రుద్రమదేవి రాజ్యంలో ఏడు అంకె అంటే ఎంతో స్పెషల్‌!

28 Jun, 2022 19:18 IST|Sakshi

కాకతీయులకు ఏడు అంకెపై మక్కువ ఎక్కువ. కాకతీయుల చరిత్ర, వారి జీవనశైలి, ఆనాటి పాలన పద్దతులు తదితర అంశాలను పరిశీలిస్తే అంతర్లీనంగా అన్నింటా ఏడు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. గుండయ నుంచి రుద్రమమీదుగా ప్రతాప రుద్రుడి వరకు కాకతీయులు ఏడుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారనే అంశాలపై కచ్చితమైన వివరణ, సమాధానాలు లభించలేదు. కానీ ఏడుకు ప్రత్యేక స్థానం అయితే లభించింది. అందుకు అద్దం పట్టే ఉదాహరణలను కోకొల్లలుగా చూపించవచ్చు. మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.

కాకతీయ శిల్ప కళావైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కాకతీయ శిలా తోరణ ద్వారాల్లోని మధ్య భాగంలో తామర మొగ్గల లాంటి నిర్మాణాలు ఏడు ఉన్నాయి . కాకతీయ కళాతోరణ పరిణామ క్రమంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న తోరణాలు ఏడు. అవి 1. అనుమకొండ కోట ప్రవేశ ద్వారాలు  2.కొలనుపాక తోరణం 3. వెల్దుర్తి తోరణం    4. ఐనవోలు దేవాలయ తోరణాలు  5. నందికంది తోరణం 6. రామగుండం తోరణం 7. వరంగల్ కీర్తి తోరణం

ఏడు కోటలు
కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు నగరం చుట్టూ ఏడు కోటలు ఉండేవి. అందుకే ఓరుగల్లు కోటకు సప్త ప్రకార పరివేష్టిత నగరమని ఏకామ్రనాథుడు రాసిన 'ప్రతాపరుద్రచరిత్ర'  పేర్కొంది.  ఈ ఏడు కోటలు ఇలా ఉన్నాయి.  1 .మట్టి కోట        2. పుట్ట కోట 3. కంప కోట 4.  కంచు కోట 5. గవని కోట 6. రాతి కోట          7. కత్తికోట  ఇందులో ప్రస్తుతం రాతి కోట, మట్టి కోట దాదాపు పూర్తిగా కనపడుతుండగా పుట్ట కోట వరంగల్ నగర పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. 

గిరి దుర్గాలు
రాజ్యం సరిహద్దుల్లో గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కాకతీయులు అక్కడ ఉన్న కొండలపై సైనిక స్థావరాలుగా ఏడు  గిరి దుర్గాలను నిర్మాణం చేసుకున్నారు . అవి 1. ప్రతాపగిరి కోట 2. గొంతెమ్మ గుట్ట 3. కాపురం గుట్టలు 4. నందిగామ కోట 5. మల్లూరు గుట్ట     6. రాజుపేట గుట్టలు  7. ధర్వాజల గుట్టగా ఉన్నాయి. ఇలా ఏడు గిరి దుర్గాలను ఏర్పాటు చేయడంలో  మాత్రమే కాకుండా ఆ కోటల  నిర్మాణంలో కూడా ఏడు సంఖ్య ఉండడం విశేషం. 

ఇక్కడా ఏడుకే ప్రాధాన్యం
ప్రతాపగిరి కోటకు ఏడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మల్లూరు కోట గోడ ఏడు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దర్వాజల గుట్ట మీద ఏడు దర్వాజలు ఉన్నాయి.  ప్రముఖ కాకతీయ ఆలయాలన్ని ఏడు రాతి పలకల వరుసల వేదికపై నిర్మాణం చేయబడ్డాయి. హన్మకొండలోని  ప్రముఖ జైన కేంద్రమైన అగ్గలయ్య గుట్ట మీదనున్న  జైన తీర్ధంకరుల శిల్పాల సంఖ్య ఏడు. వరంగల్ కోటలోని ప్రసిద్ద శంభుని  గుడి  ప్రాంగణంలో ఉన్న మంటపం ఏడు స్తంభాలతో నిర్మాణం జరిగింది. 

పాలనలో
కాకతీయులు వారి నిర్మాణాలల్లో మాత్రమే కాకుండా పాలనా విధానంలో కూడా ఏడు సంఖ్యను ఉపయోగించారు. వారి పాలనా కాలంలో ప్రజా సంక్షేమంకోసంగాను   సప్త సంతానాల కల్పన కోసం   కృషిచేశారు. సప్త సంతానాలు: 1. స్వసంతానం  2. వన ప్రతిష్ఠ 3. దేవాలయ నిర్మాణం 4. అగ్రహార నిర్మాణం.   5.   ప్రబంధ రచన     6. ఖజానా అభివృద్ధి    7. తటాక నిర్మాణం.

సప్త మాతృకలు
శైవ మతాన్ని ఎక్కువగా అవలంబించిన కాకతీయ పాలకులు పరాశక్తి స్వరూపమైన అమ్మవార్లను కూడా ఆరాధించారు . ఆ అమ్మవార్లు ఏడుగురు ఉండడం విశేషం. 
సప్తమాతృకలు : 1.బ్రహ్మాణి  2. మహేశ్వరి 3. కౌమారి 4. వైష్ణవి  5. వారాహి     6. నారసిమ్హి  7. ఐంద్రీలుగా పూజించారు. 

