మూగనేస్తాలు.. మౌనభావాలు..

12 Jan, 2023 09:06 IST|Sakshi

మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. పక్క పక్కనే ఇళ్లు ఉంటున్నా.. అంటీముట్టనట్లుగా ఉండటం పరిపాటిగా మారింది. మనసు విప్పి మాట్లాడుకోవటం మాని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో సావాసం చేయడం అధికమైంది. పల్లెటూళ్లలో కాస్త కలివిడితనం ఉంటున్నా.. పట్టణాల్లోని కాంక్రీట్‌ వనాల్లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా జీవనం సాగుతోంది. ఈ కోవలో ఏదో కోల్పోయిన భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మూగజీవాలతో స్నేహం కాస్త ఊరటనిస్తోంది. మాటలు రాకపోయినా మనసుకు దగ్గరయ్యే స్వభావం ప్రశాంతత చేకూరుస్తోంది. 
– పి.ఎస్‌.శ్రీనివాసులు నాయుడు/కర్నూలు డెస్క్‌

చెట్టుపై నిద్రపోయిన పక్షులన్నీ తెల్లారింది లెవండోయ్‌ అన్నట్లు ఒక్కసారిగా పైకి లేచి ఆహార వేటకు పయనమవడం.. గంప కింద కోడి కొక్కొరొక్కోమని మేల్కొలపడం.. పిడికెడంత కూడా లేని పిచుకలు కీచుకీచుమంటూ ఇంటి ముందు వాలి గింజల కోసం వెతుకులాడటం.. పెంపుడు కుక్కలు యజమాని వెంట పొలం బాట పట్టడం.. పశువులు పొలం పనులకు సిద్ధమవడం.. ఇదీ పల్లె జీవనం. మనిషి జీవితంలో ఈ మూగప్రాణాలు ఓ భాగం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ వీటితో అనుబంధం క్రమంగా తగ్గిపోతోంది. యాంత్రిక జీవనంలో మునిగితేలుతూ మానసిక ఆనందాన్ని కోల్పోతున్న వేళ ఇప్పుడిప్పుడే మూగ ప్రాణుల మీద మమకారం పెరుగుతోంది. డబ్బు పోయినా పర్వాలేదు.. మనసు విప్పి మాట్లాడితే మనసుకు సాంత్వన లభిస్తుందనే అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది. 

కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న ఖలీల్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతనికి చిన్నప్పటి నుంచి మూగజీవాలంటే ప్రాణం. మొదట కుక్కలు, పిల్లులతో సావాసం చేసినా, ఐదేళ్లుగా పక్షులను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. సాధారణంగా ఒకటో, రెండో పక్షులను ఓ చిన్న కేజ్‌లో బంధించి అమితమైన ప్రేమను చూపడం సహజం. ఇందుకోసం వెచ్చించే డబ్బు కూడా వేలల్లోనే ఉంటుంది. అయితే ఇతను తన ఇంటి ఆవరణనే పెద్ద బోనుగా మలచడం విశేషం. పక్షుల స్వేచ్ఛా విహంగానికి అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ బోనుకు చేసిన వ్యయం అక్షరాలా రూ.3లక్షల పైమాటే. ఇక ఈ ఐదేళ్లలో అతను పెంచుతున్న పక్షుల ఖరీదు రూ.7లక్షల పైనే కావడం చూస్తే ఆ మూగ ప్రాణులు అతని జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో తెలుస్తోంది. ఇంతే కాదు.. ప్రతినెలా వీటికి చేస్తున్న ఖర్చు రూ.5వేల వరకు ఉంటోంది. 

