జనసేన పవన్‌ వీకెండ్‌ విజిట్స్‌.. కథ అడ్డం తిరిగిందే?

1 Jan, 2023 17:17 IST|Sakshi

ఆయన వీకెండ్ పొలిటీషియన్. చుట్టపు చూపుగా వారాంతంలో అమరావతి వస్తారు. మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతారు. పొత్తు బీజేపీతో.. కానీ అంటకాగేది మాత్రం టీడీపీతో. తనపై హైదరాబాద్‌లో రెక్కీ అంటూ డ్రామాలు.. జనసేన ప్లీనరీకి భూమిలిచ్చిన ఇప్పటం వాసుల ఇళ్లు కూల్చేశారంటూ అబద్దాలు.. ఇలా ఎన్ని కుట్రలు చేసినా జనసేనానికి 2022 వర్కవుట్ కాలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

మరో సంవత్సరం గడిచిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాలేకపోయారు. 2022లోనూ ఆయన వీకెండ్ పొలిటీషియన్‌గానే మిగిలిపోయారు. ఇప్పటికీ కేవలం చంద్రబాబు డైరక్షన్‌లోనే నడుస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మార్చిలో తాడేపల్లి సమీపంలోని ఇప్పటంలో జనసేన ప్లీనరీ నిర్వహించారు. ఆ సభలోనే తన ప్లీనరీకి భూములు ఇచ్చిన ఇప్పటం గ్రామాభివృద్దికి 50 లక్షల రూపాయల విరాళాన్ని పవన్ ప్రకటించేశారు. గ్రామాభివృద్ధికి ప్రకటించిన 50 లక్షలు 9 నెలలైనా ఇప్పటికీ ఇవ్వకపోగా.. మరోమారు ఇప్పటం గ్రామాన్ని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేసిన పవన్ అభాసుపాలయ్యారు. 

తన ప్లీనరీకి స్ధలం ఇచ్చిన ఇప్పటం వాసుల ఇళ్లని ప్రభుత్వం అన్యాయంగా కూల్చేసిందంటూ అబద్దపు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఏ ఒక్క ఇల్లూ కూల్చలేదని అధికారులు ప్రకటించినా పవన్ కళ్యాణ్ మాత్రం ఆవేశంతో రెచ్చిపోయారు. తన పార్టీకి చెందిన 11 మందితో పవన్ కళ్యాణ్ కోర్టులో కేసు కూడా వేయించారు. తాము గతంలో ఆక్రమణదారులందరికీ నోటీసులు జారీ చేశామని, ఏ ఒక్కరి ఇల్లు కూల్చలేదని, రోడ్డు విస్తరణ కోసం కేవలం ప్రహారీ గోడలు మాత్రమే కూల్చామని అధికారులు ఆధారాలతో సహా నిరూపించడంతో జనసేన కుట్రలు బట్టబయలయ్యాయి. నోటీసులు ఇవ్వలేదని హైకోర్టుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆ 11 మందికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పడంతో పవన్ అభాసుపాలయ్యారు.

డామిట్.. రెక్కీ డ్రామా అడ్డం తిరిగింది
హైదరాబాద్‌లో వ్యక్తుల మధ్య జరిగిన వివాదాన్ని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టి తనపై రెక్కీ చేశారంటూ.. తనని చంపాలని చూస్తున్నారంటూ చేసిన హైడ్రామా అంతా ఇంతా కాదు. ఏపీ ప్రభుత్వం తనని హత్య చేయడానికి చూస్తున్నదని.. హై సెక్యూరిటీ కల్పించాలని తన అనుచరులచే పవన్ హడావిడి చేయించారు. హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపితే ఇదంతా వట్టిదేనని తేలింది. పవన్ ఇంటి వద్ద ఎవరూ రెక్కీ చేయలేదని.. పవన్ హత్యకి కుట్ర, సుపారీ అంటూ చెప్పిన మాటలు సొల్లేనని తేలిపోయింది. కేవలం ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అటు పోలీసులని.. ఇటు జనసేన కార్యకర్తలని పరుగులు పెట్టించింది. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లాలని ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ ప్లాన్ బెడిసికొట్టి గప్ చుప్ అయ్యారు.

పొత్తు ఎవరితో? ఆదేశాలు ఎక్కడినుంచి?
ఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఏప్రిల్ నెలలో అనంతపురం జిల్లా నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లో పర్యటించారు. దసరా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ప్లీనరీలో ఆర్బాటంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటూ తన పర్యటనలని పోస్ట్ పోన్ చేసుకున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తుపై ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. గత మూడున్నర ఏళ్ళుగా జనసేన.. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్నప్పటికీ కలిసి ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు.

వచ్చే ఎన్నికలలో జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయని కాషాయ నేతలు అంటుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తానని పవన్ అంటున్నారు. పేరుకి బీజేపీతో జనసేన మైత్రి కొనసాగుతున్నా, టీడీపీతో పొత్తుకే పవన్ కళ్యాణ్ మొగ్గుచూపుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నవంబర్ నెలలో విశాఖ పర్యటనకి వచ్చిన ప్రధాని మోదీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2014 తర్వాత ఇదే ప్రధానిని కలవటమని.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆ భేటీ తర్వాత పవన్ మీడియా ముందు ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు.

శృతి మించిన అల్లర్లు
విశాఖలో రైతు భరోసా యాత్ర పేరుతో చేసిన హంగామాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పవన్ హడావిడి శృతిమించి ప్రజలకి ఇబ్బంది కలిగించడంతో పోలీసులు ఆయన్ని వెనక్కి పంపించేశారు. నిబంధనలకి విరుద్దంగా వ్యవహరించినందుకు పోలీసులు  నోటీసులు ఇవ్వడంతో దానిని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. విజయవాడ వచ్చిన పవన్ దగ్గరకి.. పరామర్శ పేరుతో చంద్రబాబు వాలిపోవడం రాజకీయ దుమారమే లేపింది. పవన్, చంద్రబాబు మధ్య పొత్తు చర్చలే జరిగాయని రాజకీయ గాసిప్స్ మొదలయ్యాయి. ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడతామని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కలిసి ప్రయాణం చేయడానికే దీన్ని వేదిక చేసుకున్నారంటున్నారు. కాదు కలవడానికే ఈ డ్రామా నడిపించారని మరికొందరి మాట. 

అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దూరంగా ఉంటే కదా.. కొత్త పొత్తులు కాదు.. పాత పొత్తులే అంటూ అధికార పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. మొత్తంగా 2022లో జనసేన బండి గాడి తప్పి ప్రజా సమస్యలపై కంటే ప్యాకేజీ వ్యవహారాలపైనే ఫోకస్ చేశారంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకి ఏ అంశంపైనా పోరాడటానికి వీలు లేకుండా పోయిందని అందుకే జనసేన.. టీడీపీ పల్లకీ మోస్తూ భజనసేనగా మారిందనే చర్చ నడుస్తోంది. 

పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు