International Museum Day 2022: సాలార్‌ జంగ్‌ మ్యూజియం, ప్రవేశం ఉచితం

12 May, 2022 15:39 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రముఖ మ్యూజియం సాలార్‌ జంగ్ మ్యూజియం సందర్శకులకు ఒక బంపర్‌ ఆఫర్‌. అంతర్జాతీయ మ్యూజియం డే ని పురస్కరించుకుని కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తోంది.  ఇందులో భాగంగా పిల్లా పెద్దా అంతా ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని  కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యేక వర్క్‌షాప్‌లు,  పెయింటింగ్స్‌ ఎగ్జిబిషన్‌, ఫోటోగ్రఫీ పోటీలను కూడా ఏర్పాటు చేసింది. మే 16వ తేదీ నుంచి 21 తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. 

‘ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే’
1977 నుండి ప్రతి సంవత్సరం మే 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం డేని నిర్వహిస్తున్నారు. సమాజ అభివృద్ధిలో మ్యూజియంలు ఎంత ముఖ్యమైనవో అవగాహన కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ మ్యూజియమ్స్ కౌన్సిల్ (ఐకామ్‌) ఈ పిలుపు నిచ్చింది. 2022లో ‘పవర్‌ ఆఫ్‌ మ్యూజియమ్స్‌’ అనే థీమ్‌తో ఈ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల్లో పాల్గొంటాయి. గత సంవత్సరం, సుమారు 158 దేశాల్లో 37వేలకు పైగా మ్యూజియంలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. 

75 వసంతాల ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సాలార్‌ జంగ్‌ మ్యూజియం డైరెక్టర్‌ డా.నాగేందర్‌ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని సాలార్‌ జంగ్‌ మ్యూజియంలో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్‌ ఉంటాయని తెలిపారు. అలాగే రాత్రి 9 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మ్యూజియంను తెరిచి ఉంచుతామని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించు కోవాలని తెలిపారు.  భవిష్యత్తులో కూడా రాత్రి తొమ్మిదిగంటల వరకు మ్యూజియం సందర్శన అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

అంతేకాదు సెల్ఫీలు లేదా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా సెల్పీ, ఫోటో పాయిం‍ట్లను ఈ సందర్భంగా లాంచ్‌ చేయనున్నామని చెప్పారు. మ్యూజియాన్ని సందర్శించేలా దివ్యాంగులు, అనాథ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. ఉత్సవాల చివరి రోజైన 21వ తేదీన వివిధ విదేశీ కార్యాలయాల ప్రతినిధులు కూడా మ్యూజియాన్ని సందర్శిస్తారని నాగేందర్‌ చెప్పారు. 

అలాగే చక్కటి పెయింటింగ్స్‌తో ఒక ఎగ్జిబిషన్‌ కూడా ఉంటుందని హైదరాబాద్‌ ఆర్ట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రమణారెడ్డి వెల్లడించారు. ఈ సెలబ్రేషన్స్‌లో విజేతలకు క్యాష్‌ అవార్డులను ఇస్తున్నట్టు  తెలిపారు. 

ఆరు రోజుల ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీ ఫోటోగ్రఫీ  కాంపిటీషన్‌  కూడా ఉంటుంది. మ్యూజియం వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్న పోటీదారులు ఒక్కొక్కరు  25 దాకా ఎంట్రీలను పంపవచ్చన్నారు. భాగ్య నగర్‌ ఫోటో ఆర్ట్‌ క్లబ్‌ సౌజన్యంతో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ  సెక్రటరీ కే జనార్థన్‌ తెలిపారు.  వీటితో  పాటు ఇంటాక్‌ కన్వీనర్‌ అనురాధారెడ్డి  ఆధ్వర్యంలో  హైదరాబాద్‌కు ప్రత్యేకమైన బిద్రి ఆర్ట్‌పై  ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రివెంటివ్‌ కన్జర్వేషన్‌ మీద  ఒక వెబ్‌నార్‌ నిర్వహిస్తామని కూడా వెల్లడించారు.

కాగా హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడో అతిపెద్దది. ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాలకు కెందిన కళాత్మక వస్తువుల భాండాగారం. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన విలువైన వస్తువులు, అరుదైన  కలాఖండాలు  ఇక్కడ కొలువు దీరాయి. ముఖ్యంగా ఈ  మ్యూజియంలో గంటల గడియారం ఒక పెద్ద ఆకర్షణ. ఇంకా మేలిముసుగు రెబెక్కా, స్త్రీ-పురుష శిల్పం, ప్రధానంగా చెప్పు కోవచ్చు.

ఇంకా అలనాటి అపురూప కళాఖండాలు, ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు,  బొమ్మలు, వస్త్రాలు, చేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు, చెస్‌ బోర్డులు ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాలార్‌ జంగ్‌ మ్యూజియంలోని విశేషాలను కనులారా వీక్షించండి.

మరిన్ని వార్తలు