ఉక్రెయిన్‌ సంక్షోభం: చిన్నమ్మ ఈ పరిస్థితుల్లో ఉండి ఉంటేనా..

2 Mar, 2022 12:04 IST|Sakshi

ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని అంచనా వేయడంలో భారత ప్రభుత్వం తడబడింది. నెలన్నర కిందట.. కేవలం ఉక్రెయిన్‌లోని భారతీయుల క్షేమసమాచారాల సేకరణకే పరిమితం అయ్యింది అక్కడి మన ఎంబసీ. మరోవైపు ఆ సంక్షోభంలోనూ తరగతులు నిర్వహించి ఉక్రెయిన్‌ యూనివర్సిటీలు తప్పు చేస్తే.. విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో భయభయంగానే అక్కడే ఉండిపోయారు భారతీయ విద్యార్థులు. అవే ఇప్పుడు ఆపరేషన్‌ గంగకు అవాంతరాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో సోషల్‌ మీడియాలో చిన్నమ్మ ‘సుష్మాస్వరాజ్‌’ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. 


రష్యా బలగాలు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించిన సమయంలో..  భారత ప్రభుత్వం స్పందించి ఉక్రెయిన్‌లోని మన రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్‌డేట్‌ చేయాలంటూ భారత పౌరులకు సూచించింది. అయితే అప్పటికే చాలా దేశాల పౌరులు తమ తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆపై పరిస్థితి విషమిస్తున్న.. నాలుగైదు రోజుల ముందు కూడా అమెరికా సహా పలు దేశాలు తిరిగి వచ్చేయాలంటూ ఆయా దేశాల పౌరులకు సూచించాయి. కానీ, భారత ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపోయిందని, ఆ ఆలస్యమే భద్రత భయాందోళనలకు కారణమన్న  విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. 


ఉక్రెయిన్‌ భారత విద్యార్థులు

ఆమె ఉండి ఉంటేనా.. 
ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యంలో ‘చిన్నమ్మ’ సుష్మా స్వరాజ్‌ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు నెటిజన్లు, సీనియర్‌ దౌత్యవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.  ఈ సందర్భంగా..  వేచిచూసే ధోరణికి ఆమె పూర్తి వ్యతిరేకమని గుర్తు చేసుకుంటున్నారు. విదేశాంగ మంత్రిగా పని చేసిన టైంలో.. దౌత్యపరంగానే కాదు, సహాయచర్యల్లోనూ ఆమె దూకుడు ప్రదర్శించేవారు.  అనుమతుల కోసం ఎదురు చూడకుండా.. ఎంఈఏ ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా స్వయంగా సుష్మాజీనే రంగంలోకి దిగేవారు. పరిస్థితి ఎలాంటిదైనా..  ఎంతటి క్షిష్టమైన సమస్య అయినా సామరస్యంగా, చాకచక్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించేది ఈ చిన్నమ్మ. అందుకే ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. 


సింగిల్‌ హ్యాండ్‌ సుష్మా.. 
యుద్ధం మొదలైన తర్వాతే భారత ప్రభుత్వం ఆపరేషన్‌ గంగను మొదలుపెట్టింది.  ఉక్రెయిన్‌ పొరుగు దేశాలకు విమానాలు పంపించి.. వాటి సరిహద్దులకు చేరుకున్న భారతీయులను, విద్యార్థులను తరలిస్తోంది. ఆయా దేశాలతో సమన్వయ చర్చలు ప్రారంభించి.. ఇక్కడి నుంచి నలుగురు కేంద్ర మంత్రుల్ని కార్యక్రమాల్ని పర్యవేక్షించాలని పంపించింది మోదీ ప్రభుత్వం. అయినా తరలింపులో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అఫ్‌కోర్స్‌.. అక్కడున్న పరిస్థితులే అందుకు కారణం అనుకోండి. అది వేరే విషయం. అయితే.. సుష్మా స్వరాజ్ ఈ పరిస్థితిలో ఉండి ఉంటే పరిస్థితిని ఎలా డీల్‌ చేసి ఉండేవారో? అనే చర్చను లేవనెత్తారు పలువురు నెటిజన్లు.  

వాస్తవానికి సోషల్‌ మీడియా వేదికగా సుష్మాజీ జోక్యం చేసుకునే తీరు చాలాసార్లు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇతర దేశాలతో డిజిటల్‌ దౌత్యం ద్వారా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సుష్మాజీ. తెలంగాణ యువత కేటీఆర్‌ లాంటి ఎంతో మందికి ఒకరకంగా ఇదే స్ఫూర్తి అనే అనుకోవచ్చు.  ఆపదలో ఉన్నామని, సాయం కావాలని ఎవరైనా అభ్యర్థిస్తే చాలు..  ట్విటర్‌ ఎంఈఏ హ్యాండిల్‌ ద్వారా నేరుగా రంగంలోకి దిగేవారామె. అలా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయులకు సాయం అందించి.. వాళ్ల ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు అందుకున్నారామె.  వ్యక్తిగత సాయాలను పక్కనపెడితే.. 2015 ఆపరేషన్‌ రాహత్‌ గుర్తించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 


ఆపరేషన్‌ రాహత్‌ నాటి ఫొటో

ఒకవైపు సౌదీ అరేబియా-మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు ఉద్రిక్త వాతావరణం నడుమ ఐదు వేలమంది భారతీయులను,  ఇతర దేశాల పౌరులను సురక్షితంగా బయటకు రప్పించిన ఘనత కచ్చితంగా ఆమె టీందే. ముఖ్యంగా బాంబులతో దద్దరిల్లిన ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించిన తీరు..  విరామం తీసుకోకుండా దగ్గరుండి ఆమె పర్యవేక్షించడంపై అప్పట్లో హర్షం వ్యక్తం అయ్యింది.

ఇదే కాదు.. 2018 అగ్నిప్రమాదంలో పాస్‌పోర్టులు తగలబడి పోయి ఇబ్బందులు పడ్డ ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ(అమెరికా) విద్యార్థులను చట్టమైన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా భారత్‌కు రప్పించిన ఘటనా గుర్తు చేస్తున్నారు కొందరు. ఉక్రెయిన్‌ పరిస్థితులు వేరు కావొచ్చు..  కానీ, ఈ పరిస్థితుల్లో గనుక ఆమె ఉండి ఉంటే మాత్రం పరిస్థితి కచ్చితంగా వేరేలా ఉండేదన్న అభిప్రాయం మాత్రం అంతటా వ్యక్తం అవుతోంది. వీ మిస్‌ యూ చిన్నమ్మ.

::: సాక్షి,  వెబ్‌ డెస్క్‌ ప్రత్యేకం

మరిన్ని వార్తలు