ప్రేమ నావలో ప్రయాణం.. సహజీవనం.. పెళ్లి ఊసెత్తితే చాలు!

16 Feb, 2023 21:02 IST|Sakshi

డేటింగ్‌ మన కల్చర్‌లో భాగం కాదని మొత్తుకునే నోళ్లు ఒకవైపు.. భాగస్వాముల్ని సరిగ్గా అంచనా వేయకపోవడం, అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ వాదించే నోళ్లు మరోవైపు. దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న ప్రియురాళ్ల హత్యోందతాలపై పోటాపోటీగా చర్చించుకుంటున్నాయి. ఎక్కడో పుట్టి.. పీకల లోతు ప్రేమలో మునిగిపోయి.. చివరకు పెళ్లి ఊసెత్తితే చాలు ప్రాణం తీసేంత గాఢతను సంతరించుకున్నాయి ఆ లవ్‌ క్రైమ్‌ కహానీలు. 


Shraddha Walkar Case..  శ్రద్ధా వాకర్‌ ఉదంతం
ప్రేయసి శరీరాన్ని రంపంతో ముప్ఫై ఐదు ముక్కలు చేసి.. వాటిని ఫ్రిడ్జ్‌లో భద్రంగా కుక్కేసి.. వీలు దొరికినప్పుడల్లా దూరంగా పడేసి వచ్చినంత ప్రేమ అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాది.  2022 మే 18వ తేదీన జరిగిన ఢిల్లీ మెహ్రౌలీలో జరిగిన ఈ దారుణం.. కొన్ని నెలలు(నవంబర్‌లో) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోమని కోరిన ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను అడ్డుతొలగించుకోవాలనే ప్రయత్నంలో.. తన శాడిజాన్ని ప్రదర్శించాడు 28 ఏళ్ల అఫ్తాబ్‌. 

ఆ చర్య ఎంత పైశాచికంగా ఉందో.. అతని మాటల్లోనే చెప్తుంటే పోలీసులు నివ్వెరపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతం.. 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌తో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. పైగా లవ్‌ జిహాద్‌ కోణం కూడా తెర మీదకు వచ్చి.. రాజకీయ పరమైన దుమారానికి కూడా కారణమైంది. 

2019లో డేటింగ్‌ ద్వారా శ్రద్ధా వాకర్‌, అఫ్తాబ్‌లు పరిచయం అయ్యారు. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. ఇంట్లోవాళ్లకు వాళ్లు స్నేహితులిగా పరిచయం. ఒక్కటి అవుతామంటే శ్రద్ధా పేరెంట్స్‌ ఒప్పుకోలేదు. కోపంతో అతని చెంతకే చేరింది. కానీ, టైం ఒకేలా నడవలేదు.  ఇంటి ఖర్చులు, ఇతర కారణాలతో ఇద్దరికీ గొడవలు అయ్యేవి. శ్రద్ధా ఉండగానే మరో యువతితో(యువతులతో) అఫ్తాబ్‌ చనువుగా మెదులుతూ వచ్చాడు. ఇది ఈ సంచలన కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు. 

 
ఇక రెండోది.. Nikki Yadav Case నిక్కీ యాదవ్‌ ఉదంతం
అమ్మానాన్నలకు దూరంగా కోచింగ్‌ కోసం దేశ రాజధానిలో అడుగుపెట్టిన నిక్కీకి.. సాహిల్‌ గెహ్లాట్‌ పరిచయం.. స్నేహం ధైర్యాన్ని అందించింది. ఆ స్నేహమే తర్వాత ప్రేమైంది. ఇద్దరూ ఒకే కాలేజ్‌. కలిసి బతకాలని గ్రేటర్‌ నోయిడాలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారు. కానీ, ప్రియుడిపై పెంచుకున్న గుడ్డి నమ్మకం చివరికి ఆమె ఉసురు తీసింది. 

భారీగా కట్నం వస్తుందనే ఆశతో(తల్లిదండ్రుల ఒత్తిడి అనే కారణం కూడా) నిక్కీని వదిలించుకోవాలని సాహిల్‌ నిర్ణయించుకున్నాడు. హడావిడిగా ఒక్కరోజు గ్యాప్‌లోనే  ఓ యువతితో నిశ్చితార్థం, వివాహానికి రెడీ అయ్యాడు సాహిల్‌. విషయం నిక్కీకి చేరింది.  తాను ఉండగానే మరో యువతితో వివాహానికి సిద్ధపడిన ప్రియుడి మోసాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. సరిగ్గా పెళ్లినాడే తన పరిస్థితి ఏంటని? నిలదీసింది.

