లోన్‌యాప్స్‌ లోగుట్టు: తొందర పడ్డారో.. ఇక అంతే సంగతులు

7 Sep, 2022 13:30 IST|Sakshi

అప్పుల వల 

అవసరానికి అప్పులు ఇస్తామంటూ ఊదర

ఎలాంటి పత్రాలు, ష్యూరిటీలు అవసరమే లేదు.. ఇదో ఊబి

అప్పులు ఇచ్చేటపుడు చాలా మర్యాదగా మాట్లాడతారు. ఇచ్చిన తర్వాత బాకీల వసూలు సమయంలో బండబూతులు తిడుతున్నారు. బంధుమిత్రుల్లో పరువు తీసేలా అప్పులు తీసుకున్న వారి ఫోటోలను అసభ్యంగా మార్చి వైరల్ చేస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక  అమాయక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయిన వాళ్లకి విషాదాన్ని మిగులుస్తున్నారు. ఇంతటి దారుణ మారణ కాండలకు తెగబడుతోన్న యాప్ లో వెనక చైనా మూలాలు ఉన్నాయని అంటున్నారు. ఇటువంటి యాప్ లపై ఉక్కుపాదం మోపకపోతే పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం ఉంది. లోన్‌యాప్స్‌.. లోగుట్టు  వాటి కథా కమామిష్షు ఏంటో  చూద్దాం!!

అవసరానికి అప్పులు ఇస్తాం.. పేపర్స్‌..  ప్రాసెస్‌ ఏమీ అవసరంలేదు ..గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే  కాల్స్‌లో తరచుగా వినిపించే మాటలివి. ఆప్యాయంగా మాటలు కలిపి అప్పులు అంటకడుతోన్న యాప్‌లో ఆ తర్వాత బాకీల వసూలులో రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. లోన్ రికవరీ ఏజెంట్లను పంపి రక రకాలుగా అవమానిస్తున్నారు. వేధిస్తున్నారు. కాల్చుకు తినేస్తున్నారు. బంధుమిత్రుల్లో పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది అప్పులు తీసుకున్న వాళ్లు ఆత్మహత్యలతో తమ జీవితాలకు సెలవు ప్రకటిస్తున్నారు. అయిన వాళ్లకి గుండెల నిండా విషాదాన్ని మిగిల్చి పోతున్నారు. అప్పుల వసూళ్ల ముసుగులో లోన్ యాప్ సిబ్బంది చేస్తోన్న దుర్మార్గాలకు అడ్డుకట్ట లేకపోతోంది. చాలా మంది ఈ వేధింపులను తమలో తామే దిగమింగు కుంటున్నారు. ఎవరికైనా చెబితే పరువు పోతుందేమోనని మౌనంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక భరించలేని స్థితికి రాగానే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు.

పాపం ప్రత్యూష
కృష్ణాజిల్లా మచిలీ పట్నం శారదానగర్ కు చెందిన జూనపూడి ప్రత్యూష డబ్బు అవసరమై ఇండియన్ బుల్స్ అనే లోన్ యాప్‌లో అప్పు కోసం ప్రయత్నించింది. లోన్ ఇవ్వాలంటే ముందుగా పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. ఆ పదివేల కోసం  రూపెక్స్ అనే మరో లోన్ యాప్ ను ఆశ్రయించింది ప్రత్యూష. ఆ డబ్బును ఇండియన్ బుల్స్ కు చెల్లించింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ యాప్ ఏజెంట్లు ప్రత్యూషను వేధించడం మొదలు పెట్టారు. ఈ బాధలు భరించలేక తన తల్లి నుండి 90వేలు తీసుకుని రెండు యాప్ లకూ చెల్లించింది. అయినా ఇంకా బాకీ ఉందంటూ ఫోన్లలో వేధించడంతో ప్రత్యూష  ఆత్మహత్యకు పాల్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి.

అసలు నిబంధనలేం చెబుతున్నాయి?
సామాన్య, మధ్యతరగతి వర్గాలే టార్గెట్ గా లోన్ యాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలా అప్పులు ఇవ్వాలంటే ఈ  యాప్ లకు NBFC లైసెన్స్ తప్పని సరిగా ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ లైసెన్సులు మంజూరు చేస్తుంది. ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే లోన్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ అవుతాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎవరికైనా అప్పులు ఇస్తే అది తీర్చడానికి కనీసం 60 రోజుల గడువు ఇవ్వాలి. ఆ నిబంధన పాటించే యాప్ లే గూగుల్ ప్లే స్టోర్ లో రిజిస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడా లోన్ యాప్ కంపెనీలు చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుంటున్నాయి. పైకి ఒకరకమైన షరతులను పేర్కొంటూ  డబ్బులు వసూలు చేసేటప్పుడు మరో పద్ధతి ఫాలో అవుతున్నాయి.

