Indian Paper Currency History: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్‌లో నోట్ల ముద్రణ

20 May, 2022 14:54 IST|Sakshi

అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు ఆస్కార్‌లో అవార్డుల పంట పండించింది. బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది అప్పుడెప్పుడో వచ్చిన టైటానిక్‌ సినిమా. సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ షిప్‌లో ఉన్న విలువైన వజ్రాన్ని వెతికే క్రమంలో వెలకట్టలేని ‘ప్రేమ’ గురించి తెలుస్తుంది. టైటానిక్‌ ఘటన 1912 ఏప్రిల్‌ 14 రాత్రి జరిగింది. ఆ తర్వాత పదేళ్లకు 1922 మే 20న అదే తరహా ఘటనలో మన హైదరాబాద్‌ స్టేట్‌కి చెందిన కరెన్సీ సముద్రం పాలైంది. ఈ ప్రమాదం ఇండియాలో పేపర్‌ కరెన్సీ ముద్రణకు అడుగులు పడేలా చేసింది.  ఆ ఘటన జరిగి వందేళ్లు పూర్తైన సందర్భంగా...

దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు అప్పటి బ్రిటీష్‌ ఇండియాలో హైదరాబాద్‌ స్టేట్‌ ప్రిన్సిలీ స్టేట్‌గా ఉండేంది. హైదరాబాద్‌ స్టేట్‌కి ప్రత్యేక రైల్వే, టెలికాం, విద్యుత్‌లాగే సెపరేట్‌ కరెన్సీ ఉండేది. హైదరాబాద్‌ కరెన్సీని సిక్కాగా పిలిచేవారు. అప్పటి పాలకులైన నిజాం రాజులు ఈ కరెన్సీని ఎంతో భద్రంగా కట్టుదిట్టంగా లండన్‌లోని ప్రతిభూతి (మింట్‌)లో ముద్రించేవారు. అలా ముద్రించిన లక్షలాది రూపాయల విలువైన కరెన్సీని ఓడల ద్వారా ఇండియా సరిహద్దులకు తీసుకువచ్చేవారు. 

లండన్‌ నుంచి కరెన్సీ
నిజాం రాజ్య పాలకుడిగా మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ కొనసాగుతున్న కాలంలో కరెన్సీ అవసరం ఉందంటూ లండన్‌కు కబురు పంపాడు. నిజాం ఆదేశాలను అనుసరించి లండన్‌ మింట్‌ వంద రూపాయల విలువ చేసే సిక్కా నోట్లు 40 వేలు, ఐదు రూపాయల విలువ చేసే సిక్కా నోట్లు 25 వేలు, పది రూపాయల విలువ చేసే సిక్కాలు ఒక లక్ష వంతున ముద్రించారు. మొత్తంగా ఈ కరెన్సీ విలువ ఆ రోజుల్లో రూ. 51.25 లక్షలు. 

సముద్రమార్గంలో
ఈ కరెన్సీని ప్రయాణికుల ఓడలో ముంబైకి పార్సెల్‌ చేశారు. ఈ కరెన్సీ కట్టల పార్సెల్‌ను ది పెన్సిల్యూర్‌ ఓరియంటల్‌ స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీకి చెందిన ఓడలో వేశారు. నిజాం కరెన్సీ కట్టలు కలిగిన ఓడ 1922 మే 19న ఇంగ్లండ్‌ నుంచి ముంబైకి బయల్దేరింది. అలా ఇంగ్లండ్‌ నుంచి బయల్దేరిన ఓడ మరుసటి రోజు సెల్టిక్‌ సముద్ర తీరంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సముద్ర వాతావరణం మారిపోయింది. ఎగిసిపడుతున్న అలలు, బలంగా వీస్తున్న గాలులకు ఓడ కంపించిపోయింది. 

జలసమాధి
అల్లకల్లోల పరిస్థితుల మధ్య సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ దారితప్పి ఫ్రెంచ్‌ ఓడ ఉషాంత్‌ను ఢీ కొట్టి నీటిలో మునిగిపోయింది. ఈ ఘటన 1922 మే 20 రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఓడలో ప్రయాణిస్తున్న 44 మంది ప్రయాణికులు, 294 మంది ఓడ సిబ్బంది జలసమాధి అయ్యారు. వీళ్ల ప్రాణాలతో పాటు నిజాం కరెన్సీ కూడా ఆ సముద్రంలోనే మునిగిపోయింది. తీర ప్రాంతం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఓడ జాడ లేకుండా పోయింది.

