మహాకాళేశ్వరుడి మంత్రశక్తి జ్యోతిర్లింగం.. ప్రధాని మోదీ ఆవిష్కరించబోయే కారిడార్‌ ప్రత్యేకతలు ఇవే!

11 Oct, 2022 08:31 IST|Sakshi

ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్ట ప్రత్యేకతతో కూడుకున్న జ్యోతిర్లింగం.. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం.  ప్రసిద్ధ శైవ క్షేత్రం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇదేనని చెప్తారు. ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు. అంతేకాదు.. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయ ప్రాంగణం కొత్త సొగసులతో.. సరికొత్తగా ముస్తాబు అయ్యింది.

రుద్ర‌సాగ‌రం స‌మీపాన ఉన్న శ్రీ మహా కాళేశ్వరాలయ కారిడార్‌ ఇవాళ(మంగళవారం) ప్రారంభం కాబోతోంది. మహాకాళ్‌ లోక్‌ పేరిట అభివృద్ధి చేసిన పనులను ఆవిష్కరించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్తిక్‌ మేళా గ్రౌండ్‌లో ప్రజల సమక్షంలో ఆయన పాల్గొనున్నారు కూడా. పూజ తర్వాత ఈ కారిడార్‌ను జాతికి అంకితం చేయనున్నారాయన. 

మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు.

► ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాల‌యంలోని మ‌హాకాళేశ్వ‌రుని విగ్ర‌హాన్ని "ద‌క్షిణామూర్తి" అని కూడా అంటారు.

► ఉజ్జయినిలో శివ‌లింగాలు మూడుఅంత‌స్థులుగా ఉంటాయి. అన్నింటి కంటే కింద మ‌హా కాళ లింగం. మ‌ధ్య‌లో ఉండేది ఓంకార లింగం, ఆ పైన నాగేంద్ర స్వ‌రూప‌మైన లింగం ఉంటుంది. 

► రెండు ఫేజ్‌లు మహాకాళ్‌ లోక్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కారిడార్ కోసం రూ.856 కోట్లు కేటాయించారు. విశాలమైన కారిడార్‌లో శివతత్వం ఉట్టిపడే అలంకరణలతో పాటు సందర్శకులను ఆకర్షించేలా పలు నిర్మాణాలు చేపట్టారు. 

► మొదటి ఫేజ్‌ నిర్మాణానికి రూ.316 కోట్లు ఖర్చు అయ్యింది. 900 మీటర్ల కంటే పొడవైన ఈ కారిడార్‌.. దేశంలోనే అతిపెద్ద కారిడార్‌గా గుర్తింపు దక్కించుకోబోతోంది. 

► మహాకాళేశ్వర ఆలయం చుట్టూరా పాత రుద్రసాగర్‌ సరస్సు చుట్టూరా ఈ కారిడార్‌ విస్తరించి ఉండనుంది.

► ఈ కారిడార్‌కు రెండు భారీ నందీద్వారం, పినాకి ద్వారం ఉన్నాయి. ఈ రెండు గేట్‌వేస్‌లో తక్కువ దూరంలోనే కారిడార్‌ ప్రారంభంలో ఉంటాయి. 

► ఇక ఈ కారిడార్‌కు మరో ప్రత్యేకత.. విశేష అలంకరణలతో కూడిన 108 స్తంభాలు. ఇసుక రాళ్లు,  ఫౌంటైన్లు,  శివ పురాణం నుండి కథలను వర్ణించే 50 కంటే ఎక్కువ కుడ్యచిత్రాలు ఉన్నాయి.

► కారిడార్ ప్రాజెక్ట్‌లో మిడ్-వే జోన్, పార్క్, కార్లు, బస్సుల కోసం బహుళ అంతస్థుల పార్కింగ్. పూలు, ఇతర వస్తువులు అమ్మే దుకాణాలు, సోలార్ లైటింగ్, యాత్రికుల సౌకర్యాల కేంద్రం, నీటి పైప్‌లైన్, మురుగునీటి లైన్ మొదలైనవి కూడా ఉన్నాయి. అలాగే, లైట్, సౌండ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశారు.

► ఇక రూ.310.22 కోట్లతో సెకండ్‌ ఫేజ్‌ పనులు కొనసాగుతున్నాయి. రుద్రసాగర్‌కు పునర్వైభవ పనులు ఇందులోనే సాగుతున్నాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

► రెండో దశ అభివృద్ధి పనుల్లో.. ఆలయ తూర్పు, ఉత్తర ముఖాల విస్తరణ ఉంటుంది. ఉజ్జయిని నగరంలోని మహారాజ్‌వాడ, మహల్ గేట్, హరి ఫాటక్ వంతెన, రామ్‌ఘాట్ ముఖభాగం, బేగం బాగ్ రోడ్ వంటి వివిధ ప్రాంతాల అభివృద్ధి కూడా ఇందులో ఉంది.

పురాణాల ప్రకారం..  ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివారాధనకే అంకితం అయ్యేవాడు. ఒకరోజు ఓ రైతు కొడుకు అయిన శ్రీకరుడు, రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు.

ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి.. క్షిప్ర నదీ తీరంలో మహాశివుని కోసం ప్రార్థనలు చేస్తాడు.  శివుడు తన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి చేరిన శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు, వ్రిధి ల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరిస్తాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి మరణ, వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తాడనే నమ్మకం ఉంది.

మరిన్ని వార్తలు