కింద పడితే తినవు.. 
డబ్బు విలువ పెరుగుతున్న కొద్దీ ఆహారం దొరకడం కూడా కష్టతరమవుతోంది. నిరుపేదలు ఇప్పటికీ దుర్భర జీవనం గడపటం చూస్తున్నాం. కొందరికి డబ్బు ఎక్కువై ఆహార పదార్థాలను వీధులపాలు చేస్తే.. ఇప్పటికీ ఆ విస్తర్లకేసి చూసే జనం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్ని పక్షుల విషయానికొస్తే.. కింద పడిన గింజలను ముట్టుకోవంటే ఆశ్చర్యమేస్తుంది. యజమాని ఎంతో ఇష్టంగా వాటి నోటికి అందించే దేనినైనా తినే ఈ పక్షులు, నోరు జారితే వాటికేసి కూడా చూడకపోవడం వింతేమరి. 
కుటుంబ సభ్యుల్లానే.. పక్షుల పెంపకం కుటుంబంలో భాగమవుతోంది. వీటి పెంపకం కాస్త కష్టమే అయినా ఇష్టాన్నిపెంచుకుంటే కుటుంబ సభ్యుల తరహాలోనే దగ్గరవుతున్నాయి.

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొద్దిసేపు పక్షులతో గడిపితే మానసిక ఆనందం లభిస్తుందని పక్షుల ప్రేమికులు చెబుతున్నారు. ఇక ఉదయాన్నే పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే పిల్లలు సైతం వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వీటిపై అమితమైన ప్రేమను చూపుతూ స్నేహితుల్లా భావిస్తుండటం విశేషం. 

కదలికలు పసిగట్టి.. బాధ తెలుసుకొని 
పక్షుల పెంపకం కత్తి మీద సాములాంటిదే. వాటితో ఎంత అభిమానం పెంచుకుంటే అంత దగ్గరవుతాయి. కొన్నాం.. తెచ్చుకున్నాం.. అని కాకుండా, ప్రతి రోజూ వాటితో కొంత సమయం గడిపినప్పుడే ఏం తింటున్నాయి, ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలు తెలుస్తాయి. ముందు రోజు వేసిన ఆహారం తినకపోతే ఏదో అనారోగ్యంతో ఉన్నట్లుగా గుర్తిస్తారు. లేదా కదలికలు రోజులాగా ఉండకపోయినా ఏదో బాధలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ మేరకు వాటికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం వీటికి వ్యాక్సినేషన్‌ చేయిస్తే ఆరోగ్యంగా ఉంటాయని యజమానులు చెబుతున్నారు. 

పెరుగుతున్న పక్షుల విక్రయ వ్యాపారం 
మారుతున్న ప్రజల అభిరుచి వ్యాపార పరంగానూ అభివృద్ధి చెందుతోంది. అక్వేరియంలతో పాటు వివిధ రకాల పక్షులు, కుందేళ్ల విక్రయ దుకాణాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. దుకాణాల్లో పక్షులను ఉంచేందుకు రంగురంగుల పంజరాలు ఉంటున్నాయి. వీటికి అవసరమైన ఆహారాన్ని కూడా యజమానులు దుకాణాల్లోనే విక్రయిస్తున్నారు. పక్షుల పెంపకానికి అవసరమైన సామగ్రిని చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారు. 

తాబేళ్లలో వివిధ రకాలు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లు, గోల్డ్‌ రంగు తాబేలు, గ్రీన్‌ తాబేళ్లు తదితరాలు. వీటిలో గ్రీన్‌ తాబేలు అమ్మడానికి, పెంచడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా ఇళ్లలో ఈ తాబేళ్లు కనిపిస్తున్నాయి. వీటి ధర రూ. 500 నుంచి రూ.2 వేల వరకు ఉంటోంది. 

దీపావళి అంటే దడ
పక్షులకు దీపావళి వస్తే దడ. టపాసుల శబ్దాలకు బెంబేలెత్తుతాయి. కొన్ని పెంపుడు పక్షులు ఆ శబ్దాలకు హార్ట్‌ స్ట్రోక్‌కు గురవుతాయి. దీపావళి సమయంలో వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తప్పవని యజమానులు చెబుతున్నారు.  

