతో స్థిరాస్తి రంగంలో అనిశ్చితి నెలకొంది. ఫీనిక్స్, వాసవి గ్రూప్, సుమధుర, హానర్‌ హోమ్స్, మంత్రి, అరబిందో, స్పెక్ట్రా, వంశీరామ్‌ బిల్డర్స్‌ వంటి నిర్మాణ సంస్థలపై ఆదాయపన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడుల నేపథ్యంలో డెవలపర్లలో అలజడి నెలకొంది. అనధికార లావాదేవీలు, ఆదాయ పన్ను, జీఎస్‌టీ ఎగవేతలే సోదాలకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న డెవలపర్లలో వణుకు మొదలైంది. మరోవైపు ప్రీలాంచ్‌ పేరిట ముందస్తుగా సొమ్ము చెల్లించిన కొనుగోలుదారులకు ఆయా ప్రాజెక్ట్‌లు పూర్తవుతాయో లేదోననే ఆందోళన నెలకొంది. మొత్తంగా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం కల్లోల పరిస్థితిలో ఉంది. 

ప్రాజెక్ట్‌లు నిలిచిపోయి.. 
నగర రియల్టీ రంగంలో గుత్తాధిపత్యం సాధించేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. సామర్థ్యానికి మించి ఒకేసారి నివాస, వాణిజ్య సముదాయాలను ప్రకటిస్తున్నాయి. ఆయా ప్రాజెక్ట్‌లో విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిధులను అదే ప్రాజెక్ట్‌కు వినియోగించాలనే ‘రెరా’నిబంధనలు భేఖాతరు చేస్తూ నిధులను ఇతర ప్రాజెక్ట్‌లకు, అవసరాలకు మళ్లిస్తున్నాయి. దీంతో విక్రయాలు మందగించినా లేదా ఇతరత్రా లీగల్‌ సమస్యలు తలెత్తినా దాని ప్రభావం అన్ని ప్రాజెక్ట్‌ల మీద పడుతోంది. ఫార్మా రంగం నుంచి సడెన్‌గా రియలీ్టలోకి వచి్చన ఓ కంపెనీ.. వచ్చి రాగానే మాదాపూర్, కొండాపూర్‌లో పలు భారీ నివాస, వాణిజ్య సముదాయాలకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో ప్రీలాంచ్‌ సందర్భంగా సంపన్నులు, ప్రవాసులు, బ్యూరోక్రాట్స్‌ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. కానీ, ఊహించని రీతిలో ఆ కంపెనీ ప్రతినిధి అరెస్టు కావడంతో ఇప్పుడా ప్రాజెక్ట్‌ల భవిష్యత్తుపై కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఐటీ దాడులు జరిగిన మరో కంపెనీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పుప్పాలగూడలో ఆ సంస్థ నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం నిర్మాణ పనులకు నిధుల గ్రహణం పట్టుకుంది. 

లెక్కలు సరిదిద్దే పనిలో.. 
వరుస ఐటీ దాడుల నేపథ్యంలో ఆ కంపెనీలన్నీ నల్లధనాన్ని దారిమళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. బ్యాలెన్స్‌ షీట్లు, రికార్డ్‌లు, డేటా వంటి వాటిని ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేసుకొని సమీక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలతో కొనుగోలుదారుల్లోనూ ఆందోళన నెలకొంది. విచారణలో కంపెనీల ఖాతాల్లోని లెక్కల్లో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయోనని విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్‌ విలువ కంటే పదింతల సొమ్మును కంపెనీలకు ముట్టజెప్పారు. ఈక్రమంలో ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచి్చందో చెప్పాలంటూ తమకెక్కడ నోటీసులు వస్తాయోనని మధనపడుతున్నారు. దీంతో ప్రీలాంచ్‌లో విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు డబ్బులు వాపసు ఇవ్వాలంటూ కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. 

లెక్కల్లో దొరక్కుండా.. ఐటీకి చిక్కకుండా.. 
రిజి్రస్టేషన్‌ విలువ కొండాపూర్‌లో చదరపు అడుగు రూ.4,500 మించి లేదు. కానీ, రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. పుప్పాలగూడలో చ.అ.కు రూ.2,200 ఉండగా.. రూ.10 వేలకుపైనే అమ్మకాలు చేస్తున్నారు. నగదు రూపంలో ఫ్లాట్లను విక్రయించేందుకే బిల్డర్లు ఆసక్తి చూపిస్తుంటారు. రిజి్రస్టేషన్‌ విలువకు, అమ్మే రేట్లకు మధ్య అంతులేని వ్యత్యాసం ఉంటుంది. కనీసం 20 శాతం కూడా స్టాంప్‌ డ్యూటీ చెల్లించరు. మిగిలినదంతా బ్లాక్‌ మనీగా మార్చుతారనే అభియోగాలున్నాయి. ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌లోనే సుమారు లక్ష ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా కాగా వీటిల్లో చాలావరకు శంకుస్థాపన నాటి నుంచే విక్రయాలు సాగిస్తున్నవే. అటు స్టాంప్‌ డ్యూటీ ఎగ్గొట్టి, ఇటు నగదు లావాదేవీల లెక్కలు ఐటీకి దొరక్కుండా నిర్మాణ సంస్థల యజమానులు మేనేజ్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

వెంచర్లలో నల్లధనం ఎక్కువ 
అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ఓపెన్‌ ప్లాట్ల వెంచర్లలో అనధికార లావాదేవీలు, నల్లధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 90 శాతం వరకూ భవన నిర్మాణ పనులకే వెచి్చంచాల్సి ఉంటుంది. అలాగైతేనే నిర్మాణం పూర్తవుతుంది. పైగా కస్టమర్లు బ్యాంకు రుణం రూపంలో గృహాలను కొనుగోలు చేస్తారు కాబట్టి అవన్నీ లెక్కల్లోకి వస్తాయి. అదే వెంచర్లలో అయితే బిల్డర్‌ వెచి్చంచే వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఓపెన్‌ ప్లాట్లను ఎక్కువగా సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేస్తుంటాయి. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసిన సొమ్మునే పెట్టుబడి పెడతారే తప్ప రుణంతో కొనరు. దీంతో వెంచర్లలో అనధికార లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయని రామ్‌ డెవలపర్స్‌ ఎండీ రాము తెలిపారు.

మరిన్ని వార్తలు