పదేళ్ల పాటు
నష్టపోయిన కరెన్సీ విషయంలో పార్సిల్‌ సేవలు అందించిన వాటర్లూ సంస్థకు నిజాం ప్రభుత్వానికి మధ్య వివాదం నడిచింది. ఆ రోజుల్లో లండన్‌లో ముద్రించిన కరెన్సీ హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఇక్కడ ఫైనాన్స్‌ మినిస్టర్‌ సంతకం చేసిన తర్వాతే ఆ కరెన్సీనికి విలువ ఉండేంది. లేదంటే అది ఉత్త కాగితంతో సమానం. ఇలా పదేళ్ల పాటు నడిచిన కేసు 1932లో కొలిక్కి వచ్చింది.

వాటికి విలువ లేదంటూ
నీటిలో మునిగిపోయింది నిజాం ఆర్థిక మంత్రి సంతకం చేయని కరెన్సీ అంటే అవి ఉత్త కాగితాలతో సమానం అని కోర్టు తీర్పు వచ్చింది. ఐనప్పటికీ నిజాంకి నష్ట పరిహారంగా రెండు వేల పౌండ్లు చెల్లించాలంటూ వాటర్లూను ఆదేశించింది. ఈ కేసులో తమకు అన్యాయం జరిగినట్టుగా నిజాం రాజులు భావించారు.

నిజాం ముందు చూపు
సముద్రంలో కరెన్సీ మునిగిపోయిన ఘటనతో నిజాం రాజులు పునరాలోచనలో పడ్డారు. ఎంతో దూరం నుంచి లండన్‌లో ముద్రించి సముద్రం మార్గంలో దాన్ని తెప్పించడం వ్యయప్రయాసలతో కూడిన పనిగా వారికి అర్థమైంది. అందుకే  ప్రమాదం జరిగిన వెంటనే తమ కరెన్సీ వ్యూహంలో మార్పులు చేశారు. తమ సంస్థానంలో ఉన్న నాసిక్‌లో పేపర్‌ కరెన్సీ ముద్రణాలయాన్ని 1928లో నెలకొల్పారు. 

నోట్ల రద్దు సమయంలో
2016 నవంబరులో ఒకేసారి సుమారు 15 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను రద్దు చేసింది భారత ప్రభుత్వం. దీంతో ప్రజల దగ్గన నగదు లేని పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున కొత్త కరెన్సీ ముద్రించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒకప్పుడు నిజాం రాజులు స్థాపించిన నాసిక్‌ పేపర్‌ కరెన్సీ ముద్రాణాలయం నిర్విరామంగా పని చేసింది. ఫలితంగా రెండు మూడు నెలలోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

హైదరాబాద్‌ మింట్‌
పేపర్‌ కరెన్సీ ఇండియాలోకి రాకముందు నాణెలు నగదుగా చలామణిలో ఉండేవి. వీటి కోసం హైదరాబాద్‌లో 1806లో మింట్‌ను ఏర్పాటు చేశారు. అంతకు ముందు 1770వ దశకంలో పేపర్‌ను కనుగొన్నారు. అనంతరం బ్రిటీష్‌ వర్తకుల రాకతో పేపర్‌ కరెన్సీ ఇండియాలోకి వచ్చింది. అయితే ప్రభుత్వ పరంగా ఇండియాలో తొలిసారిగా పేపర్‌ కరెన్సీ వాడకాన్ని బ్రిటీషర్లు 1861లో ప్రారంభించారు. ఇండియన్‌ కరెన్సీ లండన్‌లో ముద్రించేవారు. అప్పుడు అక్కడ ప్రింటింగ్‌ వ్యవస్థ ఉండేది. నిజాం కారణంగా ఇండియాలో పేపర్‌ కరెన్సీ ముద్రణ మొదలైంది.

చదవండి: అది భారత భవిష్యత్తుకి మంచిది కాదంటున్న ఆర్బీఐ మాజీ గవర్నర్‌
 

మరిన్ని వార్తలు