ఇదేం కర్మ రా బాబూ..!

22 Nov, 2022 18:39 IST|Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రసంగం ధాటిని, ఘాటును ప్రతిపక్షాలకు చవిచూపించారు. నర్సాపురంలో జరిగిన సభలో జగన్ చేసిన ప్రసంగానికి సోషల్ మీడియాలోను, విశ్లేషకుల పరంగానూ వస్తున్న ప్రశంసలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు  తన కర్మకు తననే నిందించుకునేలా జగన్ స్పీచ్ సాగిందంటే అతిశయోక్తి కాదు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న యోచనతో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఆరంభం కాకముందే అభాసుపాలైంది. తామేదో అట్టహాసంగా ఇదేం కర్మ అని ప్రచారం చేయాలనుకుంటే ముఖ్యమంత్రి జగన్ ముందస్తుగానే తమను క్లీన్ బౌల్డ్ చేశారని ప్రతిపక్షం వాపోయే పరిస్థితి ఏర్పడింది. జగన్ తన ప్రసంగంలో  చంద్రబాబు నాయుడే ఒక కర్మ అని, అప్పటి  తెలుగుదేశం పార్టీ పాలనే ఒక కర్మ అని  ప్రజలే అనుకుంటున్నారని చెప్పి ఈ టైటిల్ పెట్టడం తమ కర్మ అని ఆ పార్టీ వారే తలపట్టుకునేలా చేశారు. 

ఆత్మవిశ్వాసం వర్సెస్‌ ఏడుపుగొట్టు ప్రసంగం
జగన్ ప్రసంగంలో వాడి, వేడితో పాటు ఒక ఆత్మ విశ్వాసం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు కాని, పవన్ కళ్యాణ్ ( సీఎం జగన్ పరిభాషలో దత్తపుత్రుడు) కానీ  తాము ఏమి చేస్తామో చెప్పకుండా, తమను గెలిపించాలని ప్రజలను బెదిరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఎన్నికల మానిఫెస్టోలో 98 శాతం అమలు చేశానని, దానిని నమ్మితే తనను ఆశీర్వదించండని ఆయన ధైర్యంగా చెబుతున్నారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా అనలేదు. ఇలా అనాలంటే సాహసం కావాలి. అయితే 2009 ఎన్నికల సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకటి, రెండు తప్ప కొత్త హామీలు ఏమీ ఇవ్వకుండా ప్రజలలోకి వెళ్లి  గెలిచారు. అదే ధోరణిలో ఇప్పుడు జగన్ మరింత దూకుడుగా ఉన్నారని చెప్పాలి. అందుకే ప్రతిపక్ష వ్యూహాన్ని తుత్తినియలు చేయగలిగారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గడపగడపకు కార్యక్రమం నిర్వహించడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారిందని అంతా భావిస్తున్నారు. మొదట ఈ ప్రోగ్రాంను ఎలాగైనా ఫెయిల్ అయిందని ప్రొజెక్టు చేయాలని తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తీవ్రంగా ప్రయత్నించాయి. 

కక్కలేక.. మింగలేక.. పచ్చప్రకోపం
ప్రజలు గడపగడపకు వస్తున్న ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని, నిరసన చెబుతున్నారని విమర్శలు చేశారు. టీడీపీ పత్రికలైన ఈనాడు, ఆంద్రజ్యోతిలు  మరో అడుగు ముందుకేసి అబద్దాలు, సబద్దాలు పోగుచేసి ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. కాని టీడీపీ వ్యూహకర్తలు ఆ ప్రోగ్రాం సక్సెస్ అయిందని గమనించారు. దాంతో గడపగడపకు పోటీగా ఏదో ఒకటి నడపాలని భావించారు. అందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంపై ఇదేం కర్మ అని ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇక్కడే టీడీపీ బలహీనత బహిర్గతమైపోయింది. ఏ కార్యక్రమం అయితే వైసీపీ చేపట్టిందో, దానినే టీడీపీ కూడా మరో రూపంలో చేపట్టవలసి వచ్చింది. టీడీపీ థింక్ టాంక్ వైసీపీని కాపీ కొట్టవలసి వచ్చింది. ఈ నేపధ్యంలో టీడీపీవారు ఒక్క ఇంటికి వెళ్లక ముందే ఇదేం కర్మ బాబూ అంటూ చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలంతా ఈ కర్మ తమకు వద్దని భావించే టీడీపీని ఓడించారని, అలాగే సొంతపుత్రుడు, దత్తపుత్రుడిని ఓడించారని జగన్ పేర్కొన్నారు. టీడీపీ ఓడిపోయిందని ఊరుకుంటే ఎలాగో సరిపెట్టుకోవచ్చు. కాని లోకేష్, పవన్ కళ్యాణ్ ల ఓటమిని గురించి  కూడా ప్రస్తావించి చంద్రబాబును జగన్ ముల్లు పెట్టి పొడిచినట్లుగా ఉంది. దీనికి చంద్రబాబు మరీ ఎక్కువ బాధపడతారేమో తెలియదు. 