వాటితో గడిపితే సమయమే తెలియదు 
మనిషికి కష్టం వస్తే మాటల్లో చెప్పుకోగలం. పక్షులు తమ బాధను చెప్పుకోలేవు. మనమే అర్థం చేసుకోవాలి. ఉదయం లేవగానే వాటి వద్దకు వెళ్లడం, వాటి బాగోగులను పరిశీలించడం.. స్నేహంగా మెలగడం నా దినచర్యలో భాగమైంది. కనీసం ఓ గంట వాటితో ఉంటే ఏదో తెలియని ఆనందం నాలో కలుగుతుంది. కొత్త వ్యక్తులు వీటి దగ్గరకు వస్తే పెద్ద శబ్దాలు చేస్తూ అటూఇటూ ఎగురుతుంటాయి. నేను కనిపించగానే ఎంతో ప్రేమతో నా మీద వాలిపోతాయి. మనుషుల్లో మానవత్వం లోపిస్తున్న వేళ ఇలాంటి మూగప్రాణులు ఎంతో ప్రేమను కురిపిస్తాయి. ఎంత డబ్బిస్తే ఈ ఆనందాన్ని కొనగలం. 
– ఇర్ఫాన్‌ అహ్మద్‌ ఖాన్, కృష్ణానగర్, కర్నూలు 

పావురాల పెంపకం ఎంతో ఇష్టం 
చిన్నతనం నుంచి పావురలంటే అమితమైన ఇష్టం. మొదట్లో నా వద్ద 10 పావురాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎనిమిది రకాలు, వందకు పైగా పావురాలు ఉన్నాయి. ఇంటికి సమీపంలో ఓ షెడ్‌ ఏర్పాటు చేసుకొని పెంచుతున్నా. రేసింగ్‌ హ్యూమర్‌ పావురం ఖరీదు జత రూ.5వేల వరకు ఉంటోంది. 100, 1000 కిలోమీటర్ల పోటీల్లోనూ నా పావురాలు పాల్గొంటాయి. బెట్టింగ్‌ కాకుండా పావురాల్లోని సత్తా చాటేందుకు పోటీలకు వెళ్తుంటాం.  
– షేక్‌ ఇబ్రహీం, కింగ్‌మార్కెట్, కర్నూలు 

 ఇంట్లో మనిషిగానే.. 
మా ఇంట్లో ఐదుగురం ఉంటాం. రెండేళ్ల క్రితం రూ.10వేలతో రెండు పిల్లులను కొనుగోలు చేశాం. వీటిని ముద్దుగా మిన్నూ అని పిలుచుకుంటాం. ఇంట్లో మనిíÙలాగా మారిపోయాయి. బయటకు వెళ్లి నా కొద్దిసేపటికే ఇంటికి చేరుకుంటాయి. వీటి ఖర్చు నెలకు సుమారు రూ.4వేల వరకు ఉంటుంది. వీటి ద్వారా మానసిక ఆనందం లభిస్తోంది.  
– ఇర్ఫాన్, కొత్తపేట, కర్నూలు 

ఆదరణ బాగుంది 
నగరంలో పెంపుడు జంతువులు, పక్షులకు ఆదరణ బాగుంది. ఉన్నతశ్రేణి కుటుంబాల్లో వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. ఇంట్లో బిడ్డల్లా వీటిని ఆదరిస్తుంటారు. పెంపుడు శునకాలతో పాటు పిచ్చుకలు, పలురకాల పక్షులు, కుందేళ్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎక్కువగా  ఇళ్లల్లో అక్వేరియం వుండేందుకు ఇష్టపడుతున్నారు. వివిధరకాల చేపపిల్లలు అందుబాటులో వున్నాయి. బళ్లారి, మైసూర్, హైదరాబాద్‌ నుంచి ఎక్కువగా వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. అభిరుచికి తగ్గట్టు ఖరీదైన పక్షులు, చేపలను పెంచేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యాపారం సంతృప్తి్తకరంగా వుంది.  
– మహబూబ్, దుకాణ యజమాని, కర్నూలు.

మరిన్ని వార్తలు