నయా సాల్‌ ధమాకా.. ఒక్కరోజే రూ.82 కోట్లు తాగేశారు! వందలో 75 మంది.. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీ హవా

2 Jan, 2023 08:22 IST|Sakshi

ఢిల్లీ/హైదరాబాద్‌: నయా సాల్‌కి రోడ్లపై హడావిడి తక్కువగా కనిపించింది. వేడుకలపై పోలీస్‌ ఆంక్షలు అందుకు ఒక కారణం. అయితే.. ముక్క, మందుతో గప్‌చుప్‌ మజాలో రాష్ట్ర ప్రజలు ఏమాత్రం తగ్గలేదు.  ఈ క్రమంలో గతేడాది కంటే అదనంగా ఆల్కాహాల్‌ బిజినెస్‌ జరగడం గమనార్హం. కోవిడ్‌ ఆంక్షలు ఏమాత్రం లేకపోవడం, అమ్మకాలకు అదనపు సమయం ఇవ్వడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాళ్లలో ఎక్కువమందిలో.. బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ 500 ఎంజీ మించి ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. 

4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్‌ బాటిళ్లు.. ఈ లెక్క నగరంలోని మద్యం బాబులు జనవరి 1 పార్టీ పేరుతో తాగేసింది. 

రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం.. 
డిసెంబర్‌ 31వ తేదీన మద్యం డిపోల నుంచి రూ.215.74 కోట్ల విలువైన మద్యం సరఫరా అయ్యింది. చివరి వారం మొత్తంగా రూ.1,111.29 కోట్లు విలువైన అమ్మకాలు జరిగాయి.మద్యం దుకాణాలకు.. రెండు లక్షలకు పైగా కేసుల లిక్కర్‌, లక్షా 30 వేల దాకా బీర్ల కేసులు వెళ్లాయి. గతేడాది అదే తేదీన రూ.171.93 కోట్ల మద్యం అమ్ముడు పోయింది.  అంటే.. రూ.43 కోట్లు అదనంగా ఆల్కాహాల్‌ సేల్‌ జరిగిందన్నమాట. అలాగే.. గతేడాది చివరి వారంలో రూ.925 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే.. రూ.185 కోట్లు అదనంగా అన్నమాట. 

ఇక.. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో నమోదయ్యింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 76,038 కేసుల లిక్కర్‌, 33,985 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి.  అత్యధికంగా 40,655 లిక్కర్‌ కేసులు, 21,122 కేసుల బీర్లతో.. రంగారెడ్డి జిల్లా పరిధిలో జోరుగా విక్రయాలు జరిగాయి.  మూడు జిల్లాల్లో కలిపి రూ.82.07 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో.. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.43.21 కోట్ల ఆదాయం వచ్చింది. దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. 

దేశవ్యాప్తంగా బిర్యానీ హవా
కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశంలో అత్యధికంగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌లలో బిర్యానీ హవా స్పష్టంగా కనిపించింది. శనివారం రాత్రి పదిన్నర గంటల దాకా.. ఏకంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్‌లు చేసినట్లు ప్రముఖ ఫుడ్‌ యాప్‌ స్విగ్గీ ప్రకటించుకుంది. అదే సమయంలో.. 75.4 శాతం హైదరాబాదీ బిర్యానీకే ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ప్రకటించుకుంది.   లక్నో బిర్యానీ, కోల్‌కతా బిర్యానీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌లోని ఓ పాపులర్‌ రెస్టారెంట్‌ ఏకంగా.. 15వేల కేజీల బిర్యానీని సర్వ్‌ చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు