Nawab Malik Arrest: ‘మహా’ మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్‌ మాలిక్‌?

24 Feb, 2022 19:37 IST|Sakshi

MVA protests against Malik’s arrest: మహారాష్ట్ర మైనార్టీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) మహ్మద్‌ నవాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయనను అరెస్ట్‌ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మాలిక్‌ అరెస్ట్‌ మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. శివసేన నేతృత్వంలోని అధికార మహా వికాస్‌ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల్లో భాగంగానే నవాబ్‌ను పావుగా వాడుకున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి. 

ఎవరీ నవాబ్‌ మాలిక్‌?
62 ఏళ్ల నవాబ్‌ మాలిక్‌ ప్రస్తుతం ముంబై సబర్బన్‌లోని అణుశక్తి నగర్‌ నియోజకవర్గం నుంచి విధానసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీకీపీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన 1959, జూన్‌ 20న ఉత్తరప్రదేశ్‌లోని దుస్వాలో జన్మించారు. బాంబే యూనివర్సిటీ పరిధిలోని బుర్హానీ కాలేజీ నుంచి 1978లో 12వ తరగతి పాస్‌ అయినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో మాలిక్‌ పేర్కొన్నారు. తన వృత్తి వ్యవసాయం, వ్యాపారం అని తెలిపారు. కలినా (మహారాష్ట్ర) నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనట్టు వెల్లడించారు. తనపై క్రిమినల్‌ కేసులు లేవని, రూ.5.74 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని 2019 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 1996, 1999, 2004లో నెహ్రు నగర్‌ నుంచి విధాన సభకు ఎన్నికయ్యారు. ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధిగా, పార్టీ ముంబై నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

వాంఖెడే వర్సెస్‌ మాలిక్‌
ముంబై క్రూయిజ్‌ మాదక ద్రవ్యాల కేసులో గతేడాది అక్టోబర్‌లో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ అరెస్టైన సందర్భంలో సంచలన ఆరోపణలతో నవాబ్‌ మాలిక్‌ పతాక శీర్షికలకు ఎక్కారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై జోనల్‌ చీఫ్‌ సమీర్‌ వాంఖెడేలపై ఆయన చేసిన ఆరోపణలు పెద్ద కలకలమే సృష్టించాయి. ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌ వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించడమే కాకుండా.. ట్విటర్‌ వేదికగా సమీర్‌ వాంఖెడేను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. నవాబ్‌ మాలిక్‌ టార్చర్‌ తట్టుకోలేక వాంఖెడే.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ఉన్నత న్యాయస్థానం జోక్యంతో సమీర్‌కు మంత్రి మాలిక్‌ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి తెర పడింది. (క్లిక్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!)

మోదీ సర్కారుపై మండిపాటు
కాగా, మోదీ సర్కారుకు వంతపాడుతున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ను కూడా నవాబ్‌ మాలిక్‌ వదిలిపెట్టలేదు. రైతుల ఉద్యమం, మహాత్మ గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతేకాదు.. కంగనకు కేంద్రం కల్పించిన ‘వై ప్లస్‌’ భద్రతను కూడా తొలగించాలని గట్టిగా డిమాండ్‌ చేశారాయన. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టేందుకే మోదీ సర్కార్‌ ఈడీ, ఎన్‌సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రకటించారు. అయితే, 2005 నాటి కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఆయనను అదుపులోకి తీసుకుంది. పాత కేసును తిరగదోడి ఇప్పుడు మాలిక్‌ను అరెస్ట్‌ చేయడాన్ని కక్ష సాధింపుగా బీజేపీ వ్యతిరేక పార్టీలు పేర్కొంటున్నాయి. 

మహా అఘాడీకి ఎదురుదెబ్బ
మంత్రి మాలిక్‌ అరెస్ట్‌ మహా అఘాడీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. బలమైన సీనియర్‌ నాయకుడిని కోల్పోవడం కూటమి మనోధైర్యాన్ని దెబ్బ తీస్తుంది. కూటమిలోని పార్టీలకు ఈ వ్యవహారం తలనొప్పిగా పరిణమించే అవకాశముంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని కేబినెట్‌ తప్పించాలని ప్రభుత్వంపై విపక్ష బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. తమకు వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తున్న ఆయనను జైలుకు పంపించడం ద్వారా బీజేపీ పైచేయి సాధించింది. కొంతకాలంగా నిస్తేజంగా ఉన్న కేడర్‌లో చురుకు తెచ్చి క్రియాశీలంగా పనిచేసేందుకు తాజా పరిణామం కమలనాథులకు ఉపయోగపడుతుంది. (క్లిక్‌: ఉక్రెయిన్‌లో భారతీయుల ఆర్తనాదాలు.. ప్రభుత్వం ముందున్న ప్లానేంటి?)

‘మహా’ పొలిటికల్‌ హీట్‌
నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్‌తో మహారాష్ట్రలో రాజకీయంగా కలకలం రేగింది. ఆయన అరెస్ట్‌ను శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీ ఖండించగా.. బీజేపీ సమర్థించింది. మాలిక్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్ర వ్యాప్తంగా గురువారం బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అటు నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్‌కు నిరసనగా నిర్వహించిన ఆందోళనలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌తో సహా పలువురు మంత్రులు పాల్గొనడం గమనార్హం. కాగా, మంత్రి నవాబ్ మాలిక్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అధికార, విపక్షాల పోటాపోటీ ఆందోళనలతో మహారాష్ట్రలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. మొత్తానికి మాలిక్‌ అరెస్ట్‌ వ్యవహారం మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 

- సాక్షి వెబ్‌ ప్రత్యేకం

మరిన్ని వార్తలు