‘గల్ఫ్‌గోస’పై ప్రపంచం దృష్టి..

12 Nov, 2022 21:54 IST|Sakshi
నిజామాబాద్ జిల్లా ఢీకంపల్లిలో వివరాలు తీసుకుంటున్న ఫ్రాన్స్ కరస్పాండెంట్‌ లీడెల్ఫోలీ

నిర్మాణ పనులు నిలిపివేయడంతో కార్మికులకు ఇబ్బందులు

గల్ఫ్‌ బాధితుల బాధలు తెలుసుకునేందుకు రాష్ట్రంలోని పల్లెలపై యూరప్‌ మీడియా ఫోకస్‌

ఎడారి బాధలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం

ఊళ్లో ఉపాధి లేక గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలెన్నో. అయినవారికి దూరంగా ఎడారి దేశాల్లో అవస్థలు పడుతున్న బాధితులెందరో. ఇన్నేళ్లు మనం చూసిన వారి గోసపై ఇప్పుడు ప్రపంచం దృష్టి పెట్టింది. గల్ఫ్‌ సమస్యలు, బాధితుల పరిస్థితులను యూరప్‌ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఫ్రాన్స్, పోలండ్, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల  మీడియా సంస్థలు కొన్ని వారాలుగా రాష్ట్రంపై ఫోకస్‌ పెట్టాయి. ఆయా సంస్థల జర్నలిస్టులు  తెలంగాణ పల్లెల్లో పర్యటిస్తున్నారు. గల్ఫ్‌ కుటుంబాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి, బాధిత  కుటుంబాల వ్యథను నేరుగా తెలుసుకుంటున్నారు..

దుబాయ్, ఖతార్, సౌదీ, కువైట్‌ తదితర గల్ఫ్‌ దేశా­లకు నిత్యం తెలంగాణ జిల్లాల నుంచి వెళ్తూనే ఉ­న్నా­రు. కార్మికులుగా వెళ్లి.. బాధితులుగా మారిన­వా­రూ మన రాష్ట్రం నుంచే ఎక్కువ. గ్రామీణ నేప­థ్యం, నిరక్షరాస్యత, గల్ఫ్‌ చట్టాలపై అవగాహన లో­పం, చేసే పనులకు సంబంధించి ముందస్తు శిక్షణ లేకపోవడం తదితర కారణాలతోపాటు ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది బాధితులుగా మా­రు­తున్నారు. కొందరు ప్రాణాలనూ కోల్పోతున్నారు. 


జగిత్యాల జిల్లా చిట్టాపూర్‌లో  ఫ్రాన్స్‌ టీవీకి చెందిన జర్నలిస్టు జెర్మైన్‌బేస్లే..

‘ఫుట్‌బాల్‌’ ఆడుకుంటున్నారు
ఈనెల 20 నుంచి డిసెంబర్‌ 18 వరకు ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌కప్‌–2022 జరగనుంది. ఈ ఆట ఆ దేశంలో ఉంటున్న మన కార్మికుల జీవితాలతో ఆడుకుంటోంది. సాకర్‌ వరల్డ్‌కప్‌ నేపథ్యంలో కొన్ని నెలల ముందు నుంచే ఖతార్‌లో నిర్మాణరంగ పనులను నిలిపివేశారు. పలు రంగాలకు ఆంక్షలు విధించారు. రాష్ట్రం నుంచి వెళ్లినవారిలో చాలామంది నిర్మాణ రంగంలోనే ఉన్నారు. ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్రాజెక్టులు లేకపోవడంతో చాలామందిని తిప్పి పంపిస్తున్నారు. మరికొందరికి పనివేళలు, పనిగంటలు, ప్రదేశాలనూ మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులు, గల్ఫ్‌ బాధితుల కుటుంబాల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రపంచ మీడియా ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఓ జాతీయ ఇంగ్లిష్‌ దిన పత్రిక రాసిన కథనం కూడా ఇందుకు కారణమైంది.


బాధిత కుటుంబంతో వీడియోకాల్‌ ద్వారా మాట్లాడుతున్న పోలాండ్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్టు

తెలంగాణ బాట... 
ప్రధానంగా యూరప్‌ దేశాల మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు తెలంగాణ బాట పట్టారు. ఫ్రాన్స్‌ 24 మీడియా సంస్థకు చెందిన ఇండియా, దక్షిణాసియా కరస్పాండెంట్‌ లీ డెల్ఫోలీ రెండురోజులపాటు నిర్మల్, ఆర్మూర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. వెల్మల్, ఢీకంపల్లి, గగ్గుపల్లి గ్రామాల్లో బాధితులతో మాట్లాడారు. ఆర్మూర్‌లోనూ పలువురి నుంచి సమాచారం సేకరించారు. ఫ్రాన్స్‌ టీవీకి చెందిన జర్నలిస్టు జెర్మైన్‌ బేస్లే జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని చిట్టాపూర్‌లో బాధిత కుటుంబాలను కలిశారు.  స్విట్జర్లాండ్‌కు చెందిన వీడియో జర్నలిస్టు జోసెఫ్‌ జగిత్యాల జిల్లా సుద్దపల్లిలో పలు కుటుంబాలతో మాట్లాడా­రు. పోలండ్‌కు చెందిన డారియస్‌ ఫరోన్‌ అనే స్పోర్ట్స్‌ జర్నలిస్టు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన బాధిత కుటుంబాలతో వీడి­యో­కాల్‌ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకు­న్నారు. విదేశా­ల నుంచి వస్తున్న జర్నలిస్టు­లకు, గల్ఫ్‌ కుటుంబాలకు ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వాలూ గుర్తించాలి
ఖతర్‌లో ఫిఫా కప్‌ నేపథ్యంలో కార్మికులను ఇంటికి పంపిస్తున్నారు. కొన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలువులు ఇస్తున్నాయి. కొన్ని ఇవ్వడం లేదు. విదేశీ మీడియా ప్రతినిధులు బాధిత కుటుంబాల పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కార్మికులకు అండగా నిలవాలి. 
– స్వదేశ్‌ పరికిపండ్ల, అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర లేబర్‌ యూనియన్‌ .

మరిన్ని వార్తలు