బంధువులు అవమానించినా.. అమితాబ్‌ నుంచి మోదీ మెచ్చే స్థాయికి ఎదిగాడు

21 Sep, 2022 14:03 IST|Sakshi

రాజు శ్రీవాత్సవ అలియాస్‌ గజోధార్‌ భయ్యా.. కామెడీ సర్క్యూట్‌లో ఈ పేరు ఎంతో పాపులర్‌. దశాబ్దాలుగా కోట్ల మందికి నవ్వులు పంచిన ఆయన అనారోగ్యంతో మరణించడం బాలీవుడ్‌ వర్గాల్లో విషాదం నింపింది. అమితాబ్‌ బచ్చన్‌ లాంటి దిగ్గజ నటుడి నుంచి దేశ ప్రధాని మోదీ దాకా.. అంతా మెచ్చిన మంచి మనిషి ఆయన. 

మైనే ప్యార్‌ కియా చిత్రంలో తళుక్కున మెరిసే క్యారెక్టర్‌ నుంచి.. ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ చాలెంజ్‌లో పాల్గొనడం లాంటి ప్రస్థానంతో సాగింది రాజు శ్రీవాత్సవ జీవితం. డజను పైగా సినిమాలతో, పదుల సంఖ్యలో టీవీ షోలతో, వందల సంఖ్యలతో స్టేజ్‌ షోలతో నార్త్‌ అభిమానులను ఉర్రూతలూగించారాయన. భౌతికంగా ఆయన లేకున్నా.. ఆయన లెగసీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండిపోతుందని నివాళులు అర్పిస్తున్నారు ఇప్పుడంతా. 

టీచర్లను ఇమిటేట్‌ చేస్తూ.. 
ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో 1963లో జన్మించారు రాజు శ్రీవాత్సవ. ప్రముఖ కవి రమేష్‌ చంద్ర శ్రీవాత్సవ తనయుడు ఈయన. చిన్నతనంలోనే మిమిక్రీ అలవాటు చేసుకుని.. తోటి విద్యార్థులను అలరించేవారు. ముఖ్యంగా టీచర్లను అనుకరిస్తూ ఆయన చేసే మిమిక్రీని.. ఆ టీచర్లు సైతం ఆస్వాదించేవారట. అయితే.. 

చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను 2020 ఇంటర్వ్యూలో ఆయన గుర్తు చేసుకున్నారు. బంధువులంతా ఆయన చేసే హాస్యాన్ని చాలా ఏళ్లపాటు అవమానంగా భావించేవారట. పిల్లలు చదువుకోవాల్సింది పోయి.. ఇతరులపై జోకులు వేస్తూ గడపడమేంటని శ్రీవాత్సవ తల్లిదండ్రులను బంధువులు మందలించేవాళ్లట. అంతేకాదు తన కామెడీ వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని, ఆ పనిని ఆపించేయాలని ఒత్తిడి చేయించారట కూడా. కానీ, ఇవేవీ శ్రీవాత్సవను హస్య ప్రస్థానాన్ని ఆపలేకపోయాయి.

► 90వ దశకం కంటే ముందే.. వినోద రంగంలో రాజు శ్రీవాస్తవ  ప్రయాణం మొదలైంది. 1988లో వచ్చిన అనిల్‌ కపూర్‌ తేజాబ్‌ చిత్రం ఆయన డెబ్యూ చిత్రం. ఆపై షారూక్‌, సల్మాన్‌, గోవిందా, హృతిక్‌ రోషన్‌ వంటి తారల చిత్రాల్లో నటించారు రాజు శ్రీవాస్తవ. అయితే ఆయనకు పేరుప్రఖ్యాతలు దక్కింది మాత్రం స్టేజ్‌ మీద పండించిన కామెడీతోనే. అదీ.. మరో బాలీవుడ్‌ హస్య దిగ్గజం జానీ లీవర్‌ గుర్తించిన తర్వాతే!. 

► ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ చాలెంజ్‌లో పాల్గొన్న తర్వాతే రాజు శ్రీవాస్తవ జీవితం మరో మలుపు తిరిగింది. షో రన్నరప్‌గా నిలిచినా కూడా.. తన హాస్యంతో అశేష అభిమానం గెల్చుకున్నారాయన. ఆపై రాజు హాజిర్‌ హోం, కామెడీ కా మహా ముఖాబలా, లాఫ్‌ ఇండియా లాఫ్‌, కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌, గ్యాంగ్‌ ఆఫ్‌ హసీపూర్‌ లాంటి షోలలో పాల్గొన్నారు. బిగ్‌బాస్‌-3లోనూ ఆయన కంటెస్టెంట్‌గా అలరించారు. 

అమితాబ్‌ కూడా వీరాభిమానే.. 
రాజు అమితంగా ఆరాధించే వ్యక్తి బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌. చిన్నతనం నుంచి ఆయన గొంతును అనుకరిస్తూ హాస్యం పడించేవాడట ఆయన. ఈ క్రమంలో.. దీవార్‌ నుంచి డైహార్డ్‌ ఫ్యాన్‌ అయిపోయాడు శ్రీవాత్సవ. ఎంతలా అంటే.. సినిమా పోస్టర్లను తన ఇంట్లో అతికించుకునేంతలా. అమితాబ్‌ తరహాలో జుట్టు క్రాఫ్‌ చేయించుకుని.. మరీ మిమిక్రీ వేషాలు వేసేవాడట రాజు శ్రీవాత్సవ. 

► రాజు శ్రీవాత్సవకు ఎలాగైతే అమితాబ్‌ అభిమాన నటుడో.. అలాగే అమితాబ్‌కు కూడా రాజు శ్రీవాత్సవ ఫేవరెట్‌ కమెడియన్‌ కూడా. చివరికి రాజు శ్రీవాత్సవ ఆస్పత్రి పాలైన తర్వాత ‘లే.. నీకు చాలా పని ఉంది’ అంటూ అమితాబ్‌ స్వయంగా వాయిస్‌ సందేశాలు పంపి.. రాజు శ్రీవాత్సవ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారంటే అర్థం చేసుకోవచ్చు అమితాబ్‌కు ఎంత అభిమానమో!.

► రాజు కేవలం.. బాలీవుడ్‌ ప్రముఖులను మాత్రమే ఇమిటేట్‌ చేస్తాడనుకుంటే పొరపాటే. రాజకీయ నేతలను కూడా భలేగా ఇమిటేట్‌ చేస్తారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున కాన్పూర్‌ నుంచి పోటీ చేయాలనుకుని టికెట్‌ తీసుకుని.. సరైన మద్దతు లేనందున టికెట్‌ను వెనక్కి ఇచ్చేశారాయన. ఆపై బీజేపీలో చేరారు. 

► భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాజు శ్రీవాత్సవ కామెడీ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌కు ఈ కమెడియన్‌ను నామినేట్‌ చేశారు ప్రధాని మోదీ. దీంతో.. స్టేజ్‌ షోలు నిర్వహించి మరీ ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేశారాయన. 

► శ్రీవాత్సవ 1993లో షికాను వివాహం చేసుకున్నారు. ఆయనకు అంతరా, ఆయుష్మాన్‌ అనే ఇద్దరు పిల్లలు. గతంలో.. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై జోకులు వేస్తుండడంతో చంపేస్తామంటూ పాక్‌ నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.

► ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ కుప్పకూలిన ఆయన.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 21వ తేదీన కన్నుమూశారు. 

మరిన్ని వార్తలు