బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 ప్రకటన.. పట్టాభిషేకం​ మాత్రం ఆలస్యం ఎందుకంటే..

10 Sep, 2022 16:51 IST|Sakshi

లండన్‌: క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్‌-3 అధికారికంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. బ్రిటన్‌ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ప్రకటన కార్యక్రమాన్ని టెలివిజన్‌ ప్రసారం చేసింది కౌన్సిల్‌. 

సాధారణంగా.. సింహాసనంపై ఉన్నవాళ్లు మరణిస్తే.. వారసులే ఆటోమేటిక్‌గా తదుపరి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతర్గతంగా ఆ కార్యక్రమం ఉంటుంది. కానీ, బ్రిటన్‌ రాజరికంలో తొలిసారి ఇలా టీవీ టెలికాస్టింగ్‌ ద్వారా ప్రకటించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నాం సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 73 ఏళ్ల ఛార్లెస్‌ అధికారికంగా బాధ్యతలు చేపడుతూ.. ‘అనితరమైన సార్వభౌమాధికారానికి సంబంధించిన బాధ్యతలు తనకు తెలుస’ని ప్రమాణం చేశారు.

 వందల కొద్దీ ప్రైవేట్ కౌన్సిలర్లు.. అందులో బ్రిటన్‌ తాజా ప్రధాని లిజ్‌ ట్రస్‌, క్వీన్‌ ఎలిజబెత్‌-2 వారసులు, ఛార్లెస్‌ భార్య క్యామిల్లా, పెద్ద కొడుకు..తదుపరి వారసుడు విలియమ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఛార్లెస్‌ లేని ప్రత్యేక ఛాంబర్‌లో ఆయన్ని అధికారికంగా రాజుగా ప్రకటించింది యాక్సెషన్ కౌన్సిల్.

 అనంతరం.. ఆయన సమక్షంలోనే మరోసారి ‘ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఫిలిప్‌ ఆర్థర్‌ జార్జ్‌’ ఇకపై యూకేకు సార్వభౌమాధికారి.. రాజు అంటూ ప్రకటించింది. ఆ వెంటనే ఆయన ప్రమాణం చేసి.. రాజపత్రాలపై సంతకం చేశారు. ఇక లోపలి కార్యక్రమం పూర్తికాగానే.. మధ్యాహ్నం 3గం.30ని. ప్రాంతంలో ట్రంపెట్‌ ఊది ఛార్లెస్‌-3ను అధికారికంగా బాహ్యప్రపంచానికి రాజుగా ప్రకటించింది మండలి. అయితే.. 

 బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3ని ప్రకటించినప్పటికీ ఇంకా ఒకటి బ్యాలెన్స్‌ ఉంది. అదే మహారాజుగా ఆయనకు జరగాల్సిన పట్టాభిషేకం. తల్లి మరణించిన వెంటనే ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ అయిన ఛార్లెస్‌.. రాజు హోదా దక్కించుకున్నారు. అయితే.. క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణంతో సంతాప సమయం ముగిశాకే.. ఆయనకు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహిస్తారు. 

 బ్రిటన్‌ రాజరికాన్ని గమనిస్తే ఇంతకు ముందు.. 1952 ఫిబ్రవరి 6వ తేదీన జార్జ్‌-6 మరణించారు. ఆ సమయంలో వారసురాలు ప్రిన్స్‌ ఎలిజబెత్‌-2 రాణిగా ప్రకటించబడ్డారు. అయితే.. క్వీన్‌ ఎలిజబెత్‌-2 పట్టాభిషేకం మాత్రం 1953, జూన్‌ 2న జరిగింది. అయితే ఆమె భర్త ఫిలిప్‌.. ఆ తర్వాతి కాలంలోనూ ప్రిన్స్‌గానే కొనసాగారు. 

► ఇవాళ జరిగిన.. ప్రవేశ వేడుక(ceremony of Accession), తర్వాత జరగబోయే పట్టాభిషేక వేడుక(ceremony of Coronation) మధ్య తేడా ఏంటంటే.. ప్రవేశ వేడుకలో కేవలం అధికారిక ప్రకటన, ప్రమాణం ఉంటుంది. కానీ, పట్టాభిషేకం అనేది కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ నిర్వహించిన మతపరమైన వేడుక. లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో గత 900 సంవత్సరాలుగా పట్టాభిషేక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. 

 సింహాసనంపై ఉన్నవాళ్లు మరణించాక.. తదనంతర రాజు/రాణికు వైభవంగా పట్టాభిషేకం నిర్వహించేందుకే అంత గ్యాప్‌ తీసుకుంటారు.

 పట్టాభిషేక సమయంలో సదరు వ్యక్తి రాజు/రాణి.. చట్టం ప్రకారం పాలించడం, దయతో న్యాయం చేయడం, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నిర్వహించడం లాంటి ప్రమాణాలు చేస్తారు.

► అనంతరం ఆర్చ్‌బిషప్‌ సమక్షంలో.. కింగ్‌ ఎడ్వర్డ్‌ సింహానం మీద అధిరోహిస్తారు. ఆపై సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటాన్ని రాజు/రాణి తలపై ఉంచుతారు ఆర్చిబిషప్‌. 


భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌తో క్వీన్‌ ఎలిజబెత్‌-2

1626 నుంచి బ్రిటన్‌ సింహాసనం విషయంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది.

 బ్రిటన్‌ పట్టాభిషేక కార్యక్రమానికి.. రాజరిక వంశస్థులతో పాటు చట్ట సభ్యులు, చర్చ్‌ సభ్యులు, కామన్‌వెల్త్‌ దేశాలకు చెందిన ప్రధానులు.. ప్రతినిధులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులూ హాజరవుతారు.

మరిన్ని వార్తలు