అయ్యప్పా.. వచ్చేదెట్లా? 

12 Dec, 2022 08:21 IST|Sakshi

శబరిమలకు అరకొరగా ప్రత్యేక రైళ్లు

అన్నింటిలోనూ వందల్లో వెయిటింగ్‌

నగరం నుంచి ఒక్కటే రెగ్యులర్‌ రైలు

మోత మోగుతున్న విమాన చార్జీలు

తిప్పలు తప్పవు అంటున్న భక్తులు

సాక్షి, హైదరాబాద్‌: అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులకు రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరో రెండు నెలల వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్‌ జాబితానే దర్శనమిస్తోంది. గత రెండేళ్లుగా దర్శనాలు నిలిచిపోయిన దృష్ట్యా ఈసారి  నగరం  నుంచి లక్షలాది మంది తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. మాలధారులతో పాటు సాధారణ భక్తులు సైతం రైళ్ల కోసం బారులు తీరుతున్నారు.

కానీ.. భక్తుల డిమాండ్‌ మేరకు రైళ్లు లేవు. దక్షిణమధ్య రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 ప్రత్యేక  రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ అన్నింటిలోనూ ఇప్పటికే బెర్తులు భర్తీ కావడంతో పాటు వెయిటింగ్‌ లిస్టు వందల్లోకి చేరింది. కొన్నింటిలో బుకింగ్‌ కూడా అవకాశం లేకుండా ‘రిగ్రేట్‌’ కనిపిస్తోంది. ఈ ఏడాది కనీసం10 లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లే అవకాశం ఉంది. దక్షిణమధ్యరైల్వే  ప్రకటించిన అరకొర రైళ్లు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. 

ఆలస్యంతో ఇక్కట్లు.. 
గతంలో ఇలాగే మకరజ్యోతి దర్శనం ముంచుకొస్తున్న తరుణంలో  హడావుడిగా కొద్దిపాటి రైళ్లను ప్రకటించారు. అవి సైతం విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరాయి. నగరం నుంచి వెళ్లిన రైళ్లు పరిమితమే. దీంతో   భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పైగా చాలా వరకు  ఉదయం వెళ్లాల్సినవి సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైళ్లు అర్ధరాత్రి బయలుదేరాయి. గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి.  సకాలంలో దర్శనానికి చేరుకోలేక భక్తులు నిరాశ చెందారు. పైగా  ప్రత్యేక రైళ్లలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో భక్తులు స్నానాలు, పూజలు చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు.  

విమాన చార్జీల మోత... 
రైళ్లలో భారీ డిమాండ్‌ ఉండడంతో చాలా మంది భక్తులు విమానాల్లో  వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో హైదరాబాద్‌ నుంచి వెళ్లే విమానాల్లో సైతం చార్జీలు మోత మోగుతున్నాయి. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నట్లు పలువురు భక్తులు  పేర్కొన్నారు. ఈ చార్జీలు  కూడా తరచూ మారిపోతున్నాయి.  

సంక్రాంతికి కష్టాలే... 
నగరం నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్‌ రైళ్లన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 25 లక్షల మందిప్రయాణికులు హైదరాబాద్‌ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. వీరిలో కనీసం 15  లక్షల మంది రైళ్లపైనే ఆధారపడి ఉంటారు. రైళ్లలో  అవకాశం లభించకపోవడంతో చాలా మంది సొంత వాహనాలు, ఆరీ్టసీ, ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది.    

ఎందుకిలా?
అయ్యప్ప దర్శనం కోసం నగరానికి చెందిన భక్తులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి శబరికి వెళ్లే ఒకే ఒక్క  రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌లో  ఫిబ్రవరికి కూడా అప్పుడే బుక్‌ అయ్యాయి. భక్తుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు  వేయాల్సిన అధికారులు ఆ దిశగా పెద్దగా దృష్టి సారించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అరకొరగా  ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్‌ నుంచి వెళ్లేవి తక్కువగానే ఉన్నాయి.  

చివరి క్షణాల్లో హడావుడిగా ప్రత్యేక రైళ్లను వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే  ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్నింటిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. డిసెంబర్‌ నుంచి జనవరి వరకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరికి వెళ్లనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే భక్తులు తమకు అనుకూలమైన రోజుల్లో శబరికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.  

మరిన్ని వార్తలు