Sid Sriram: ఆ గొంతులో ఏదో మ్యాజిక్‌... మరేదో మాయ!

19 May, 2022 13:30 IST|Sakshi

సిద్‌ శ్రీరామ్‌.. ఈ పేరు వింటే చాలు సినీ సంగీతాభిమానులు అద్భుతమైన సంగీత లోకం లోకి వెళ్లిపోతారు. అద్భుతమైన గొంతు, అంతకు మించిన శాస్త్రీయ పరిజ్ఞానం సిద్‌ శ్రీరామ్‌ను ఈ డికేడ్‌ సింగర్‌గా మార్చివేసింది. పొద్దున్నే సిద్‌ శ్రీరామ్‌ పాట వింటే చాలు.. ఆ పరిమళం, మోహం ఆ రోజంతా వెంటాడుతుంది.  ఎన్ని సార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది..దటీజ్‌ వెర్సటైల్‌ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ మ్యాజిక్‌. 

సిద్‌  శ్రీరామ్‌ మెలోడియస్‌గా, రొమాంటిక్‌గా  ఒక పాట పాడితే  చాలు ఆ సినిమా హిట్‌ గ్యారంటీ అన్న రేంజ్‌లో సిద్‌ హవా నడుస్తోంది.  శ్రీరామ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి శ్రీరాం వ్యాపారవేత్త. తల్లి లత సంగీతం టీచర్‌. ఇంట్లోనే సంగీత నేపథ్యం ఉండటంతో సహజంగానే సిద్ కు  సంగీతం ఆసక్తి ఏర్పడింది. తొలి గురువు అమ్మ ద్వారా కర్ణాటక సంగీతంలో మరింత రాణించాడు. తల్లిదండ్రులతో కలసి కాలిఫోర్నియాకు వెళ్లిన సిద్‌ బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో చేరాడు. మ్యూజిక్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. కర్ణాటక కచేరీలను కూడా నిర్వహించేవాడు. సిద్‌ చెల్లెలు పల్లవి శ్రీరాం భరతనాట్య కళాకారిణి కావడం విశేషం

2013లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ఎ.ఆర్.రెహమాన్ స్వరపరచిన కదల్ కోసం పాడిన అడియే పాటతో వెలుగులోకి వచ్చాడు సిద్‌ శ్రీరామ్‌.  ఆ తరువాత 2015లో ఐ మూవీలోని "ఎన్నోడు నీ ఇరుంతాల్ " సాంగ్‌తో మరింత పాపులర్‌ అయ్యాడు. ఈ పాటకు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో  హుషారు మూవీలోని  ఉండిపోరాదే , నిన్ను కోరి  సినిమాలో అడిగా అడిగా,  డియర్ కామ్రేడ్ కడలల్లె వేచె కనులే, ఇంకా పడి పడి లేచే  మనుసు, శశి మూవీలోని ఒకే ఒక లోకం నువ్వే, ఇంకా  రోబో 2.0,  ఏబీసీడీ,  మైల్స్ ఆఫ్ లవ్ లాంటి  పలు మూవీస్‌లో రొమాంటిక్ ట్రాక్‌లతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు.

ముఖ్యంగా గీత గోవిందం సినిమాలో "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె" అంటూ టాలీవుడ్‌లో సంచలనం క్రియేట్‌ చేశాడు. గోపీ సుందర్‌ స్వరపర్చిన ఈ పాట ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. ఇక వరుస ఆఫర్లతో సినీ సంగీతాభిమానులను తన గాత్రంతో మెస్మరైజ్‌ చేశాడు. టాక్సీవాలా,  ఇష్క్‌  తదితర మూవీల్లో పాటలతో అలరించాడు.  సిద్‌ శ్రీరామ్‌ పాటలన్నీ రిపీట్‌ మోడ్‌లో వినాల్సిందే.  

అయితే ఇప్పటి వరకూ శ్రీరామ్ పాడినవన్నీ మెలోడీయస్ గీతాలే. భారతీయ సంగీతంతో పాటు పాప్ మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిధ్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ ఓ ఫోక్ సాంగ్ పాడాడు.  అలాంటి వారందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘నల్లమల’ చిత్రంలో ‘‘ఏమున్నావే పిల్లా ఏమున్నావే’’ అంటూ సాగే అందమైన జానపద గీతాన్ని అంతే అందంగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు. 

ఇక స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ అల వైకుంఠపురంలోని సామజ వర గమనా ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. లేటెస్ట్‌ హిట్‌ సర్కారు వారి పాట మూవీలోని కళావతి సాంగ్‌ కూడా మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ సినీ  నేపథ్య సంగీతంలో తనదైన  మార్క్‌ తో  దూసుకుపోతున్నాడు సిద్‌ శ్రీరామ్‌ .  

మరిన్ని వార్తలు