బంగారు ‘బట్టమేక’ గుట్టు చిక్కింది.. 

2 Jan, 2023 07:41 IST|Sakshi

దేశంలో ఎగిరే పక్షుల్లో ఇవే అతి పెద్దవి.. 

ప్రపంచంలో రెండో భారీ పక్షులు ఇవే

రాష్ట్రంలో 180 పక్షులు ఉన్నట్టు గుర్తింపు

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సంచరిస్తున్న అరుదైన పక్షులు

వీటి కోసం రోళ్లపాడు, సుంకేశుల సమీపంలో సంరక్షణ కేంద్రాలు

క్రూర జంతువుల దృష్టిని మరల్చటంలో బట్టమేక పక్షులు బహుతెలివైనవి. గుడ్లను, పిల్లలను కాపాడుకోవటానికి ఆడ పక్షులు వంకర టింకరగా.. ఒక రకమైన నాట్యం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా బట్టమేక పక్షుల్లో 22 రకాల జాతులు ఉండగా.. భారత్‌లోని బంగారు బట్టమేక పక్షులు అత్యంత అరుదైనవి. వీటిలోనూ నాలుగు జాతులు ఉండగా.. ఏపీలో సంచరించే బంగారు బట్టమేక పక్షులే అతి పెద్దవి.. బలిష్టమైనవి. ఈ పక్షులు అవకాశవాద భక్షులు. అంటే తాము నివసించే ప్రాంతంలో ఏవి దొరికితే వాటిని తిని బతికేస్తాయి. అయినా.. వీటి మనుగడకు అనువైన పరిస్థితులు లేక అతి త్వరగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేరాయి.

సాక్షి, అమరావతి: పొడవాటి తెల్లటి మెడ, బంగారు లేదా గోధుమ వర్ణంలో వీపు, మెడలో తెలుపు–నలుపు ఈకల హారం, తలపై నల్లని టోపీతో బట్టమేక పక్షులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రపంచంలోనే అరుదైన బట్టమేక (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) పక్షులు మన రాష్ట్రంలో 180 వరకూ ఉన్నట్టు గుర్తించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇవి సంచరిస్తుంటాయి. బట్టమేక పక్షులు ఏపీతోపాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇవి  సంచరిస్తుంటాయి. సుమారు మీటరు పొడవు, 14 నుంచి 15 కేజీల బరువు ఉంటాయి.

ఏపీలో సంచరించే బట్టమేక జాతి పక్షులే వీటన్నింటిలోనూ పెద్దవి, బలిష్టమైనవి కూడా. ఎగిరే పక్షుల్లో దేశంలో మొదటి, ప్రపంచంలో రెండవ అతి భారీ పక్షులివి. గడ్డి భూముల్లో సంచరించే ఈ పక్షులు 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి గుడ్లుపెట్టి.. 25–30 రోజులపాటు పొదుగుతాయి. తమకు సమీపంలో ఎలాంటి ఆహారం లభ్యమైనా తిని జీర్ణించుకోగలవు. సాధారణంగా ఇవి కీటకాలు, తొండలు, బల్లులు, చిన్నపాటి పాములు, పండ్లను తిని జీవిస్తాయి. మగ పక్షుల కంటే ఆడ పక్షులు చిన్నవిగా ఉంటాయి. ఇవి సుమారు 75 సెంటీమీటర్ల పొడవు, 4–6 కేజీల బరువు ఉంటాయి. ఆడ పక్షులు ఊదా రంగు తల, మెడతో ఉంటాయి. వీటి రొమ్ముపై పట్టీ ప్రస్ఫుటంగా కనిపించదు. 

అంతరించిపోతున్న జీవులుగా..
అంతరించిపోతున్న బంగారు బట్టమేక (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) పక్షుల పరిరక్షణ కోసం 1988లో నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలోని రోళ్లపాడు వద్ద బట్టమేక పక్షుల సంరక్షణ కోసం 600 హెక్టార్ల భూమిని అభయారణ్యంగా ప్రకటించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా సుంకేçశుల జలాశయం సమీపంలోనూ మరో 800 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడే బట్ట మేక పక్షులు సంచరిస్తుంటాయి. ఇవి తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. మన రాష్ట్రంలో కేవలం 180 పక్షులు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు.

పర్యావరణ వ్యవస్థలో ఇవి కీలకం
అభయారణ్యానికి సమీపంలోని గడ్డి భూములు పంట పొలాలుగా మారడంతో ఈ పక్షుల ఆవాస ప్రాంతాలు తగ్గిపోయాయి. పురుగు మందుల వాడకంతో బట్టమేక పక్షుల ఆహారమైన కీటకాలు విషతుల్యమవడం, నక్కలు ఇతర జంతువులు వాటి గుడ్లు, పిల్లలను తినడం వంటి కారణాలు ఈ పక్షుల ఉనికికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయి. పర్యావరణంలో ముఖ్య భూమిక పోషించే గడ్డి భూముల పరిస్థితిని బట్టమేక పక్షుల ఉనికి తెలుపుతోంది.

ఈ పక్షుల సంచారం బాగుందంటే గడ్డి భూముల పర్యా­వరణం బాగున్నట్టు లెక్క. అందుకే పర్యావరణ వ్యవస్థలో కీలకమైన వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అరుదైన పక్షులను అంతరించిపోకుండా కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రకృతిని కబళిస్తున్న పురుగు మందులు, ఎరువులను తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలి. తద్వారా మన పరిసరాలు, ప్రకృతిని కాపాడుకుని భావితరాలకి బంగారు బట్టమేకని బహుమతిగా అందిద్దాం. 
– డాక్టర్‌ సీఎం సంతోష్‌కుమార్, స్కూల్‌ ఆఫ్‌ బయో సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్, యూకే (నేటివ్‌ ఆఫ్‌ నంద్యాల)

మరిన్ని వార్తలు