లోన్లు ఇచ్చే సంస్థలెన్ని.?
ఆర్బీఐ డేటా ప్రకారం.. ఫిబ్రవరి 29, 2020 నాటికి 10వేల వరకు NBFC లైసెన్స్ లు ఉన్నాయి. వారిలో 803 మాత్రమే 100 కోట్ల విలువ కలిగిన సంస్థలు ఉన్నాయి. 60 రోజుల కంటే తక్కువ కాల పరిమితి లోన్లు ఇచ్చే యాప్స్‌కు గూగుల్ ప్లే స్టోర్ అనుమతి ఇవ్వదు.పుడు మరో రకమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
ఇలా  దేశంలో పదివేలకు పైగా  లోన్ యాప్స్‌ ఉన్నాయి. వీటిలో మెజారిటీ యాప్ ల  మూలాలు చైనాలో ఉన్నాయి. గతంలో లోన్ యాప్‌లతో  మన నిబంధనలను చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించిన చైనా కంపెనీలను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీలు మూసివేసినా.. చైనా కంపెనీలు కొత్త  కంపెనీలతో మళ్లీ ఆ దందా సాగిస్తున్నారు.

లోన్ వెనక లోగుట్టు ఏంటీ?
మామూలుగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్ లు కావాలంటే బోలెడు డాక్యుమెంట్లు సమర్పించాలి. అదే లోన్ యాప్లో అయితే ఎలాంటి డాక్యుమెంట్లూ అవసరం ఉండదు. కేవలం ఆధార్ నంబర్  ఇస్తే చాలు. ఒక్కసారి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మన ఫోనులోని సమస్త సమాచారం యాప్ నిర్వాహకులకు వెళ్లిపోతుంది. ఇక  ఆ సమాచారాన్ని పట్టుకుని వారు ఇష్టారాజ్యంగా వేధింపులకు తెగబడుతున్నారు.

వేధింపుల పర్వం
అప్పులు తీసుకున్న వాళ్లు అనుకున్న సమయానికి బాకీ తీర్చకపోతే వారి ఫోటోలను న్యూడ్ గా మార్చేసి బంధుమిత్రుల ఫోన్లకు పంపుతున్నారు. ఫోన్లు చేసి మీకు సిగ్గులేదా? తీసుకున్న అప్పు తీర్చరా? అంటూ బూతులు తిడుతున్నారు. పరువు తీసేలా మెసేజీలు పెడుతున్నారు. ఇవి తట్టుకోలేకనే సున్నిత మనస్కులైన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీసుకున్న అప్పుమీద లోన్ యాప్ నిర్వాహకులు వడ్డీలు, చక్రవడ్డీలు ఆపై భూచక్ర వడ్డీలూ వేసేసి పాపం పెంచినట్లు వడ్డీలు పెంచేసుకు పోతున్నారు. తీసుకున్న అప్పులకు వందల రెట్లు  వడ్డీ కట్టినా ఇంకా అసలు అలానే ఉంటోంది. అదే  ప్రజల ప్రాణాలు తీస్తోంది.

ఫోటో, ఆధార్‌ కార్డ్‌, కాంటాక్ట్ నెంబర్లే ష్యూరిటీగా మూడు వేల నుంచి 2 లక్షల వరకు రుణాలను అందిస్తున్నాయి ఈ యాప్స్‌. ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పటి నుంచి మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇంకా కొంత మందికైతే లోన్‌ కట్టడం చేతకాని నువ్వు బతకడం ఎందుకంటూ వాయిస్‌ మేసెజ్‌లు కూడా వస్తున్నాయి. అందుకే అసలు ఇటువంటి యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ లో లేకుండా చేయాలన్న డిమాండ్లూ వినపడుతున్నాయి. 

లోన్ యాప్ ల దుర్మార్గాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఎన్.బి.ఎఫ్.సి. లైసెన్సులు పొందిన లోన్ యాప్ లకు అనుబంధంగా పనిచేసే  యాప్ లపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనాకు 4వేల 430కోట్ల రూపాయల మేరకు నిధులను తరలించిన లోన్ యాప్ లను గుర్తించిన ఈడీ  ఆ యాప్ లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఈ అక్రమ దందాలకు పాల్పడుతోన్న వారికోసం వేట మొదలు పెట్టింది.

అప్పులు లేకుండా ఎవరూ బతుకులు వెళ్లదీయలేరు. అయితే అప్పులు తీసుకునే ముందు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అప్పులు మనల్ని నిండా ముంచేసేలా ఉంటే మన అవసరాలను వాయిదా వేసుకున్నా ఫరవాలేదు కానీ  తొందరపడి అప్పులు తీసుకుని ఊబిలో కూరుకు పోరాదు.  అన్నింటినీ మించి అప్పులు ఇస్తానన్నాడు కదా అని మన సమస్త సమాచారాన్ని లోన్ యాప్ లకు తాకట్టు పెట్టేయడంలోనే అతి పెద్ద ముప్పు ఉంది.
 

మరిన్ని వార్తలు