నిజంగానే ఇది బాబు కర్మ
సాధారణంగా ఇదేం కర్మ బాబూ అన్న పదాన్ని ఎవరికి వారు వాడుకుంటారు. భాషలో ఉన్న మర్మం తెలియకో, తెలివితక్కువగానో ఇదేం కర్మ అని అనేసరికి  వైసీపీకాని, ప్రజలు కాని ఆ పదాల చివర బాబూ అని తగిలిస్తున్నారు. దాంతో ఇదంతా చంద్రబాబుకు ఎదురుదెబ్బగా మారుతోంది. దీనికి తోడు జగన్ ఒకటికి నాలుగు ఉపమానాలు చెప్పి టీడీపీవారిని మరింతగా ఉడికించారు. చంద్రబాబును  ఇంటిలో, పార్టీలో చేర్చుకున్నందుకు, మంత్రి పదవి ఇచ్చినందుకుగాను ఎన్.టి.ఆర్. ఇదేం కర్మ అని అనుకుని ఉంటారని జగన్ డైలాగు విసిరితే అంతా గొల్లున నవ్వారు. ఇక  చంద్రబాబు కూడా కుప్పంతో సహా  రాష్ట్రం అంతటా స్థానిక ఎన్నికలలో ఓడిపోయినందుకుగాను ఇదేం కర్మ అని తలపట్టుకుని కూర్చున్నారట. ఆయనను చూసి సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఇదేం కర్మ అని అనుకుంటున్నారట. వీళ్ల ధోరణి చూసి రాష్ట్ర ప్రజలంతా ఇదేం కర్మ అని అనుకుంటున్నారట. చమత్కారపూరకంగా జగన్ చేసిన ఈ ప్రసంగంతో టీడీపీ వారి ఇదేం కర్మ కార్యక్రమానికి గాలి తీసేసినట్లయింది. 

అంతా కర్మ సిద్ధాంతం
అదే సమయంలో  సెల్ టవర్ ఎక్కుతామని, పురుగు మందు తాగుతామని, రైలు కింద పడతామని బెదిరించేవారిలాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించి ప్రజలలో వారిని చులకన చేయడంలో జగన్ సఫలం అయ్యారనిపిస్తుంది. కర్నూలులో చంద్రబాబు, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు జగన్ ప్రసంగానికి ఎంత తేడా ఉందో గమనించండి. చంద్రబాబు, పవన్‌లు బూతులు మాట్లాడే స్థాయికి దిగజారితే, జగన్ మాత్రం ఎక్కడా అభ్యంతరకర పదాలు వాడకుండా, అదే సమయంలో ప్రతిపక్షానికి ఎలా వాతలు పెట్టాలో చేసి చూపించి తన స్థాయిని మరింతగా పెంచుకున్నారని చెప్పాలి. విశేషం ఏమిటంటే కొందరు తెలుగుదేశం నేతలు కూడా ఇదేం కర్మ అన్న టైటిల్‌ను వ్యతిరేకించారట. అయినా చంద్రబాబు వినలేదని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ ప్రసంగం తర్వాత నిజంగానేచంద్రబాబు ఇదేం కర్మ బాబూ అని ఆయనకు ఆయనే అనుకోవల్సిందేనేమో!
హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
 

మరిన్ని వార్తలు