ప్రియురాలి కోపాన్ని తట్టుకోలేక ఫోన్‌ డేటా కేబుల్‌ను మెడకు బిగించి హత్య చేశాడు. ఆపై కారులో శవంతోనే 40 కిలోమీటర్లు చక్కర్లు కొట్టాడు. చివరకు నజాఫ్‌గఢ్‌లోని తన సొంత ధాబాలోని ఫ్రిడ్జ్‌లో ఆమె శవాన్ని భద్రపరిచాడు.  సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రిబవరి 9-10వ తేదీల నడుమ ఈ ఘటన జరగ్గా.. ప్రేమకు సూచికైన ప్రేమికుల దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 


మూడో ఉదంతం..  Megha Case మేఘ ఉదంతం
మూడేళ్ల ప్రేమ.. ఆరు నెలల సహజీవనం.. నెలరోజులుగా భార్యభర్తలమని చెప్పుకుని ఒకే ఇంట్లో కాపురం!. 

దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చేరువలో చోటుచేసుకుంది ఈ దారుణం.  ప్రియుడు ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతున్న ఆమె భరించింది. అతని కోసమే తాను పని చేస్తూ.. ఇల్లు అద్దెకు తీసుకుని పోషిస్తూ వచ్చింది మేఘ. ఎందుకంటే.. హార్ధిక్‌ షా అంటే ఆమెకు అంత గాఢమైన ప్రేమ. వీలైనంత త్వరగా మూడు ముళ్లతో అతనితో దాంపత్యమనే కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కనింది. కానీ, 

ఆ మూర్ఖుడు పెళ్లి ఊసు ఎత్తేసరికి భరించలేకపోయాడు. శారీరక సంబంధంతో ఇలాగే కలిసి ఉందామంటూ తరచూ కూతలు కూశాడు. ఆమె భరించలేక గొడవ పడుతూ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీన మరోసారి గొడవ జరిగింది. కోపం తట్టుకోలేక..  ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ప్రియురాలి శవాన్ని బెడ్‌ కింద ఉండే బాక్స్‌లో భద్రపరిచాడు. ఆ బేవార్స్‌ ఆలోచన అక్కడితోనే ఆగిపోలేదు. ఇంట్లోని సామాన్లను అమ్మేసుకుని.. ఆ డబ్బుతో ఊరి నుంచి ఊడాయించే యత్నం చేశాడు. 

పనిలో పనిగా..  కర్ణాటకలో ఉండే మేఘ పిన్నికి ఫోన్‌ చేసి.. తాను మేఘాను హత్యచేసినట్లు.. ఆత్మహత్యచేసుకోనున్నట్లు చెప్పాడు. ఆమె వెంటనే తెలిసినవాళ్ల సాయంతో పాల్ఘడ్‌ జిల్లా (మహారాష్ట్ర) పోలీసులను అప్రమత్తం చేయించింది. ఇంటి తలుపు పగులగొట్టిన పోలీసులకు బెడ్‌ బాక్స్‌లో మేఘా మృతదేహం లభించింది. అలాగే పక్కా ప్లాన్‌తో పారిపోవాలని యత్నించిన హార్థిక్‌ను మధ్యప్రదేశ్‌ నాగ్డా రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


చివరగా.. తాజాగా వెలుగుచూసిన మరో ఉదంతం. మహారాష్ట్ర థానే జిల్లా నేవీ ముంబైలో జరిగింది. కాకపోతే ఇది కాస్త ముదురు కహానీ. అతనికి 40.. ఆమెకు 35. ఆల్రెడీ వివాహం అయిన ఆమె, మరో వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. భర్త నుంచి విడిపోయి.. ప్రియుడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. కానీ, ప్రియుడు ఆమెను శారీరక సుఖం తీర్చే బొమ్మగా భావించాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. చున్నీని మెడకు బిగించి ఉరేసి చంపాడు. నిందితుడి పేరు రాజ్‌కుమార్‌ బాబురామ్‌ పాల్‌. బాధితురాలు వివాహం చేసుకుందాం అనే సరికి ఆమెను చంపి.. శవాన్ని పొదల్లో పడేశాడు. భర్త ఫిర్యాదుతో విష​యం వెలుగులోకి వచ్చింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

మరిన్ని వార్తలు