సరస్సుల్లోనూ
ఇలా పై అంశాలన్నింటిని పరిశీలించి చూస్తే  కాకతీయ పాలకులు ఏడు అనే సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నారని తెలుస్తోంది. కాకతీయులు  తవ్వించిన ప్రముఖ సరస్సులు 1. రామప్ప   2.  పాఖాల   3.  గణపసముద్రం 4. లక్నవరం 5.  బయ్యారం 6.  ఉదయ సముద్రం 7. రంగ సముద్రం. 

ఏడు బావులు
నీటి పారుదల రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన కాకతీయ పాలకులు ఓరుగల్లు రాతి కోట పరిధిలో 7 మెట్ల బావులను నిర్మాణం చేశారు. శృంగార బావి  2. మెట్ల బావి 3. ఈసన్న బావి  4.  అక్కా చెల్లెళ్ళ బావి  5. సవతుల బావి    6. కోడి కూతల బావి    7.  గడియారం బావి. 

కోటలో ఆలయాలు
చారిత్రక ప్రసిద్ధి పొందిన ఓరుగల్లు రాతి కోట నుండి  మధ్య కోట భాగంలో ప్రస్తుతం కాకతీయ కాలం నాటి ఏడు చారిత్రక  కట్టడాలు ఉండడం విశేషం. శివాలయం   2. విష్ణు ఆలయం 3. వెంకటేశ్వర ఆలయం    4. కొండ మసీదు               5. నేల శంభుని అలయం  6.అశ్వ శాల 7.  వీరభద్ర ఆలయం 

కాకతీయులు-  కొండపాక
సిద్దిపేట జిల్లాలో ఒక మండల కేంద్రం కొండపాక. జిల్లా కేంద్రం సిద్దిపేటకు 17 కి.మీ. దూరంలో ఉంటుంది. కొండ పక్క ఉండటంతో దీన్ని ‘కొండపక్క’ అని పిలిచేవారని, అదే క్రమంగా ‘కొండపాక’గా స్థిరపడిందని తెలుస్తోంది. కొండపాకలోని రుద్రేశ్వరాలయం ప్రాచీనమైంది. సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం  కాకతీయ రుద్రదేవుడి కాలంలో  ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కాకతీయుల కాలంలో ఇది సైనికుల విడిది ప్రదేశంగా ఉండేదట. ఏడు సంఖ్యతో కొండపాకకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏడు గ్రామాలు కలిసి ఇది ఏర్పడింది. ఏడు చెరువులు, ఏడు ఆంజనేయస్వామి ఆలయాలు, ఏడు పోచమ్మ గుళ్లు, ఊరి చుట్టూ ఏడు గుట్టలు, గ్రామం మధ్యలో ఏడు నాభి శిలలు నెలకొల్పారు. ఊరికి పశ్చిమంగా రాముని గుట్టలు అనే కొండల వరుస ఉంది. వీటిలో ఒకదాని మీద రామాలయం నిర్మించారు. పశ్చిమ చాళుక్యులు,కాకతీయులకు చెందిన శాసనాలు ఇక్కడి శివాలయ స్తంభాల మీద కనిపిస్తాయి. 
 
- ఖమ్మం జిల్లా జూలూరుపాడు ప్రాంతంలో  కాకతీయుల కాలంలో నిర్మించిన  పోలారం చెరువుకు  అనుసంధానంగా ఏడు చెరువులు, కుంటలను గొలుసుకట్టుగా నిర్మించారు.
 
- 1296లో  నిర్మాణం చేయబడ్డ మెదక్ కోట ఏడు ప్రవేశ  ద్వారాలతో నిర్మాణం చేయబడడం గమనార్హం . 
- వరంగల్ రురల్ జిల్లాలోని కోగిల్వాయి సమీపంలోని చారిత్రిక  చంద్రగిరి గుట్టల్లో కాకతీయ కోట ఆనవాళ్లతో  పాటు ఏడు నీటి గుండాల నిర్మాణం జరిగింది. 
- హిడింబాశ్రమంగా పేరుగాంచిన మెట్టు గుట్టపై సైతం ఏడూ గుండాలు ఉండడం విశేషం. 
 
- కాకతి రుద్రదేవుడు  ప్రస్తుత  సిద్ధిపేట జిల్లాలోని  వెల్డుర్తిలో  స్వయంగా ప్రతిష్టాపన చేసాడని చెప్పబడే  గొనె మైసమ్మకి  ( దేవతల చెరువు సమీపంలోని ఆలయంలో ఉన్న అమ్మవారు )  ఏడు సంవత్సరాలకొకసారి ఏడు రోజుల పాటు జాతర నిర్వహించడం తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ.

కాకతీయుల కాలంలో వాణిజ్య రంగంలో  7 రకాల నాణేలు చలామణిలో ఉండేవి.  ఇలా కాకతీయుల కాలంలో ఏడుకు ప్రత్యేక స్థానం దక్కిందనే భావనకు మద్దతుగా అనేక ఉదాహారణలు చరిత్రలో కనిపిస్తున్నాయి.
వరహాలు : వరహా  ముద్ర కలిగిన బంగారు నాణేలు. 
గద్యానం : వరహా  
మాడ : వరహా లో సగం
రూక :  మాడలో పదవ భాగం 
పణం : వెండినాణెం (1, 1/2, 1/4, 1/8 విలువ కలిగినవి) 
చిన్నం : వరహాలో 8 వ భాగం 
తార : అతి చిన్న నాణెం 

 

మరిన్ని వార్తలు