సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ తెలుసా?.. ఛాతీతో పాటు చాలాచోట్ల! ఒంట్లో ఇలా అనిపిస్తే జాగ్రత్త పడండి

26 Sep, 2022 16:10 IST|Sakshi

అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మనిషి.. ఆరోగ్యంగా ఉన్నాడే అనిపించే మనిషి.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే.. ఇలాంటి మరణాల్లో సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ కేసులు కూడా ఉంటాయని చెప్తున్నారు వైద్యులు. అంటే.. గుట్టుచప్పుడు కాకుండానే గుండె పోటు వచ్చి ఆ వ్యక్తి అక్కడికక్కడే హఠాన్మరణం చెందుతారన్న మాట. అయితే.. 

సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌.. చాలా నాటకీయ పరిణామాల నడుమ జీవితాల్ని ముగిస్తుంటుంది. గుండె పోటు కంటే చాలా చాలా భిన్నంగా ఉంటుంది నిశబ్ధ గుండె పోటు. కొన్ని కొన్ని సందర్భాలలో అసలు నొప్పి కూడా రాదు. అలాంటప్పుడు దానిని గుర్తించడం కొంచెం కష్టమే. అదే సమయంలో.. మనిషిని గందరగోళానికి గురి చేసి.. ప్రాణానికి ముప్పు కలిగిస్తుంటుంది కూడా!. 

నిశ్శబ్ద గుండెపోటు అంటే..
ఏ ఇతర గుండెపోటు మాదిరిగానే, సైలెంట్ అటాక్ కూడా గుండెకు రక్తసరఫరాను నిలిపివేస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ధమనులలో, చుట్టుపక్కల కొవ్వు, కొలెస్ట్రాల్‌తో కూడిన ఫలకం ఏర్పడినట్లయితే గనుక.. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. 

నిశ్శబ్ద దాడి ప్రమాద ఘంటికలు
సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌కు స్పష్టమైన సంకేతాలు, లక్షణాల గుర్తింపు లేవు. కాబట్టే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌.. ప్రాణాంతకమైందని, అంత్యంత ప్రమాదకరమైందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే.. కొన్ని ప్రమాద ఘంటికల ద్వారా రాబోయే ముప్పు స్థితిని పసిగట్ట గలిగే మార్గాలు ఉన్నాయని సూచిస్తున్నారు. 

ఛాతీపై ఒత్తిడి: సాధారణంగా గుండెపోటు సమయంలో.. ఛాతీలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌లో మాత్రం.. ఛాతీ మధ్యలో తేలికపాటి నొప్పి లేదంటే అసౌకర్యంగా మాత్రమే అనిపిస్తుంటుంది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే..  ఛాతిని పిండేసినట్లు, ఒత్తిడి అనుభూతి కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. ఈ లక్షణాలు.. దాదాపుగా గుండెలో మంట, అజీర్ణం తరహా లక్షణాలను పోలి ఉంటాయి. కాబట్టే, చాలాసార్లు ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నారు.

ఇతర భాగాల్లోనూ అసౌకర్యం
సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌లో ఛాతీ భాగంతో పాటు వీపు భాగం,  చేతులు, పొట్ట,  మెడ, దవడ.. ఇలా ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపెడుతుంది. ఉన్నట్లుండి ఆయా భాగాల్లో విపరీతమైన నొప్పి కలుగుతుంటుంది. ఇలాంటి సందర్భంలో వైద్యులు సంప్రదించడం మంచిది. 

శ్వాస ఇబ్బంది
సైలెంట్ హార్ట్ ఎటాక్‌తో బాధపడుతుంటే గనుక.. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడతారని వైద్యులు చెబుతున్నారు. మైకం, ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోవచ్చు కూడా. ఈ లక్షణాలు కొనసాగితే.. వైద్యుడిని సంప్రదించాలి. సరైన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. 

చల్లనిచెమటలు..
సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్స్‌కు చాలా సాధారణ లక్షణం ఇది. జ్వరంలాగా అనిపించినప్పటికీ.. సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌లో ఈ స్థితి చాలా తక్కువ టైం ఉంటుంది. అలాగే జ్వరంలాగా కాకుండా చల్లని చెమట్లు పట్టి, త్వరగతిన ఎండిపోతుంది. కాబట్టి, ఇలాంటి స్థితి ఎదురైనా వెంటనే.. డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా ముప్పును ముందే పసిగట్టొచ్చు.. ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చు!. 

మరిన్ని వార్తలు